మహర్షి కార్వే

ABN , First Publish Date - 2020-11-20T06:52:20+05:30 IST

విద్యకు, వికాసానికి దూరంగా, అజ్ఞానానికి, అస్వతంత్రతకు దగ్గరగా, వంటయింటి నాల్గు గోడల మధ్యగా, గృహిణులుగా, వితంతువులుగా, నిత్య దుఃఖితులుగా, సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనను శబ్దీకరించి, వారికి నవప్రపంచ....

మహర్షి కార్వే

విద్యకు, వికాసానికి దూరంగా, అజ్ఞానానికి, అస్వతంత్రతకు దగ్గరగా, వంటయింటి నాల్గు గోడల మధ్యగా, గృహిణులుగా, వితంతువులుగా, నిత్య దుఃఖితులుగా, సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనను శబ్దీకరించి, వారికి నవప్రపంచ ద్వారాలను తెరవడానికి కార్వే ఉద్యమించారు. కార్వేను ఉత్తేజపరిచిన మానవవాదం తరతరాల వరకు భారతీయులకు ధ్రువతారగా భాసిస్తూనే ఉండగలదు.


మానవ జీవితానికి సార్థక్యం, సాఫల్యం ఎందులో వుంది? ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్ం సమాః’- కర్మ చేస్తూ శత సంవత్సరాలు జీవించాలని కోరడమే మానవుడు చేయదగిన పని అని ఉపనిషద్వాణి. ఈ వాక్కును అక్షరాలా తమ జీవితాలలో సార్థకపరచుకున్న కొద్దిమంది మహామహులలో శ్రీ ధోండో కేశవ్ కార్వే ఒకరు. 


ఆంధ్ర దేశంలో వీరేశలింగంగారి వలె మహారాష్ట్రలో కార్వే సంఘసంస్కరణోద్యమానికి తమ జీవితాన్ని ధారవోశారు. పదేళ్ళు తక్కువగా, ఇంచుమించు వీరేశలింగం గారు జన్మించిన కాలంలోనే కార్వే జన్మించారు. ఆయన వలెనే యీయన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఆయన వలెనే యీయన పండితుడు, మేధావి, మానవవాది. వారుభయుల మానవవాదం మహిళాభ్యుదయ కృషి వైపు మొగ్గు చూపడానికి కారణం, ఆ కాలంలో భారతీయ మహిళల పరమ దయనీయ స్థితి. విద్యకు, వికాసానికి దూరంగా, అజ్ఞానానికి, అస్వతంత్రతకు దగ్గరగా, వంటయింటి నాల్గు గోడల మధ్యగా, గృహిణులుగా, వితంతువులుగా, నిత్య దుఃఖితులుగా, సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనను శబ్దీకరించి,, వారికి నవప్రపంచ ద్వారాలను తెరవడానికి శ్రీ కార్వే ఉద్యమించారు. వారి ఉద్యమం సహస్ర ముఖాలుగా సఫలమైనదనడానికి నేడు వివిధ జీవనరంగాలలో భారతీయ మహిళల పురోగమనమే తార్కాణం. 


తమ స్వీయచరిత్రలో ఒక చోట శ్రీకార్వే తానొక ఉన్మత్తుడనని వ్రాసుకున్నారు. ఆయనది సాధారణోన్మాదం కాదు. ప్లేటో పేర్కొన్న ‘డివైన్ మ్యాడ్ నెస్’- దివ్యోన్మాదం. అది ఆయన చేత అసాధారణ కార్యాలనేకం చేయించింది. శుష్క దురాచారాల నెదిరించి వితంతువులకు పునర్వివాహాలు చేయించారు. వితంతూద్ధరణకై సంఘాలను, శరణాలయాలను స్థాపించారు. తమ 49వ యేట మహిళా విద్యాలయాన్ని నెలకొల్పారు. 1916లో దాన్ని భారతీయ మహిళా విశ్వవిద్యాలయంగా విస్తృతం చేశారు. ఆయన సాధించిన ఫలితాలు సర్వ సామాన్యమై పోయిన నేటి రోజులలో ఆయన కృషికి విలువ కట్టడం కష్ట సాధ్యమే. ఆయనను ఉత్తేజపరిచిన మానవవాదం తరతరాల వరకు భారతీయులకు ధ్రువతారగా భాసిస్తూనే ఉండగలదు. 


1962 నవంబర్ 11 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘కీర్తికాయుడు: శ్రీ ధోండో కేశవ్ కార్వే’ నుంచి

Updated Date - 2020-11-20T06:52:20+05:30 IST