‘ఆట’ంకం

ABN , First Publish Date - 2021-04-17T05:20:30+05:30 IST

కొండపి ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో మూడేళ్ల కిత్రం ప్రారంభించిన మినీ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా ఆగింది.

‘ఆట’ంకం
అర్ధంతరంగా పనులు ఆగడంతో బోసిపోతున్న మినీస్టేడియం

కొండిపిలో మినీ స్టేడియం నిర్మాణానికి నిధుల విడుదలలో జాప్యం

మూడేళ్లు గడిచినా పూర్తికాని క్రీడా ప్రాంగణం

రాష్ట్ర ప్రభుత్వం మారాక పడకేసిన పనులు

త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న క్రీడాభిమానులు


కొండపి, ఏప్రిల్‌ 16 : స్థానిక ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో మూడేళ్ల కిత్రం ప్రారంభించిన మినీ స్టేడియం నిర్మాణం అర్ధంతరంగా ఆగింది. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడమే అందుకు కారణమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మినీ స్టేడియం మంజూరైంది. అందుకు దాదాపు రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. గత ఎన్నికల వరకు పనులు వేగంగా జరిగాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం మారాక స్టేడియం పనులు మూడడుగులు ముందుకు ఆరుఅడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. నిధులు విడుదలలో అలివిమాలిన జాప్యం కారణంగా కాంట్రాక్టర్‌ నిర్మాణాన్ని ఆపివేశారు. దాదాపు ఏడాది కాలం పూర్తిగా ఆగిపోయింది. ఆర్నెల్ల క్రితం కొద్ది మొత్తంలో నిధులు విడుదల కావడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఆ నిధులూ ఖర్చయ్యాయి. ప్రభుత్వం నుంచి మళ్లీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టరు నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మినీ స్టేడియం పూర్తయితే స్పోర్ట్స్‌, గేమ్స్‌లో నిర్వహించుకునే అవకాశం ఉంది. అంతేగాక టోర్నమెంట్‌లు, వివిధ స్థాయిల పోటీలు కూడా జరుగుతాయని భావించిన క్రీడాభిమానులకు రాష్ట్ర ప్రభుత్వ చర్యతో నిరాశే మిగిలింది. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి మినీ స్టేడియం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-17T05:20:30+05:30 IST