రేపటి నుంచే..

ABN , First Publish Date - 2021-09-14T06:00:06+05:30 IST

చిరుతల్లా..

రేపటి నుంచే..
స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న క్రీడాకారులు, జేఎన్‌ స్లేడియంలోని సింథటిక్‌ ట్రాక్‌..

క్రీడా సంరంభం

రేపటి నుంచే జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్ పోటీలు
జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
దేశ నలుమూలల నుంచి తరలిరానున్న 600 మంది క్రీడాకారులు
25 ఈవెంట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు
జేఎన్‌ఎస్, నిట్‌ మైదానాల్లో జరగనున్న పోటీలు
పాలుపంచుకోనున్న జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లు
ఐదు రోజుల పాటు నగరవాసులకు క్రీడావినోదం


వరంగల్‌: చిరుతల్లా పరుగెత్తే వాళ్లు కొందరు.. అబ్బురపరిచే ‘దూకుడు’ ప్రదర్శించే వాళ్లు కొందరు..  కండ బలాన్ని చాటిచెప్పే వాళ్లు కొందరు... నడకను పరుగులు పెట్టిస్తూ వారెవ్వా అని అనిపించేవాళ్లు కొందరు.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 600 మంది క్రీడాకారులు. మెరికల్లాంటి క్రీడాయోధుల ప్రతిభా ప్రదర్శనకు చారిత్రక ఓరుగల్లు నగరం వేదికగా నిలువబోతోంది. 60వ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్ పోటీలకు నగరం ముస్తాబైంది. హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంతో పాటు నిట్‌ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదికగా నిలువనున్నాయి. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు పోటీలు జరగనున్నాయి. ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావచ్చాయి. పోటీలకు రెండు రోజుల ముందే క్రీడాకారుల రాక మొదలైంది. తమదైన రీతిలో క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేస్తూ స్టేడియంలో సందడి చేస్తున్నారు.

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొననుండగా, 250 మంది టెక్నికల్‌ అఫీషియల్స్‌ పోటీల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. మొత్తం 25 ఈవెంట్లలో స్త్రీ, పురుష విభాగంలో వేర్వేరుగా పోటీలు జరుగుతాయి. అథ్లెటిక్స్‌ పోటీలపై ఇప్పటికే వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. సోషల్‌ మీడియాతో పాటు నగరంలోని వివిధ జంక్షన్లలో డిజిటల్‌ స్ర్కీన్లను ఏర్పాటుచేసి ప్రముఖులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారుల సందేశాలతో  ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న జేఎన్‌ క్రీడా మైదానంలో కొవిడ్‌ నిబంధనలకు అనుకూలంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల నిర్వహణ అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకు దక్కలేదు. ఇదే తొలిసారి కావడం, అదీ చారిత్రక వరంగల్‌ నగరానికి దక్కడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. నిర్వాహకులు ఏర్పాట్లను సవాలుగా తీసుకొని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోటీలను జేఎన్‌ఎ్‌సతో పాటు, నిట్‌ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో సర్వీసెస్‌ (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌), ఇండియన్‌ పోలీస్‌, రైల్వేస్‌, స్పోర్ట్స్‌ బోర్డు, వివిధ రాష్ట్రాల అసోసియేషన్స్‌లో ప్రతిభ కనబర్చిన  స్త్రీ, పురుష క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వచ్చే ఏడాది చైనాలో జరిగే ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

కార్యనిర్వాహక కమిటీ

అథ్లెటిక్స్‌ పోటీలను విజయవంతం చేయడానికి తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రెసిడెంట్‌గా హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వైస్‌ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్‌కుమార్‌, ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌గా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఎగ్జిక్యూటీవ్‌ ప్రెసిడెంట్‌గా నగర పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఇంకా వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, జిల్లాకు సంబంధించిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు క్రీడల నిర్వహణలో పాలుపంచుకుంటారు.

ఏర్పాట్లకు సిద్ధం
అథ్లెటిక్స్‌ పోటీలు జరిగే జేఎన్‌ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పోటీల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే  క్రీడాకారులు భోజన, వసతి సౌకర్యాలను ఎవరికివారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం  ఆయా రాష్ట్ర్టాలకు చెందిన అసోసియేషన్‌, అకాడమీ, సర్వీసెస్‌ల ప్రతినిధులు నగరంలోని వివిధ హోటళ్లను ఇప్పటికే బుక్‌చేసుకున్నారు. అయితే  టెక్నికల్‌ అఫీషియల్స్‌, అసోసియేషన్‌ ప్రతినిధులకు మాత్రం కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేస్తుంది.

కొవిడ్‌ సర్టిఫికెట్‌
పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ మేరకు అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. 72 గంటల ముందు కొవిడ్‌ నిర్ధారణ (ఆర్‌టీ పీసీఆర్‌) పరీక్ష చేసుకొని నెగెటివ్‌ సర్టిఫికెట్‌ పొందితేనే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు.  

రోజంతా పోటీలే...

అథ్లెటిక్స్‌ పోటీలు ఈ నెల 15న హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభం అవుతాయి. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, తిరగి మధ్యాహ్నం 3.30 నుంచి 6 గంటల వరకు పోటీలు జరుగుతాయి. పోటీలను తిలకించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. స్టేడియంలో ఉన్న గ్యాలరీలను ప్రజలకు కేటాయించినట్టు నిర్వాహకులు తెలిపారు.

క్రీడాకారుల రాక షురూ

అథ్లెటిక్స్‌ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా,  సోమవారం నుంచే క్రీడాకారుల రాక మొదలైంది. దేశంలోని దూరప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ముందే హనుమకొండ చేరుకుంటున్నారు. క్రీడాసామగ్రితో తరలివచ్చిన క్రీడాకారులు తమకు నిర్దేశించిన చోట్ల బస చేసి, స్టేడియంలో సాధన చేస్తున్నారు.

డిజిటల్‌ ప్రచారం
అథ్లెటిక్స్‌ పోటీలపై నిర్వాహకులు చేపట్టిన డిజిటల్‌ ప్రచారం నగరవాసులను ఆకట్టుకుంటోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం, హనుమకొండ కలెక్టరేట్‌, కాజీపేట రైల్వేస్టేషన్‌, కేయూ జంక్షన్‌, జేఎన్‌ స్టేడియం వద్ద ప్రత్యేక డిజిటల్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటుచేశారు. పోటీల విశేషాలతో కూడిన డాక్యుమెంటరీ, వరంగల్‌ ప్రత్యేకతలు, వివిధ వర్గాల ప్రముఖుల క్రీడా సందేశాలను ప్రదర్శిస్తున్నారు.  


సమష్టి కృషితో విజయవంతం చేస్తాం...: సారంగపాణి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌షి్‌ప పోటీల విజయవంతానికి సమష్టిగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సహకారంతో పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. హనుమకొండోలని జేఎన్‌ఎస్‌లో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం పూర్తి కావడంతో జాతీయస్థాయి పోటీల నిర్వహణ అవకాశం దక్కింది. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలను అమలుచేస్తూ క్రీడాకారులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్‌కు దక్కిన ఈ అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేస్తాం.   













Updated Date - 2021-09-14T06:00:06+05:30 IST