కావాలని ఓడి...హృదయాల్ని గెలిచి

ABN , First Publish Date - 2020-09-23T09:12:12+05:30 IST

ఆటల్లో పెరిగిన పోటీతత్వంతో.. ఎలాగైనా పతకాలు సాధించాలన్న కాంక్ష ప్రస్తుతం క్రీడాకారుల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ...

కావాలని ఓడి...హృదయాల్ని గెలిచి

స్పెయిన్‌ అథ్లెట్‌ క్రీడాస్ఫూర్తికి జేజేలు

బార్సిలోనా (స్పెయిన్‌): ఆటల్లో పెరిగిన పోటీతత్వంతో.. ఎలాగైనా పతకాలు సాధించాలన్న కాంక్ష ప్రస్తుతం క్రీడాకారుల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్పెయిన్‌ అథ్లెట్‌ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. తాను పతకం సాధించే అవకాశం స్పష్టంగా ఉన్నా.. తన వెనకున్న పోటీదారుడిని గెలిపించడం కోసం, తాను ఓడి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బార్సిలోనాలో జరిగిన శాంటాండర్‌ ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో ఫినిషింగ్‌ లైన్‌కు 50 మీటర్ల దూరంలో మలుపు తిరగాల్సివుంది. అయితే  బ్రిటిష్‌ అథ్లెట్‌ జేమ్స్‌ టియాగ్లి ఆ మలుపు తిరగకుండా నేరుగా వెళ్లి బారికేడ్లను డీకొట్టాడు. అతడి వెనుకే పరిగెడుతున్న స్పెయిన్‌ రన్నర్‌ డియాగో మెట్రిగో ఇది గమనించాడు. అదే అవకాశంగా భావించి గమ్యం చేరితే మెట్రిగోకు కాంస్యం దక్కేది. కానీ, అతను క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.  టియాగ్లి తనకంటే ముందు రేస్‌ పూర్తి చేసేలా ఫినిషింగ్‌ లైన్‌కు అడుగుదూరంలో నిల్చుండిపోయాడు. తనకోసం పతకాన్ని త్యాగం చేసిన మెట్రిగోకు టియాగ్లి ధన్యవాదాలు తెలిపాడు. డియాగో క్రీడాస్ఫూర్తిని అక్కడున్న ప్రేక్షకులు సైతం కరతాళ ధ్వనులతో అభినందించారు. ‘పందెం ఆసాంతం అతడు నాకంటే ముందున్నాడు. ఫినిషింగ్‌ లైన్‌ దగ్గర ట్రాక్‌ తప్పాడు. మూడో స్థానానికి అతడే అర్హుడు’ అని మెట్రిగో ట్వీట్‌ చేశాడు. 


Updated Date - 2020-09-23T09:12:12+05:30 IST