ఒక్క విజయం చాలు..

ABN , First Publish Date - 2022-01-03T09:18:18+05:30 IST

ఒక్క విజయం చాలు..

ఒక్క విజయం చాలు..

చరిత్రాత్మక సిరీస్‌పై టీమిండియా దృష్టి

నేటి నుంచే దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు

గతేడాదిని ఘన విజయంతో ముగించిన టీమిండియా.. 

ఇప్పుడు నూతన సంవత్సరాన్ని 


అంతకు మించిన గెలుపుతో ఆరంభించాలనుకుంటోంది. ఎందుకంటే మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై ఊరిస్తున్న టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు భారత్‌ మరో విజయం దూరంలోనే ఉంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంతో ఉన్న కోహ్లీ సేనకు, ఇప్పటిదాకా ఓడని వాండరర్స్‌లో వండర్‌ చేసేందుకు ఇంతకు మించిన సువర్ణావకాశం లభించకపోవచ్చు. బ్యాటింగ్‌లోనూ రాణిస్తే జట్టు విజయానికి ఢోకా లేదనే చెప్పవచ్చు.


జొహాన్నె్‌సబర్గ్‌: అంచనాలను తలకిందులు చేస్తూ సెంచూరియన్‌లో భారత్‌ మొదటిసారిగా టెస్ట్‌ గెలిచి సిరీ్‌సలో ముందంజ వేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాకు పెట్టని కోటలా ఉన్న ఆ మైదానంలో భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఇప్పుడు అదే జోష్‌లో తమకు అచ్చొచ్చిన వాండరర్స్‌ స్టేడియంలో చరిత్ర సృష్టించాలనుకుంటోంది. సోమవారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో అత్యంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను ఆయుధంగా చేసుకుంటూ బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు భారత్‌కు ఇదే అవకాశం. 2018లో ఇక్కడ జరిగిన టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే అప్పటికే రెండు టెస్టులు ఓడిపోవడంతో 1-2తో సిరీస్‌ చేజారింది. మరోవైపు ఆరంభ టెస్టులో ఓటమితో డీలాపడిన ప్రొటీస్‌ జట్టుకు డికాక్‌ రూపంలో షాక్‌ ఎదురైంది. హఠాత్తుగా అతను ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అన్ని సమస్యలను అధిగమిస్తూ సిరీ్‌సలో నిలిచేందుకు ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది.


బ్యాటింగ్‌ మెరుగుపడాల్సిందే..: సెంచూరియన్‌లో జోరుగా ఆడిన భారత జట్టులో మార్పులుండకపోవచ్చు. అయితే తొలి టెస్టు విజయంలో బౌలర్లు మాత్రమే కీలకపాత్ర పోషించారు. బ్యాటింగ్‌లో రాహుల్‌, మయాంక్‌ ఆకట్టుకోగలిగారు. కానీ కెప్టెన్‌ కోహ్లీపై ఒత్తిడి అలాగే ఉంది. రెండు ఇన్నింగ్స్‌లో అతడు 35, 18 స్కోర్లతో నిరాశపరిచాడు. రెండేళ్లుగా విరాట్‌ బ్యాట్‌ నుంచి శతకం రాకపోవడం ఆందోళనపరిచే విషయం. ప్రస్తుతం బీసీసీఐతోనూ పెద్దగా సఖ్యత లేని పరిస్థితిలో  ఫామ్‌ చాటుకోవడంతో పాటు సిరీస్‌ విజయం కూడా అతడికి కీలకం. వెటరన్లు పుజార, రహానె ఫామ్‌ అంచనాలకు తగ్గట్టుగా లేదు. కోహ్లీ విఫలమవుతుండడం వీరికి కలిసివస్తోంది. దీంతో విహారి, శ్రేయా్‌సలకు నిరీక్షణ తప్పదు. రాహుల్‌ మైదానం ఏదైనా పరుగులు సాధించడమే తన పని అన్నట్టుగా ముందుకు సాగుతున్నాడు. ఈసారి బ్యాటింగ్‌ విభాగం పూర్తిస్థాయిలో రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే. బౌలింగ్‌లో బుమ్రా, షమి, సిరాజ్‌ వైవిధ్యమైన బంతులతో అదరగొడుతున్నారు. బౌలర్‌గా శార్దూల్‌ ప్రభా వం చూపకపోయినా బ్యాటింగ్‌లో సామర్థ్యం కారణంగా అతడు జట్టులో కొనసాగవచ్చు. లేకుంటే ఉమేశ్‌ బరిలోకి దిగుతాడు. అశ్విన్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు.


బలహీనంగా ప్రొటీస్‌: డికాక్‌ వీడ్కోలుతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం ఒక్కసారిగా బలహీనపడింది. కెప్టెన్‌ ఎల్గర్‌, బవుమా మాత్రమే అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్నారు. మార్‌క్రమ్‌, పీటర్సన్‌, డుస్సెన్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడుతోంది. డికాక్‌ స్థానంలో 25 ఏళ్ల రియాన్‌ రికెల్టన్‌ అరంగేట్రం చేయనున్నాడు. బౌలింగ్‌లో భారమంతా ఎన్‌గిడి, రబాడపైనే ఉంది. పేసర్‌ ముల్డర్‌ స్థానంలో గాయం నుంచి కోలుకున్న డువానె ఒలివియెర్‌ బరిలోకి దిగనున్నాడు.


జొహాన్నె్‌సబర్గ్‌లో భారత్‌ ఇప్పటిదాకా టెస్టు ఓడలేదు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 డ్రాలుఉన్నాయి.

కోహ్లీ మరో 14 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికాలో ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌ అవుతాడు.


పిచ్‌

వాండరర్స్‌ మైదానంలో పేసర్లదే ఎప్పుడూ ఆధిపత్యం. బ్యాటర్స్‌ ఓపిగ్గా క్రీజులో నిలిస్తే భారీ స్కోర్లు సాధించవచ్చు. నాలుగు, ఐదో రోజు వర్షం కురిసే అవకాశం ఉంది.


జట్లు (అంచనా)

భారత్‌: రాహుల్‌, మయాంక్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, శార్దూల్‌, షమి, బుమ్రా, సిరాజ్‌. 

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, పీటర్సన్‌, డుస్సెన్‌, బవుమా, రికెల్టన్‌, జాన్సెన్‌, ఒలివియెర్‌, రబాడ, కేశవ్‌ మహరాజ్‌, ఎన్‌గిడి.

 

Updated Date - 2022-01-03T09:18:18+05:30 IST