Sputnik V వ్యాక్సిన్ హైదరాబాద్‌కు వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2021-05-01T19:24:10+05:30 IST

స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి మరి కాసేపట్లో హైదరాబాద్‌కు

Sputnik V వ్యాక్సిన్ హైదరాబాద్‌కు వచ్చేస్తోంది!

న్యూఢిల్లీ : స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి మరి కాసేపట్లో హైదరాబాద్‌కు రాబోతోంది. తొలి విడతలో 1,50,000 డోసుల వ్యాక్సిన్ వస్తుంది. ఈ నెలలో మరొక మూడు మిలియన్ల డోసుల వ్యాక్సిన్ వస్తుంది. మాస్కో, న్యూఢిల్లీలలోని దౌత్య వర్గాలు ఈ వివరాలను తెలిపాయి. 


స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ 1,50,000 డోసుల తొలి కన్‌సైన్‌మెంట్‌తో ఓ విమానం శనివారం ఉదయం రష్యా నుంచి బయల్దేరినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అప్పగిస్తారు. ఈ డోసులను ప్రజలకు వ్యాక్సినేషన్ కోసం అప్పగించడానికి ముందు సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నుంచి అనుమతి తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. 


కొత్త జన్యు పదార్థాలను ప్రవేశపెట్టే ప్రక్రియలో వైరస్‌లను ఉపయోగిస్తారు. వీటిలో ఎక్కువగా ఉపయోగపడేవి అడెనోవైరల్ వెక్టార్స్‌. హ్యూమన్ అడెనోవైరల్ వెక్టార్స్ ఆధారంగా స్ఫుత్నిక్ వీ, ప్ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. SARS-CoV-2 వల్ల వచ్చే కరోనా వైరస్ వ్యాధిపై స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. దీనిని మన దేశంలో పరిమిత వినియోగం కోసం ఏప్రిల్ 12న అనుమతి ఇచ్చారు. స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేసుకోవలసి ఉంటుంది. 


స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. రష్యన్ సావరిన్ వెల్త్ ఫండ్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ దీనికి అండదండలు అందిస్తున్నాయి. 


అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, దాదాపు 5 మిలియన్ల స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ బాటిల్స్ జూన్‌లో రష్యా నుంచి మన దేశానికి వస్తాయి. మరో 10 మిలియన్ల బాటిల్స్ జూలైలో వస్తాయి. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో సుదీర్ఘంగా సంభాషించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-05-01T19:24:10+05:30 IST