స్వయం‘శక్తి’ని చాటారు..

ABN , First Publish Date - 2021-03-08T05:14:24+05:30 IST

స్వయం శక్తినే నమ్ముకున్న ఆ మహిళలు.. కష్టపడితే తామూ ఎందులోనూ తీసిపోమని సంకల్పం బూనారు. సంఘంగా ఏర్పడి.. ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. టైలరింగ్‌, డెయిరీ ఫారం, పాల ఉత్పత్తి తదితర వాటిల్లో రేయింబవళ్లూ శ్రమించారు. ఒడిదుడుకులు వచ్చినా వెరవకుండా దీటుగా ఎదుర్కొన్నారు.

స్వయం‘శక్తి’ని చాటారు..
సమావేశమైన గ్రూప్‌ సభ్యులు (ఫైల్‌)

దేశంలోనే ఉత్తమ సంఘంగా ఇందిర స్వయం సహాయక గ్రూప్‌ ఎంపిక

 మహిళా దినోత్సవం పురస్కరించుకుని

నేడు ఆన్‌లైన్‌లో అవార్డు ప్రదానం

జిల్లా వ్యాప్తంగా సంఘం సభ్యులకు ప్రశంసలు

స్వయం శక్తినే నమ్ముకున్న ఆ మహిళలు.. కష్టపడితే తామూ ఎందులోనూ తీసిపోమని సంకల్పం బూనారు. సంఘంగా ఏర్పడి.. ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. టైలరింగ్‌, డెయిరీ ఫారం, పాల ఉత్పత్తి తదితర వాటిల్లో రేయింబవళ్లూ శ్రమించారు. ఒడిదుడుకులు వచ్చినా వెరవకుండా దీటుగా ఎదుర్కొన్నారు. అదే సమయంలో తీసుకున్న రుణాన్ని సకాలంలో బ్యాంకుకు చెల్లించి అధికారుల మెప్పు పొందారు. వెలుగు, బ్యాంకు సహకారంతో పైసాపైసా కూడబెట్టుకుని.. కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచి.. పిల్లలకు ఉన్నత చదువులు చదివించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. నేడు దేశంలోనే ఉత్తమ స్వయం సహాయక గ్రూపుగా ఎంపికయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవార్డును అందుకోనున్నారు.  


డెంకాడ, మార్చి 7: డెంకాడ మండల కేంద్రానికి చెందిన ఇందిర స్వయం సహాయక గ్రూప్‌ జాతీయ అవార్డును సాధించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 గ్రూపుల్లో మన రాష్ట్రం నుంచి ఈ ఒక్కటే ఎంపిక కావడం విశేషం. సరైన రీతిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించి మంచి పనితీరు కనబరిచినందుకు జాతీయ స్థాయిలో కితాబు దక్కింది. ఈ నెల 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ గ్రూపు సభ్యులంతా జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నుంచి ఆన్‌లైన్‌లో అవార్డును స్వీకరించనున్నారు. వీరంతా ఢిల్లీ కేంద్రంగా జరిగే  కార్యక్రమంలో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొనాలని డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు కోరారు.

సంఘం ప్రస్థానం ఇలా..

డెంకాడకు చెందిన చొకాకుల చిన్నాలు, సీహెచ్‌ ఆదిలక్ష్మి, ఆర్‌.ఈశ్వరమ్మ, సీహెచ్‌ నాగేశ్వరి, ఎ.మంగమ్మ, సీహెచ్‌ సత్యవమ్మ, సీహెచ్‌ ఆదిలక్ష్మీ, సీహెచ్‌ భవాని, ఆర్‌.పైడమ్మ, సీహెచ్‌ కృష్ణమ్మలు ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. కుటుంబ పోషణ కష్టమయ్యేది. భర్త ఆదాయం సరిపోక.. పిల్లల చదువులు కూడా అంతంతమాత్రంగా ఉండడాన్ని చూసి కలత చెందారు. పరిస్థితులను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమ పడితే సాధించలేనిది ఏదీ ఉండదన్న బలమైన నమ్మకంతో వీరంతా సమావేశమై ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. 1999 నవంబర్‌ 11న ఇందిర స్వయం సహాయక సంఘంగా పది మంది సభ్యులతో రిజిస్ట్రేషన్‌ చేశారు. వెలుగు అధికారులను సంప్రదించి పైసాపైసా కూడబెట్టారు. వీరి ఐక్యతను, సంఘం నిర్వహణ తీరును చూసిన అధికారులు చిన్నచిన్న రుణాలను అందించారు. వాటిని సక్రమంగా తీర్చడంతో బ్యాంకు లింకేజీ రుణాలను పెంచారు. ఈ విధంగా స్ర్తీనిధి, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం, వెలుగు సామాజిక పెట్టుబడి నిధుల ద్వారా ఇప్పటివరకు సుమారు 32 లక్షల రూపాయలను రుణంగా పొందారు. రుణాలను పదిమంది సభ్యులు సమానంగా వినియోగించుకుని టైలరింగ్‌, డెయిరీఫారం, పాడి పశువుల పెంపకంలో దినదినాభివృద్ధి చెందారు. ప్రతీ నెలా సమావేశాలను నిర్వహించడం, బ్యాంకు రుణాన్ని, పొదుపును క్రమం తప్పకుండా చెల్లించడంలో వీరు ఆదర్శంగా నిలిచారు. తాము ఎంపిక చేసుకున్న రంగంలో అప్పుడప్పుడు నష్టాలు ఎదురైనా వాటిని తట్టుకుని నిలబడ్డారు. పిల్లలకు కార్పొరేట్‌ చదువులను చదివించారు. ప్రభుత్వ కొలవులు దక్కించుకునేందుకు వారికి శిక్షణ ఇప్పించారు. నిరంతర కృషి.. సడలని పట్టుదలతో పనిచేసి సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. నేడు జిల్లా, రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఘనతను ఇందిర ఎస్‌హెచ్‌జీ సభ్యులు సాధించారు. 

ఎంతో ఆనందంగా ఉంది

జాతీయస్థాయిలో అవార్డు  రావడం నాకు, మా గ్రూపు సభ్యులకు ఎంతో ఆనందంగా ఉంది. గ్రూపును ప్రారంభించిన నాటి నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వెలుగు, బ్యాంకు అధికారులకు ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన రుణాన్ని సద్వినియోగం చేసుకున్నాం. పొదుపు, రుణాలను బ్యాంకులకు సక్రమంగా జమ చేశాం. ప్రతీ నెలా గ్రూపు సమావేశాలను నిర్వహిస్తూ, సభ్యుల ఆర్థిక లావాదేవీలతో పాటు కుటుంబ కష్టసుఖాలను పంచుకుంటూ ముందుకు సాగాం.

  - చొకాకుల చిన్నాలు, సంఘం అధ్యక్షురాలు

ఆదర్శంగా నిలిచారు

ఇందిరా స్వయం సహాయక గ్రూపు దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ప్రతీ స్వయం సహాయక మహిళా సభ్యులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలను, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా  ఉన్నత స్థాయిలో నిలబడాలి. పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మహిళలే కీలక పాత్ర పోషించాలి.

- ఎల్‌.సత్యనారాయణ , ఏపీఎం డెంకాడ 


Updated Date - 2021-03-08T05:14:24+05:30 IST