క్రీడా ప్రాంగణం.. ప్రైవేటుకు

ABN , First Publish Date - 2022-08-07T05:44:54+05:30 IST

ఆటలకు నిలయం.. ఆరోగ్యానికి ఆలయంగా.. అందరికీ అందుబాటులో ఉన్న నరసరావుపేటలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం ప్రైవేటు పరం కాబోతోంది.

క్రీడా ప్రాంగణం.. ప్రైవేటుకు
ఈత కోలను

ఈత కొలను లీజుకు బహిరంగ వేలం

ఇండోర్‌ స్టేడియం, జిమ్‌ లీజుకు సిద్ధం

నిర్వహణ నుంచి తప్పుకుంటోన్న శాప్‌

ఇక నడకకు నగదు వసూలు చేస్తారేమో?

ఇదీ నరసరావుపేటలోని స్టేడియం దుస్తితి

నరసరావుపేట, ఆగస్టు 6: ఆటలకు నిలయం.. ఆరోగ్యానికి ఆలయంగా.. అందరికీ అందుబాటులో ఉన్న నరసరావుపేటలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం ప్రైవేటు పరం కాబోతోంది. ఇంతకాలం ఇక్కడ శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎంతోమంది క్రీడాకారులు ప్రతిభ చూపారు. అయితే ఇది ఇక గతమే అనుకోవాలి. స్టేడియం నిర్వహణ గతంలో కమిటీ ఆధ్వర్యంలో ఉండేది. దీంతో ప్రత్యేకంగా శిక్షకులు ఉండేవారు. వారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ నరసరావుపేట పరిధిలోని క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇస్తుండేవారు. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రైవేటీకరించే దిశగా శాప్‌ అడుగులు వేస్తున్నది. పల్నాడు జిల్లా ఏర్పాటుతో క్రీడా ప్రాంగణాన్ని శాప్‌ తన ఆధీనంలోకి తీసుకున్నది. అప్పటి నుంచి స్టేడియం నిర్వహణను గాలికి వదిలేసింది. వసతులను కూడా నిరుపయోగంగా మారుస్తున్నదన్న విమర్శలున్నాయి. శాప్‌ ఆధీనంలోకి తీసుకోక ముందు స్టేడియం నిర్వహణ కమిటీ చేతిలో ఉండేది. క్రీడాకారులకు అవసరమైన వసతులను దాతల సహకారంతో కమిటీ సభ్యులు సమకూర్చేవారు. ఈత కొలను, జిమ్‌, ఇండోర్‌ షటిల్‌ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమై క్రీడా వస్తువులను కూడా కమిటీ ఉచితంగా అందించేది. అయితే శాప్‌ చేతుల్లోకి స్టేడియం వెళ్లినప్పటి నుంచి వీటన్నింటికి స్వస్తి చెప్పింది. దీంతోపాటు నాలుగు నెలల కాలంలో ఎటువంటి ప్రగతి పనులు చేపట్టలేదు. ఖర్చులేని పనులను మాత్రమే నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో స్టేడియంలోని ఈత కొలను లీజుకు బహిరంగ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇండోర్‌ స్టేడియం, జిమ్‌లను కూడా లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇలా స్టేడియంలోని ఒక్కొక్క విభాగాన్ని లీజుకు ఇచ్చేస్తూ నిర్వహణ నుంచి శాప్‌ తప్పుకుంటున్నది. శాప్‌ తీరుపై క్రీడాకారులు, క్రీడాభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంతో పాటు ఎందరో దాతల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న స్టేడియాన్ని ప్రైవేటీరించే దిశగా శాప్‌ ప్రక్రియ ప్రారంభించడంతో క్రీడాకారులు, క్రీడాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. చివరకు ఇక్కడి వాకింగ్‌ ట్రాక్‌లో నడవాలంటే ఇందుకు కూడా నగదు వసూలు చేసినా అశ్చర్యం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలోనే పెద్ద స్టేడియం..

నరసరావుపేటలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం రాష్ట్రంలోనే అతి పెద్దది. 1997లో నరసరావుపేట ద్విశాబ్ధి ఉత్సవాల సందర్భంగా దాదాపు 20 ఎకరాల్లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఈ స్టేడియాన్ని మానస పుత్రికలా భావించి అభివృద్ధి చేశారు. ఇండోర్‌ కోర్టులు, జిమ్‌లను జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఈత కొలను కూడా ఏర్పాటు చేశారు. బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, వాలీబాల్‌, రన్నింగ్‌ ట్రాక్‌ ఉన్నాయి. స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం నిధులతో పాటు దాతల విరాళాలు కూడా అందజేశారు. మున్సిపాల్టీ నుంచి కూడా నిధులు కేటాయించారు. ఎందరో దాతలు స్టేడియం నిర్మాణానికి విరాళాలు అందించడంతో పాటు ప్రతిభ చూపే క్రీడాకారులను ప్రోత్సహించేవారు. ఇక్కడ క్రికెట్‌లో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారు. ఖేలో ఇండియా వంటి ప్రతిష్ఠాత్మకమైన పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో ఈ స్టేడియానికి జాతీయ స్థాయు గుర్తింపు లభించింది. ఇక్కడ జరిగిన వివిధ పోటీలకు మున్సిపాల్టీ ఆతిథ్యం ఇచ్చింది. 

ప్రైవేటీకరణపై క్రీడాభిమానుల వ్యతిరేకత

క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని పదే పదే చెప్పే ప్రభుత్వం ఇక్కడి స్టేడియం ప్రైవేటీకరణకు అప్పగించడంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి మండలంలో క్రీడా ప్రాంగణం నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఉన్న స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి నిధుల మాట ఎలా ఉన్నా కనీసం స్టేడియంను నిర్వహించేందుకు కూడా శాప్‌ ప్రయత్నించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈత కోలను, ఇండోర్‌ స్టేడియం, జిమ్‌ల వలే వాకింగ్‌ ట్రాక్‌ను కూడా లీజుకు ఇస్తారేమోనన్న అనుమానాలను వాకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2022-08-07T05:44:54+05:30 IST