11న మునుగోడులో స్రవంతి నామినేషన్‌

ABN , First Publish Date - 2022-10-05T08:28:09+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఈ నెల 11న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

11న మునుగోడులో స్రవంతి నామినేషన్‌

  • 9 నుంచి 14 వరకు రేవంత్‌ సహా నేతలంతా మునుగోడులో మకాం  
  • ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై 
  • కాంగ్రెస్‌ నేతల భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఈ నెల 11న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ తరుణంలో ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,  పార్టీ అభ్యర్ధి స్రవంతి, ఉప ఉన్నికల ప్రచార వ్యూహ కమిటీ చైర్మన్‌ ఆర్‌.దామోదర్‌ రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌కుమార్‌  తదితర ముఖ్య నేతలు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. ఉప ఎన్నికల ప్రచారం, టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలిచిన మునుగోడు సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని, అందుకు అనుగుణంగా పార్టీ కేడర్‌ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు యూనిట్‌ల వారీగా పార్టీ ప్రతినిధులతో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించాలని, లోటుపాట్లను గుర్తించి మరింత లోతుగా  కార్యకర్తల సేవలను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. 


మండలాల వారీగా పార్టీ నామినేట్‌ చేసిన సమన్వయకర్తలు క్షేత్ర స్థాయికి వెళ్ల లేని పరిస్థితి ఉంటే వారి స్థానంలో ఇతర నాయకులను నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక ‘నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం’ అనే నినాదంతో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంగా మహిళా అభ్యర్ధిని ఖరారు చేసినందున విస్తృత ప్రచారంతో మహిళలకు ఆకట్టుకునేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.  ఈ నెల  9 నుంచి 14 వరకు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్‌ నేతలంతా మునుగోడులో మకాం వేసి కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.  పాల్వాయి స్రవంతి ఈ నెల 11న రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేస్తారు. అలాగే, 14న పెద్ద ఎత్తున జన సమీకరణతో మరోసారి నామినేషన్‌ దాఖలు వేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. సమావేశం అనంతరం పార్టీ అభ్యర్ధి స్రవంతి విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నాయకులతో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం త్వరలోనే  ప్రచారం కోసం మునుగోడులో పర్యటించడానికి వస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ కేడర్‌తో పాటు ఇతర పార్టీల్లోని మహిళా నేతలు అధిక శాతం తన విజయాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు. 

Updated Date - 2022-10-05T08:28:09+05:30 IST