కళ తప్పిన శ్రావణం

ABN , First Publish Date - 2020-08-03T10:27:58+05:30 IST

జిల్లాలో ‘శ్రావణం’ కళ తప్పింది. శుభకార్యాలకు పెట్టింది పేరైన ఈ మాసంలో గతానికి భిన్నంగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి.

కళ తప్పిన శ్రావణం

పెళ్లిళ్లు తగ్గి వెలవెలబోతున్న కల్యాణ మండపాలు

దెబ్బతిన్న సప్లయర్స్‌, డెకరేటింగ్‌, క్యాటరింగ్‌, వీడియోగ్రఫీ రంగాలు

పురోహితులకూ గడ్డుకాలం


తిరుపతి, ఆంధ్రజ్యోతి : జిల్లాలో ‘శ్రావణం’ కళ తప్పింది. శుభకార్యాలకు పెట్టింది పేరైన ఈ మాసంలో గతానికి భిన్నంగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు వెలవెలబోతున్నాయి. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాల్లోనూ మంగళవాయిద్యాల మోతే వినిపించడం లేదు. కరోనా వైరస్‌ రేపుతున్న కల్లోలమే దీనికి కారణమవుతోంది.


శ్రావణమాసం వచ్చిందంటే ఒకటే హడావిడి. నిశ్చితార్ధాలు, వివాహాలు వంటి ఎక్కువగా జరిగేది ఈ నెలలోనే. పెళ్లిళ్ల కోసం కొనే బంగారు ఆభరణాలు, వస్త్రాలతో ఆయా దుకాణాలు కళకళలాడిపోయేవి. ఇక నిశ్చితార్థాలు, పెళ్లిళ్లతో ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు వెలుగులు విరజిమ్మేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా నిశ్చితార్థాలు, వివాహాలు ఆడంబరంగా జరుపుకునే వారి సంఖ్యా పెరిగింది. వీటికి అనుబంధంగా లైటింగ్‌.. ఫ్లవర్‌ డెకరేషన్‌, షామియానా సప్లయర్స్‌, క్యాటరింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పౌరోహిత్యం వంటి రంగాలకూ చేతినిండా పని ఉండి ఆదాయం సమకూరేది. ప్రత్యేకించి తిరుమల, తిరుచానూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో కళ్యాణ మండపాలు అధికం. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం శుభకరమన్న సెంటిమెంటు జిల్లావాసుల్లో ఉంది. అందుకనే శ్రావణమాసంలో ఈ నాలుగు చోట్లా కల్యాణ మండపాలకు డిమాండు ఎక్కువ. 



 ఇదంతా గత తాలూకూ శ్రావణ వైభవం. 

కరోనా ప్రభావంతో ఈ ఏడాది శ్రావణంలో పరిస్థితి తారుమారైంది. శుభకార్యాల సందడి తగ్గిపోయింది. ఒక్కటీ అరా పెళ్లిళ్లే జరుగుతున్నాయి. అది కూడా కనిష్ఠంగా 50 మంది.. గరిష్ఠంగా వంద మంది బంధుమిత్రుల నడుమ. ఎవరూ ఆర్భాటాలకు వెళ్లడం లేదు. పెళ్లికి అనుబంధ రంగాలన్నీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వర్కర్లకు జీతాలూ చెల్లించలేని దుస్థితి. నిర్వహణ భారంగా మారింది. 


తిరుమలలో.. 

నిత్యకల్యాణం పచ్చతోరణంగా పేరొందిన కారణంగా తిరుమలలో ఏడాది పొడవునా పెళ్లిళ్లు జరిగే సంగతి తెలిసిందే. కొండమీద ప్రైవేటు కల్యాణ మండపాలు మండపాలు లేకున్నా టీటీడీకి చెందిన మూడింటితో పాటు వివిధ మఠాలకు చెందిన 30 కల్యాణ మండపాలున్నాయి. శ్రావణంలో అయితే అమావాస్య, పాడ్యమి, మంగళ, శనివారాల్లో మినహా మిగిలిన అన్ని రోజులూ ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. ప్రతి కల్యాణ మండపంలో శ్రావణంలో 12కి పైగానే పెళ్ళిళ్ళు జరుగుతాయి.


అన్నీ కలిపితే ఆ నెలలో జరిగే పెళ్లిళ్లు 300 పైమాటే. మరో వైపు టీటీడీ నిర్వహించే కల్యాణ వేదికమీదే శ్రావణంలో 600 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. మిగతా ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లిళ్లకు అనుమతులిచ్చినా.. తిరుమలలో మాత్రం టీటీడీ అనుమతులివ్వడంలేదు. దీంతో ప్రస్తుత శ్రావణంలో కొండ మీద మంగళవాయిద్యాల చప్పుడే వినిపించడం లేదు. పెళ్లిళ్ల డెకరేషన్‌, క్యాటరింగ్‌ సహా అన్ని ఏర్పాట్లూ చేసే కాంట్రాక్టర్లు 27 మంది ఉండగా.. ఒక్కొక్కరి వద్దా 30 మందికి పైగా వర్కర్లు పనిచేస్తున్నారు. నిర్వాహకుల ఆదాయం అటుంచి వర్కర్లకు జీతాలు, సామగ్రి నిల్వ ఉంచుకునే గదులకు అద్దెలు చెల్లించడం కష్టంగా మారింది. 


శ్రీకాళహస్తిలో.. 

దక్షిణకాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో 50 దాకా చిన్నా పెద్దా కల్యాణ మండపాలున్నాయి. ఇందులో దేవస్థానానివే మూడు. ప్రతి మండపంలో కనీసం 10-12 పెళ్లిళ్లు జరిగేవి. ఇపుడు కొన్నింటిలో ఒకటీ రెండూ జరగ్గా.. చాలా మండపాల్లో బోణీయే కాలేదు. జాతకాలు చూసి.. పెళ్లిళ్లు చేయించే పురోహితుల సంఖ్య వందకు పైగానే ఉంది. గతేడాది శ్రావణంలో చాలామందికి ఊపిరి సలపని పని. ఒక్కొక్కరూ పదుల సంఖ్యలో పెళ్ళిళ్ళు నిర్వహించగా.. ఇప్పుడు ఒకట్రెండు పెళ్లిళ్లు కూడా దొరకడం లేదు. 58 వరకున్న సప్లయర్స్‌, 70 వరకున్న క్యాటరర్స్‌, 50 మంది దాకా వున్న లైటింగ్‌, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వందకు పైగా వున్న ఫొటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ పరిస్థితీ ఇదే. 


చేతినుంచి కడుతున్నా!..గురవయ్య, లీజుదారు, అమరజ్యోతి కళ్యాణ మండపం, శ్రీకాళహస్తి

పోయిన శ్రావణంలో 12 పెళ్లిళ్లు జరిగాయి. ఈ శ్రావణంలో ఇంత వరకూ ఒక్కటీ జరగలేదు. పెళ్లిళ్లు జరగకపోయినా నెలనెలా కరెంటు ఛార్జీలు కట్టాల్సిందే. వర్కర్లకు జీతాలూ ఇవ్వాల్సిందే. వీటన్నింటినీ చేతి నుంచి వేసుకుని కడుతున్నాం. 


ఈసారి రెండే దొరికాయి!..కేవీవీఎస్‌ భాస్కర జోషి శర్మ, పురోహితుడు, శ్రీకాళహస్తి

గతేడాది శ్రావణమాసంలో 13 పెళ్లిళ్లకు పౌరోహిత్యం చేశా. చాలా నిశ్చితార్థాలు చేయించా. ముహూర్తాలు పెట్టడం, జాతకాలు చూడడం వంటి పనులతో ఆ నెలంతా అసలు తీరికే లేదు. ఈ నెలలో జాతకాలు, ముహూర్తాల కోసం ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. రెండు పెళ్లిళ్లు మాత్రం జరిపించే అవకాశం దొరికింది.


కాణిపాకంలో..

విఘ్ననాథుని క్షేత్రమైన కాణిపాకంలో 30 కల్యాణ మండపాలున్నాయి. ఏటా శ్రావణంలో ఒక్కో మండపంలో కనీసం ఐదు నుంచి పది  పెళ్లిళ్లయినా జరిగేవి. నెలంతా కలిపితే వందకుపైగా పెళ్లిళ్లు జరిగేవి. వీటిపై ఆధారపడి డెకరేటర్స్‌, క్యాటరర్స్‌, పురోహితులూ పలువురున్నారు. చిత్తూరు నుంచీ ఈ రంగాలకు చెందిన వారు కాణిపాకంలో జరిగే పెళ్లిళ్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది శ్రావణంలో మండపాల దగ్గర చడీచప్పుడు లేదు.


అందుకని ఒకరిని పెట్టుకుని తొమ్మిది మంది వర్కర్లను తొలగించాల్సి వచ్చిందని ఎల్‌బీ ఫంక్షన్‌ హాల్‌ యజమాని ఎల్‌బీ నాయుడు తెలిపారు. గతేడాది శ్రావణంలో 15 పెళ్లిళ్లు చేసిన తాను ప్రస్తుతం ఒక్కటీ లేదని పురోహితుడు చంద్రశేఖర స్వామి పేర్కొన్నారు. కనీసం ముహూర్తాల కోసం కూడా ఎవరూ రావడం లేదన్నారు. సప్లయర్స్‌ గోడౌనుకు అద్దె కట్టడం కష్టంగా మారిందని సప్లయర్స్‌ యజమాని భూషణం ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి రెండంటే రెండు పెళ్లిళ్లకే అవకాశం వచ్చినా నష్టానికే చేశామని, వర్కర్లకు అప్పుచేసి జీతాలిస్తున్నామని జేకేఆర్‌ డెకరేటర్స్‌ యజమాని రఘు పేర్కొన్నారు. 


తిరుపతిలో.. 

తిరుపతి, తిరుచానూరు పరిధిలో 130 కల్యాణ మండపాలు రిజిస్టరయ్యాయి. ఇవిగాక చిన్నా చితకా కల్యాణమండపాలు, స్టార్‌ హోటళ్లోని ఫంక్షన్‌ హాళ్లు మరో వంద వరకున్నాయి. శ్రావణమాసంలోని ముహూర్తాల్లో ఇవన్నీ ఖాళీ ఉండవు. ఇప్పుడు ఆ సందడే లేకుండా పోయింది. 


 అందరికీ ఇబ్బందే...మాధవరావు, శ్రీ శ్రీనివాస పద్మావతి మ్యారేజ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

లాక్‌డౌన్‌తో మాఘమాసం నుంచి శ్రావణమాసం వరకు ఒక్క పెళ్లీ లేదు. ఈవృత్తినే నమ్ముకున్న లైటింగ్‌,  నాయీ బ్రాహ్మణులు, క్యాటరింగ్‌, పూల వృత్తుదారులు,దాదాపు 5 వేలపైనే ఉన్నారు. గతేడాదీ పెద్దగా పెళ్లిళ్లు జరగలేదు. ఈసారి బాగా ఉంటాయని అప్పుచేసి పెద్దస్థాయిలో సెట్టింగులు తెచ్చిపెట్టుకున్నాం. 120 మంది ఈవెంట్‌ ఆర్గనైజర్ల పరిస్థితీ ఇదే. నాకు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. గత ఏడాదిలోనే పది కల్యాణమండపాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెలిశాయి. 


కరెంటు బిల్లులూ కట్టలేకున్నా .. కేశవ, కొండ సప్లయర్స్‌, తిరుపతి

తిరుపతిలో 182 మంది సప్లయర్స్‌ ఉన్నాం. శ్రావణమాసంలో ఆర్డర్లు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఎలాంటి ఆర్డర్లు రాలేదు. షామియానా షాపులకు అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. 


కరోనాతో నష్టపోతున్నాం..లోకనాథం, వెన్నెల క్యాటిరంగ్‌

శ్రావణ మాసంలో రోజుకు 500 మందికి క్యాటరింగ్‌ చేసేవాళ్లం. ఇప్పుడు వారంలో రెండు రోజులు పాటు 50 మందికి, 100 మందికి భోజనాలు కావాలని అడుగుతున్నారు. 20 భోజనాలు కావాలన్నా చేసిస్తున్నాం. 20 మంది వరకు పనిచేస్తున్నారు. కరోనాతో నష్టపోతున్నాం. 


పురోహితులపైనా ప్రభావం ..ఎన్‌.శ్రీనివాసరావు, పురోహితుడు

పురోహితులైన మాకు పౌరోహిత్యమే జీవనాధారం.  శ్రావణమాసంలో పెళ్లిళ్లు జరగకపోవడంతో బతుకుదెరువు లేక నానా అవస్థలు పడుతున్నాం. తిరుపతి పరిధిలో సుమారు 5వేల మంది ఉన్నాం. ఐదు నెలలుగా పౌరోహిత్యాల్లేక ఇబ్బంది పడుతున్నాం.


పసిడి విక్రయాలపై కరోనా దెబ్బ


చిత్తూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు పసిడి వ్యాపారం చతికిలబడింది. ఇబ్బడిముబ్బడిగా శుభకార్యాలు జరిగే శ్రావణమాసంలో కిటకిటలాడాల్సిన బంగారు దుకాణాలు లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. రికార్డుస్థాయికి పసిడి ధరలు పెరిగినా 20శాతానికే వ్యాపారాలు పరిమితమవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండువేల చిన్నాపెద్దా బంగారు దుకాణాల్లో సగటున నెలకు రూ.200 కోట్లు, వెండి రూ.వంద కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. తిరుపతి సహా అన్నిప్రాంతాల్లోనూ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో శ్రావణమాసంలో రద్దీతో కిటకిటలాడాల్సిన జువెలరీ దుకాణాలు తాళాలతో దర్శనమిస్తున్నాయి. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతున్నా కరోనా దెబ్బకు పెద్ద దుకాణాల్లో 20 నుంచి 25 శాతానికి మించి విక్రయాలు జరగడం లేదు. వ్యాపారం లేక చిన్న దుకాణ యజమానులు, ఈ వృత్తిపై ఆధారపడిన వర్కర్లు అవస్థలు పడుతున్నారు. 


నిరాశ చెందుతున్న వ్యాపారులు.. 

ఏటా శ్రావణమాసంలో చిత్తూరు నగరంలో రూ.70కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ సారి పెళ్లిళ్ల సందడి లేకపోవడంతో దుకాణాల మూతతో రూ.6కోట్లకు మించదని వ్యాపారులు అంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు పదిగ్రాముల బంగారం ధరఽ(22 క్యారెట్ల 916 కేడీఎం రకం) రూ.38వేలుండగా, ప్రస్తుతం రూ.50,500కి చేరింది. కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 55,500గా ఉంది. శ్రావణం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో, అవసరమైన వారే బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెరిగిన ధరలు కూడా విక్రయాలపై ప్రభావం చూపుతోందని చెప్పవచ్చు. 


ఇబ్బందులు పడుతున్నాం..రవి, జువెలరీ, డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు 

 ఏటా శ్రావణమాసంలో మా దుకాణంలో రూ.8కోట్ల వ్యాపారం జరుగుతుండగా, ఈమారు రూ.2కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు బంగారం వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. పసిడి ధరలు తగ్గి, వైరస్‌ అదుపులోకి వచ్చేదాకా ఇబ్బందులు తప్పేలా లేవు.


కుటుంబ పోషణ కష్టమైంది ..వెంకటేష్‌ ఆచారి, చిత్తూరు

 ప్రతిరోజూ తీరిక లేకుండా పనిఉండేది. నెలకు వచ్చే రూ.30వేల సంపాదనతో హ్యాపీగా జీవనం గడిచేది. లాక్‌డౌన్‌తో పనులు దొరకడం కష్టంగా మారింది. నెలంతా పనిచేసినా రూ.5వేలు దాటక పోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నా. 

Updated Date - 2020-08-03T10:27:58+05:30 IST