మెగా వేలానికి వేళాయె

ABN , First Publish Date - 2022-02-11T09:09:48+05:30 IST

మెగా వేలానికి వేళాయె

మెగా వేలానికి వేళాయె

రేపటి నుంచి ఐపీఎల్‌ ఆక్షన్‌

590 మంది క్రికెటర్ల కోసం పోటీ


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒక సంచలనం. ప్రతీ ఏడాది ఈ ధనాధన్‌ టోర్నీ కోసం అందరూ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు.. ఉత్కంఠభరిత  మ్యాచ్‌ల్లాగే ఈ లీగ్‌కు ముందు జరిగే ఆటగాళ్ల వేలంపైనా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఏ ఫ్రాంచైజీ.. ఏ ఆటగాడిని.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందనే చర్చలు సాగుతూనే ఉంటాయి. తాజాగా జరగబోయేది ఐపీఎల్‌ మెగా వేలం. ఏకంగా దాదాపు ఆరు వందల మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్న వేళ ఈ ప్రక్రియ జరిగే విధానం.. నిబంధనలు, విశేషాలేమిటో తెలుసుకుందాం.


 ఐపీఎల్‌ 2022 వేలం ఎప్పుడు? ఎక్కడ జరుగుతుంది?

ఈనెల 12, 13 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు రోజులపాటు బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్టార్‌స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 2018 తర్వాత ఈ భారీ వేలం జరుగబోతోంది.


రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆటగాళ్లెంత మంది?

మొత్తంగా 1214 మంది క్రికెటర్లు వేలంపై ఆసక్తి ప్రదర్శించారు. వీరిలో 896 మంది స్వదేశీ, 318 మంది విదేశీలున్నారు.


తుది జాబితాలో మిగిలిన వారి సంఽఖ్య?

 ఫ్రాంచైజీలను సంప్రదించాక ఈ జంబో లిస్ట్‌ నుంచి 

590 మంది ఆటగాళ్లను వేలంలో ఉంచేందుకు నిర్ణయించారు. ఇందులో 370 మంది భారత క్రికెటర్లు, 

220 మంది విదేశీ క్రికెటర్లున్నారు.


ఈసారి చేరిన కొత్త జట్లు?

తాజా 15వ సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో పది జట్లు ఉండబోతున్నాయి. దీంట్లో భాగంగా కొత్తగా గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ టీమ్స్‌ లీగ్‌లో చేరాయి.


రిటైన్‌ నిబంధనలు ఏమిటి? 

మెగా వేలానికి ముందే 8 పాత జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇచ్చా రు. అలాగే గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ మాత్రమే ఉండాలి. ఇక నలుగురు ఆటగాళ్లను తీసుకుంటే.. రూ.42 కోట్ల మేరకు ఖర్చు పెట్టవచ్చు. తొలి ప్రాధాన్య ఆటగాడికి రూ.16 కోట్లు, ఆ తర్వాత రూ.12, రూ.8, రూ.6 కోట్ల ధర ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వేలం సమయంలో తమ గరిష్ఠ మొత్తం రూ.90 కోట్ల నుంచి ఆ మొత్తం కోత పడుతుంది. ఒకవేళ ముగ్గురిని తీసుకుంటే రూ.33 కోట్ల మేర ఖర్చు పెట్టవచ్చు. లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ టీమ్స్‌ ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తీసుకునే వీలుంది. ఇలా పది ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను వేలానికి ముందే కొనుగోలు చేశాయి. చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నలుగురేసి క్రికెటర్లను రిటైన్‌ చేసుకున్నాయి.

 

ఒక జట్టులో ఎంత మంది ఆటగాళ్లు ఉండొచ్చు?

 వేలం ముగిశాక గరిష్ఠంగా ఒక్కో ఫ్రాంచైజీలో 25 మందికి మించి 

దాటకూడదు. కనీసంగా 18 మంది అయినా టీమ్‌లో ఉండాలి.


వేలం ఎలా జరుగుతుంది?

ఆటగాళ్లందరినీ పలు విభాగాలుగా విభజిస్తారు. అయితే ముందుగా పది మంది  ప్రధాన ఆటగాళ్లతో వేలం జరుగుతుంది. ఇందులో అశ్విన్‌, బౌల్ట్‌, కమిన్స్‌, డికాక్‌, ధవన్‌, డుప్లెసి, శ్రేయాస్‌, రబాడ, షమి, వార్నర్‌ ఉన్నారు. ఆ తర్వాత క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ (జాతీయ జట్టుకు ఆడిన వారు) ఉంటారు. ఇందులో నుంచి బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌ కీపర్లు, ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్ల కేటగిరీల్లో వేలం నిర్వహిస్తారు. చివర్లో అన్‌క్యా్‌పడ్‌ ప్లేయర్లు వేలానికి వస్తారు. మొత్తంగా 229 క్యాప్‌డ్‌, 354 అన్‌క్యా్‌పడ్‌ ప్లేయర్లున్నారు. 


ఆటగాళ్ల కనీస ధర ఎంత?

మొత్తంగా 8 కనీస ధరలతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇందులో గరిష్ఠ ధర రూ.2 కోట్లు. ఈ విభాగంలో 48 మంది క్రికెటర్లు ఉన్నారు. అంటే వీరిని తీసుకోవాలనుకునే ఫ్రాంచైజీలు ఈ ధరతోనే వేలాన్ని ఆరంభించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-02-11T09:09:48+05:30 IST