స్పాటిఫై యాప్‌తో సంగీతాభిమానులకు మనోల్లాసం

ABN , First Publish Date - 2020-11-06T20:19:16+05:30 IST

సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మ్యూజిక్‌ యాప్‌ స్పాటిఫై. తన ప్రయాణం ప్రారంభించిన కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున సంగీతాభిమానులను సంపాదించుకుంది.

స్పాటిఫై యాప్‌తో సంగీతాభిమానులకు మనోల్లాసం

సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మ్యూజిక్‌ యాప్‌ స్పాటిఫై. తన ప్రయాణం ప్రారంభించిన కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున సంగీతాభిమానులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో శ్రోతలు ఈ యాప్‌కు ఉన్నారు. శంకరాభరణంలో శంకరశాస్త్రి చెప్పినట్లు ‘రసాస్వాదన శుద్ధి ఉండాలే కానీ సంగీతాన్ని ఆస్వాదించడానికి భాషాబేధాలేవీ ఉండవు’ అని చాటుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ లాంటి భాషల సంగీతాన్ని మాత్రమే గాక, యాప్‌లు విస్తృతమైన కాలంలో విభిన్న దేశాల సంగీతాన్నీ ఆస్వాదిస్తున్నారు. పొడ్‌కాస్ట్‌లనూ వినడానికి ఆసక్తి చూపుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో జానపదం మొదలు సినీ సంగీతం వరకూ ప్రతి ఒక్కటీ ఆస్వాదిస్తారని చెబుతున్నారు స్పాటిఫై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌జిత్‌ బాత్రా.  అలవైకుంఠపురంలో ‘బుట్టబొమ్మ’ పాటకు ఇక్కడ ఎంతటి ప్రజాదరణ పొందిందో, ‘నీలి నీలి ఆకాశం’ అంటూ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని పాట కూడా అంతే ఆదరణ పొందిందని తెలిపారు. సాహిత్యం బాగుండాలి, సంగీతం ఆకట్టుకోవాలి. చాలు... ఆస్వాదించడానికి తెలుగు శ్రోతలు ఎప్పుడూ ముందుంటారన్నారు బాత్రా. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము భారతదేశంలో తమ యాప్‌ను ఉచిత వెర్షన్‌గా అందిస్తున్నామన్నారు. దేశీయ భాషలతో పాటుగా అంతర్జాతీయ సంగీతం, పోడ్‌కాస్ట్‌ కంటెంట్‌ను స్పాటిఫైపై అందిస్తున్నామన్నారు.


ప్రస్తుతం తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్‌తో పాటుగా పలు భాషలలో 60 మిలియన్‌లకు పైగా పాటలు, 1.5 మిలియన్‌ పొడ్‌కాస్ట్‌లు స్పాటిఫై యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి రోజూ 500కు పైగా ప్లే లిస్ట్‌ జాబితాను తమ అంతర్గత సంగీత నిపుణులు ఆధునీకరించడం ద్వారా సంగీతాభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎండీ అమర్‌జిత్‌ బాత్రా చెబుతున్నారు. ఇన్ని పాటలు, విభిన్నమైన ప్లేలిస్ట్‌లు అందుబాటులో ఉండటం వల్ల రోజుకు కనీసం 86 నిమిషాల పాటు 18–34సంవత్సరాల వయసు యువకులు స్పాటిఫై యాప్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారని కాంటార్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. 


ఇటీవలి కాలంలో పోడ్‌కాస్ట్స్‌ను సైతం ఎక్కువగానే  వింటున్నారని.. పూరీజగన్నాధ్‌ పొడకాస్ట్‌తో పాటుగా ‘పాయింట్‌ ఏంటంటే’, ‘నేడే వినండి’, ‘ద టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌’ వంటి వాటిని ఎక్కువగా వింటున్నారని ఆయన తెలిపారు. తెలుగు శ్రోతల అభిరుచులేగాక, భారతీయ సంగీతాభిమానుల అభిరుచులు భిన్నంగా ఉంటాయని చెప్పారు. వర్కవుట్‌ ప్లే లిస్ట్‌తో వీరి సంగీతాస్వాదన ప్రారంభమైతే, ఆఫీస్‌ పనివేళలల్లో తమ పనులు ఎలాంటి చికాకు లేకుండా సాగిపోయేలా ఉండే సంగీతం కోరుకుంటున్నారన్నారు. 

Updated Date - 2020-11-06T20:19:16+05:30 IST