అథ్లెట్లకూ కరోనా కష్టాలు.. ట్రైనింగ్ కోసం కారు అమ్మేస్తున్న ద్యుతీ చంద్

ABN , First Publish Date - 2020-07-12T01:10:06+05:30 IST

కరోనా కారణంగా దేశం మొత్తం అల్లకల్లోలం అవుతోంది. భారత అథ్లెట్లు కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులు..

అథ్లెట్లకూ కరోనా కష్టాలు.. ట్రైనింగ్ కోసం కారు అమ్మేస్తున్న ద్యుతీ చంద్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశం మొత్తం అల్లకల్లోలం అవుతోంది. భారత అథ్లెట్లు కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పాన్సర్లు లభించక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ కూడా చేరారు. కనీసం ట్రైనింగ్‌ను కూడా కొనసాగించలేని స్థితికి చేరారు. దీంతో ఏం చేయాలో తెలియక తన బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి ఉంచారు. ఈ మేరకు తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. దానికోసం ట్రైనింగ్‌ కొనసాగించాలని అనుకుంటున్నారు. అయితే దానికి కావలసిన డబ్బులు లేవు. కరోనా కారణంగా స్పాన్సర్లు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకోసమే నేను ఎంతగానో ఇష్టపడే బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే ద్యూతీ చంద్‌కు భారత అథ్లెటిక్ ఫెడరేషన్(ఏఎఫ్ఐ) నుంచి ఎటువంటి మద్దతు కూడా లభించడం లేదు. దీనికి కారణం ఆమె ఏఎఫ్ఐ నిబంధనలకు అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోకపోవడమేనని తెలుస్తోంది. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా కిట్ యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తోంది. 2020 జూలై 23న టోక్కో ఒలింపిక్స్ జరగనుండడంతో అప్పటివరకు ట్రైనింగ్ కోసం ద్యూతీకి అవసరమైన ఖర్చును కిట్ యూనివర్సిటీ అందించింది. అయితే ఒలింపిక్స్ వాయిదా పడడంతో ట్రైనింగ్‌ను మరింత కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది.


ఈ నేపథ్యంలో నిధుల కొరత కారణంగా ఆమె తన కారును విక్రయానికి ఉంచారు. ఈ కారు ఆమె ఎంతో ఇష్టంతో మొదటిసారిగా కొనుగోలు చేసిన లగ్జరీ కారు. కారును అమ్ముతున్నందుకు తానేమీ బాధపడడం లేదని, పోటీల్లో పాల్గొనడం వల్లే తాను కారును కొనుగోలు చేయగలిగానని, ఇప్పుడు దీనిని కోల్పోయినా మళ్లీ పోటీల్లో పాల్గొని ఇంకొకటి కొనుక్కోగలననే నమ్మకం తనకుందని ద్యూతీ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-12T01:10:06+05:30 IST