భక్తుల మధ్యకు తిరుమలేశుడు

ABN , First Publish Date - 2022-09-26T08:04:55+05:30 IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు జరగనున్నాయి.

భక్తుల మధ్యకు తిరుమలేశుడు

రెండేళ్ల తర్వాత నాలుగు మాడవీధుల్లో వాహనాలపై విహరించనున్న మలయప్ప 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ  జూ పెరటాశి రద్దీ దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ

ఎట్టకేలకు వివిధ వాహనాలపై కొలువుదీరి భక్తుల మధ్య మాడవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చేందుకు తిరుమలేశుడు సిద్ధమవుతున్నారు. శ్రీవారు, భక్తుల మధ్య అడ్డంకిగా ఉన్న కరోనా మహమ్మారి తొలగిపోవడంతో రెండేళ్ల తర్వాత వాహన సేవలను ఆలయ నాలుగు మాడవీధుల్లో నిర్వహించనున్నారు. పైగా పెరటాశి మాసం (తిరుమల శనివారాలు) కూడా జత కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు తగ్గట్లుగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. 

తిరుమల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం అంకురార్పణ కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయంలోనే శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన సేనాధిపతిని సర్వాంగసుందరంగా అలంకరించి, విశేష సమర్పణ చేస్తారు. అనంతరం తిరుచ్చి  వాహనంలో ఆశీనులు చేస్తారు. ఆలయం నుంచి బయల్దేరి 7-8గంటల మధ్య నాలుగు మాడవీధుల ఊరేగింపు ఉత్సవం ప్రారంభిస్తారు. ప్రదక్షిణగా పడమరమాడ వీధిలో ఉన్న వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ పుట్టమన్నును సేకరించి నవపాలికల్లో భద్రపరుచుకుంటారు. అనంతరం మిగిలిన మాడవీధుల ఊరేగుతూ ఆలయం చేరుకుంటారు. యాగశాలకు వేంచేసిన తర్వాత అర్చకస్వాములు సంప్రదాయ కైంకర్యాల నడుమ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు నాంది పలుకుతారు. మంగళవారం ఉత్సవర్లతోపాటు పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి, ధ్వజపటాలను మధ్యాహ్నం రెండు నుంచి 3.30 గంటల వరకు నాలుగుమాడ వీధుల్లో ప్రదక్షిణగా ఊరేగించి.. తిరిగి ఆలయానికి వేంచేపుచేస్తారు. ధ్వజస్తంభం వద్ద ఉత్సవర్లు ఆశీనులు కాగా, సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా జరుగుతుంది. దీంతో వెంకన్న వాహనసేవల సంబరం ప్రారంభమవుతుంది. అనంతరం ఉత్సవర్లకు రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేషవాహన ఊరేగింపు ఉత్సవం మొదలవుతుంది. 

పూర్తయిన ఏర్పాట్లు

కొవిడ్‌ తర్వాత తిరుమల వెంకన్న వాహన వైభవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహన సేవలతోపాటు మూలమూర్తి దర్శనం, ప్రసాదాల వితరణ, వసతి తదితర ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని తిరుమల క్షేత్రం సంబరానికి ముస్తాబైంది. భక్తులను ఆకట్టుకునేలా మాడవీధుల్లో రంగవల్లులను తీర్చిదిద్దారు. గ్యాలరీల్లోకి ప్రవేశం, నిష్క్రమణ సమయాల్లో ఎలాంటి తోపులాట, తొక్కిసలాట లేకుండా పటిష్ఠమైన బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఘాట్లు, తిరుమల రహదారులకు ఇరువైపులా గోడలకు రంగులు, ట్రాఫిక్‌ నిబంధనలు తెలిపే సూచిక బోర్డులను పెట్టారు. తిరుమలతోపాటు అలిపిరి వద్ద అదనపు పార్కింగ్‌ స్థలాలను కూడా సిద్ధం చేశారు. మరోవైపు ఎలక్ర్టికల్‌ విభాగం ఆధ్వర్యంలో సౌందర్యవంతమైన విద్యుత్‌ అలంకరణలు చేశారు. ఎల్‌ఈడీ, పార్కాన్‌ లైట్లతో తోరణాలను రహదాల మధ్యలో, చెట్లకు, డివైడర్లకు శోభాయమానంగా అలంకరించారు. పాపవినాశనం టోల్‌గేట్‌ వద్దనున్న కల్యాణవేదికలో ఫలపుష్ప, మ్యూజియం, ఫొటో, ఆయుర్వేదం, శిల్ప ప్రదర్శనశాలలను ముస్తాబు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం, వెలుపల, ప్రధాన కూడళ్లలో పలు రకాలు పూలమొక్కలను ఏర్పాటు చేశారు.  

పటిష్ఠ భద్రత

దాదాపు ఐదువేల మంది పోలీసు, భద్రతా సిబ్బంది తోపాటు పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నారు. సుమారు 2,200 సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. అక్టోబరు ఒకటో తేదీన  గరుడసేవ సందర్భంగా ముందురోజు 30వతేది మధ్యాహ్నం నుంచి, 2వ తేదీ మఽధ్యాహ్నం వరకు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాలను నిషేధించారు. 

నాల్గవసారి పట్టువస్ర్తాలు సమర్పించనున్న జగన్‌

బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. సీఎం జగన్‌ నాల్గవ సారి స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు.

ఏడు రాష్ట్రాలు.. 88 కళాబృందాలు 

టీటీడీ ఽధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి కళాబృందాలు వాహనసేవల్లో పాల్గొననున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల నుంచి కళాకారులు రానున్నారు. ఆయా రాష్ర్టాల జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. వాహనసేవల్లో హిందూ ధర్మప్రచార పరిషత్‌ నుంచి 50, దాససాహిత్య ప్రాజెక్ట్‌ నుంచి 24, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ నుంచి 14 కలిపి మొత్తం 88 కళాబృందాలు పాల్గొనున్నాయి. ఏపీ నుంచి 63 బృందాల్లో కళాకారులు పాల్గొంటారు. 

సర్వభూపాల వాహనం ట్రయల్‌ రన్‌

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్ఠతను పరిశీలించేందుకు ఆదివారం టీటీడీ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మలయప్పస్వామి విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈవాహనసేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు. వాహనమండపంలో నుంచి మాడవీధుల్లో కొంతదూరం తీసుకెళ్లి లోటుపాట్లను గుర్తించారు. ఆలయ పేష్కార్‌ శ్రీహరి, పారుపత్తేదారు ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



భక్తుల మధ్య వాహన సేవలు.. శుభపరిణామం

భక్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించుకోవడం శుభపరిణామం. వాహన సేవలతోపాటు ఆలయంలో కైంకర్యాల నిర్వహణకు మొత్తం 52 మంది అర్చకులు అందుబాటులో ఉన్నారు.  వాహనసేవల్లో అర్చకులందరికీ అవకాశమిచ్చే ఏర్పాట్లు చేశాం. ప్రతి ఏడాదీ గరుడవాహనసేవకు కొత్తవారికి అవకాశమిస్తాం. కైంకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవ చేస్తాం.

- ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు


కంకణ భట్టాచార్యులుగా ఏఆర్‌ శేషాచలం దీక్షితులు

బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా తిరుపతమ్మ కుటుంబానికి చెందిన ఏఆర్‌ శేషాచలం దీక్షితులు వ్యవహరించనున్నారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో అర్చకుల్లో ఒక్కరిని కంకణ భట్టాచార్యులుగా నియమిస్తారు. ఈ క్రమంలోనే జ్యేష్టాభిషేకం, వసంతోత్సవాలు వంటి కైంకర్యాలను విజయవంతంగా నిర్వహించి శ్రీవారి ఆలయంలో అర్చకుడిగా వ్యవహరిస్తున్న శేషాచలం దీక్షితులను ఈ ఏడాది కంకణభట్టాచార్యులుగా ఎంపిక చేశారు. 

Updated Date - 2022-09-26T08:04:55+05:30 IST