తేనెలవాక

ABN , First Publish Date - 2020-12-04T05:45:32+05:30 IST

బ్రహ్మ సమాజం, వీరేశలింగం సంఘ సంస్కరణ వాదం, గిడుగు వ్యావహారిక వాదం, గురజాడ కొత్త కంఠం, టాగోర్ మార్మిక కవిత, గాంధీజీ శంఖారావం, జాతీయవాదం, మానవతావాదం, స్వేచ్ఛకై తపన... అవీ ఆ రోజులు. వీటితో ప్రభావితులైన....

తేనెలవాక

బ్రహ్మ సమాజం, వీరేశలింగం సంఘ సంస్కరణ వాదం, గిడుగు వ్యావహారిక వాదం, గురజాడ కొత్త కంఠం, టాగోర్ మార్మిక కవిత, గాంధీజీ శంఖారావం, జాతీయవాదం, మానవతావాదం, స్వేచ్ఛకై తపన... అవీ ఆ రోజులు. వీటితో ప్రభావితులైన తెలుగు కవులు కొత్త బాణీలో గానం చేసిన రోజులవి. వారిలో కృష్ణశాస్త్రి గారొకరు. ఆ తరం కవులందరు ఒక ఎత్తు. కృష్ణశాస్త్రి గారొక ఎత్తు. వారిలో కృష్ణశాస్త్రి గారే కొంచెం ఎత్తు.


శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రిని మహాకవిగా పేర్కొనడం ఒకప్పుడు ఛాందసులైన వారికి రుచించేది కాదు. ఏ మహాకావ్యం వ్రాశారని ఆయన మహాకవి? అని వారు ప్రశ్నించేవారు. అయినా ఆయన మహాకవే. ‘నాలుగు దిక్కులా నడిమి స్వర్గమ్ములో -ప్రతి గుండె మోసాల నాగనా? ప్రతి గుండె మోసాల మ్రోగునా?’ అంటూ స్వచ్ఛమైన మానవతావాదానికి, ‘నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు’ అంటూ స్వేచ్ఛావాదానికి ఆయన తన కవితలో పట్టాభిషేకం చేశారు. శాస్త్రిగారి కవిత తేనెలవాక. దానిలో మధుర సుషమా సుధాగాన మంజు వాటికలు, విపంచీ విరహకంఠాలు, నిదుర వెన్నెలల దారులు, విభావరీ శాలలు, తారా లతాంత మాలలు, మృదు వసనాంచలముల గుసగుసలు, చరణ మంజీరాల కొసరు జాలి పలుకరింతలు... ఎన్నో కనిపిస్తాయి, ఎన్నో వినిపిస్తాయి. మనస్సును ఆహ్లాదపరుస్తాయి. 


ఆయన పదజాలమే వేరు. అది అచ్చగా ఆయనదే. నిజమైన శబ్దశిల్పి ఆయన. ఆంగ్లభాషను తన అసాధారణ పాండిత్యంతో సుసంపన్నం చేసిన జేమ్స్ జాయిస్ ‘ఫినిగన్స్ వేక్’ నవల వ్రాస్తూ రోజంతా ఆలోచించి ఒక కామా పెట్టేవాడట. మరునాడంతా ఆలోచించి ఆ కామా తీసివేసేవాడట. అతడు ఆ నవల పూర్తి చేయడానికి పదిహేడేళ్ళు పట్టింది. కృష్ణశాస్త్రి గారు కూడా అంతే. ఒక పాట వ్రాయడానికి ఒక గంట నుంచి, వారం రెండు వారాల వరకు ఎంతయినా పట్టవచ్చు. వ్రాసిన దాన్ని పదిసారులైనా మార్చనిదే ఆయన తృప్తిపడరు. ప్రతి మాటకు రంగు, రుచి, వాసన ఉంటాయని ఆయన విశ్వాసం. ఆయన వలె శబ్ద రహస్యాన్ని ఎరిగిన వారు తెలుగునాట ఎందరో లేరు. ఆయన జీవితమే శబ్దాల కోసం తపస్సు. ‘నా వలెనె యాతడున్ముత్త భావశాలి... పాట పదములకై నిత్య పథికుడయ్యె’అని ఎవరి గురించో శాస్త్రిగారు వ్రాసిన మాటలు శాస్త్రి గారికి కూడా వర్తిస్తాయి. 


మరి, ఆయన కవిత్వం వ్రాయడం మొదలుపెట్టిన రోజులు వేరు. బ్రహ్మ సమాజం, వీరేశలింగం గారి సంఘ సంస్కరణ వాదం, గిడుగు వ్యావహారిక వాదం, గురజాడ కొత్త కంఠం, టాగోర్ మార్మిక కవిత, గాంధీజీ శంఖారావం, ప్రథమ ప్రపంచ యుద్ధానంతర నిరాశా నిస్పృహలు, జాతీయవాదం, మానవతావాదం, స్వేచ్ఛకై తపన... అవీ ఆ రోజులు. వీటితో ప్రభావితులైన తెలుగు కవులు కొత్త బాణీలో గానం చేసిన రోజులవి. వారిలో కృష్ణశాస్త్రి గారొకరు. ఆ తరం కవులందరు ఒక ఎత్తు. కృష్ణశాస్త్రి గారొక ఎత్తు. వారిలో కృష్ణశాస్త్రి గారే కొంచెం ఎత్తు.


1975 మే 11 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘మహాకవి: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి’ నుంచి

Updated Date - 2020-12-04T05:45:32+05:30 IST