మహా మృత్యుంజయ పాశుపత హోమం

ABN , First Publish Date - 2021-05-17T05:40:51+05:30 IST

లోక కళ్యాణార్థం కోసం శ్రీశైలంలో మహా మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహిస్తున్నారు. స్వామివారి యాగశాలలో దేవస్థానం ఆదివారం ఉదయం ఈ హోమాన్ని ప్రారంభించింది.

మహా మృత్యుంజయ పాశుపత హోమం
మహా మృత్యుంజయ పాశుపతహోమం నిర్వహిన్తున్న అర్చకులు, పాల్గొన్న ఈవో దంపతులు

  1. శ్రీశైలంలో ప్రారంభించిన దేవస్థానం
  2. లోక కల్యాణం కోసం 40 రోజులు నిర్వహణ


 శ్రీశైలం, మే 16: లోక కళ్యాణార్థం కోసం శ్రీశైలంలో మహా మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహిస్తున్నారు. స్వామివారి యాగశాలలో దేవస్థానం ఆదివారం ఉదయం ఈ హోమాన్ని ప్రారంభించింది.  దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహా మృత్యుంజయ మంత్ర పునశ్చరణ పూర్వకంగా 40 రోజులపాటు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ హోమం నిర్వహిస్తారు. కొవిడ్‌ వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని, అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో మహా మృత్యుంజయ పాశుపత హోమాన్ని జరిపిస్తున్నామని ఈవో తెలిపారు. ఈ హోమం విశేష ఫలదాయకమని, హోమాన్ని జరిపిం చడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు. హోమానికి ముందు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిని పూజించారు. శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి, కలశ స్థాపన చేసి, మృత్యుంజయ హోమాన్ని ప్రారంభించారు. ఈ హోమం జూన్‌ 25న ముగియనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు హోమం నిర్వహిస్తారు. భక్తులందరూ  వీక్షించేం దుకు వీలుగా దేవస్థానం ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం టీవీ, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేయనుంది. 

Updated Date - 2021-05-17T05:40:51+05:30 IST