నాటు.. నాటు.. నాటు

ABN , First Publish Date - 2022-05-30T11:02:38+05:30 IST

నాటు.. నాటు.. నాటు

నాటు.. నాటు.. నాటు

రణ్‌వీర్‌ స్టెప్పు అదిరే..

రెహ్మాన్‌ గళం మైమరపించే..

ఉర్రూతలూగించిన ముగింపోత్సవం


అహ్మదాబాద్‌: నాటు..నాటు..నాటు అంటూ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ స్టెప్పులతో అదరగొడితే.. జయహో అన్న పాటతో సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ఉర్రూతలూగించగా.. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ముగింపు కార్యక్రమం క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. గంటపాటు సాగిన ముగింపోత్సవం స్టేడియంలో అందరినీ అబ్బురపరిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవిశాస్త్రి మళ్లీ తనదైన వ్యాఖ్యానంతో  కార్యక్రమానికి వన్నె తెచ్చాడు. అనంతరం కెమెరాలు స్టేడియంలోని ఓ భారీ టీషర్ట్‌ మీదకు తిరిగాయి. 10 ఐపీఎల్‌ జట్ల లోగోలతో గిన్నిస్‌ బుక్‌లోకెక్కిన ఈ జెయింట్‌ క్రికెట్‌ జెర్సీకి సంబంధించి సర్టిఫికెట్‌ను బీసీసీఐ చీఫ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాకు నిర్వాహకులు అందజేశారు. ఆ తర్వాత సిల్వర్‌ జాకెట్‌ ధరించిన రణ్‌వీర్‌ సింగ్‌ ఐపీఎల్‌ జెండాను ఊపుతూ ‘జీతెగా జీతేగా..ఇండియా జీతేగా’ అంటూ ‘83’ సినిమాలోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా..స్టేడియంలోకి పరుగెత్తుకుంటూ రావడంతో ఫ్యాన్స్‌ జేజేలు పలికారు. లుట్‌ గయా, తత్తడ్‌..తత్తడ్‌ అనే బాలీవుడ్‌ పాటలకు చిందేసిన రణ్‌వీర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు..నాటు అన్న తెలుగు పాటకు కూడా స్టెప్పులేసి అలరించాడు. ఆపై 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో భారత క్రికెట్‌ సాధించిన గొప్ప విజయాల చిత్రాలను అక్కడి స్ర్కీన్‌పై ప్రదర్శించారు. 1983 వరల్డ్‌ కప్‌ విజయం, టెస్ట్‌ల్లో సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ, వన్డేలలో డబుల్‌ సెంచరీ కొట్టిన తొలి పురుష క్రికెటర్‌గా సచిన్‌ నిలవడం, 2011లో టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించడం, 2013లో భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ అందుకున్న తదితర అపూర్వ ఘట్టాలు ఇందులో చోటు చేసుకున్నాయి. తర్వాత మొదలైన ఏఆర్‌ రెహ్మాన్‌ షోతో స్టేడియం యావత్తూ మంత్రముగ్దమైంది. మా తుఝే సలామ్‌ పాటతోపాటు లగాన్‌, రంగ్‌దే బసంతి సినిమాల పాటలతో రెహ్మాన్‌ ఫ్యాన్స్‌ను సమ్మోహితులను చేయగా..మోహిత్‌ చౌహాన్‌, నీతి మోహన్‌, బ్లాజీ, సాషా త్రిపాఠి, శ్వేతా మోహన్‌ అతడితో గొంతు కలిపారు. 

Updated Date - 2022-05-30T11:02:38+05:30 IST