క్రీడా మహోత్సవం

ABN , First Publish Date - 2022-07-29T06:09:21+05:30 IST

పుష్కరకాలంనాటి జ్ఞాపకాలు ఇంకా కళ్లలో మెదులుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో మన అథ్లెట్ల అసమాన ప్రతిభాపాటవాలు అంతర్జాతీయ యవనికపై...

క్రీడా మహోత్సవం

పుష్కరకాలంనాటి జ్ఞాపకాలు ఇంకా కళ్లలో మెదులుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో మన అథ్లెట్ల అసమాన ప్రతిభాపాటవాలు అంతర్జాతీయ యవనికపై భారతకీర్తిని దేదీప్యమానం చేశాయి. మన అథ్లెట్లు పతకాల మీద పతకాలు కొల్లగొట్టారు. రికార్డుల మీద రికార్డులు సాధించారు. ఎందరో ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఎంతో సంతోషాన్ని మిగల్చిన ఘట్టం అది. మళ్లీ ఆ కామన్వెల్త్‌ క్రీడా మహోత్సవం వచ్చేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం వేదికగా గురువారం ఆ పండగ మొదలైంది. మధ్యలో రెండుసార్లు ఈ మెగా టోర్నమెంట్‌ జరిగినా.. మళ్లీ అవే ఆశలు, అంచనాలు. ఢిల్లీ క్రీడల ప్రదర్శనను పునరావృతం చేయడం కష్టమే అయినా, అంతే ఆత్మవిశ్వాసంతో భారత బృందం ఈసారి బర్మింగ్‌హామ్‌ బరిలో నిలిచింది. తొలి ఐదు స్థానాల్లోపు నిలవాలన్న లక్ష్యంతో సన్నద్ధమైంది. 


ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల తర్వాత మూడో అతి పెద్ద క్రీడా సంగ్రామం కామన్వెల్త్‌. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఈమారు డెబ్బై రెండు దేశాల నుంచి దాదాపు ఐదువేల అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం ఇరవై క్రీడాంశాల్లో పోటీ. గతంలో గ్రేట్ బ్రిటన్ ఏలిన దేశాల మధ్య నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. ఎప్పటిలాగే ఈమారు భారతదేశం జంబో బృందంగా 215 మంది అథ్లెట్లతో బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టింది. గతంలో భారత్ ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ క్రీడల్లో 101 పతకాలతో మన జట్టు రెండోస్థానంలో నిలిచింది. ఏకంగా 38 స్వర్ణాలు మన క్రీడాకారులు దక్కించుకున్నారు. ఈ క్రీడల చరిత్రలో మనకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. నాలుగేళ్ల తర్వాత గ్లాస్గో ఈవెంట్‌లో 64 పతకాలతో ఐదోస్థానం లభించింది. ఇరవై ఏళ్లుగా భారత పతకాల పట్టికలో తన టాప్‌- ఫైవ్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ టోర్నమెంట్‌లో మూడోస్థానంలో నిలిచిన భారత్ 66 పతకాలు అందుకుంటే, వీటిలో నాలుగోవంతు షూటింగ్‌ క్రీడాంశంలో దక్కినవే. కానీ, బర్మింగ్‌హామ్‌లో షూటింగ్‌ క్రీడను తొలగించారు. ఇది భారత్ ఆశలకు, అవకాశాలకు విఘాతం కలిగించేదే. అథ్లెటిక్స్‌లో కచ్చితంగా పసిడి తెస్తాడనుకున్న ఒలింపిక్‌ చాంపియన్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయంతో చివరి నిమిషంలో టోర్నీకి దూరమవడం అభిమానులను మరింత కలవరపరిచింది.


వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ ఈవెంట్లపైనే భారత్ ఆశలన్నీ. ఒలింపిక్‌ పతక విజేతలైన లిఫ్టర్‌ మీరాబాయి, బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌, షట్లర్‌ పీవీ సింధుతో పాటు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌, రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా, రవి దహియా, వినేశ్‌ ఫొగట్‌, ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖిత జరీన్‌, టీటీ స్టార్‌ మనికా బత్రా, తెలుగమ్మాయి ఆకుల శ్రీజపై భారీ అంచనాలున్నాయి. కొత్తగా మహిళల క్రికెట్‌తో కలిపి నాలుగు క్రీడాంశాలను ఈ క్రీడల్లో చేర్చడంతో హర్మన్‌ ప్రీత్ కౌర్‌ కెప్టెన్సీలోని భారత టీ20 జట్టు తొలిసారి టోర్నీలో ఆడుతోంది. దీంతో మరో పతకం భారత ఖాతాలో పడినట్టేనని అనుకోవచ్చు. ఏదేమైనా ఒలింపిక్స్‌లో పతకాలు చేజార్చుకున్న క్రీడాకారులకు కామన్వెల్త్‌ క్రీడలు మంచి అవకాశం. 


అక్కడ ఇంగ్లండ్‌ గడ్డపై అంగరంగ వైభవంగా కామన్వెల్త్‌ క్రీడా సంరంభం మొదలైతే, అదేరోజు చదరంగ క్రీడలో అతిపెద్ద ఈవెంట్‌ చెస్‌ ఒలింపియాడ్‌ మన దేశంలో ప్రారంభమవడం విశేషం. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురంలో జరుగుతున్న ఈ చెస్‌ సంగ్రామానికి మనదేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాలుపంచుకుంటున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ప్రపంచ చాంపియన్‌, నార్వే దేశ దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ప్రత్యేక ఆకర్షణ. ఆతిథ్య దేశం నుంచి గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణతో పాటు ప్రజ్ఞానంద, అర్జున్‌ ఇరిగేసి లాంటి యువ క్రీడాకారులు తలపడుతున్నారు. పోటీలకు దూరంగా ఉన్న చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ టోర్నీలో భారత ఆటగాళ్ల విజయం కోసం మార్గనిర్దేశనం చేయనున్నాడు. రెండేళ్ల క్రితం ఈ టోర్నమెంట్‌లో రష్యాతో కలిసి సంయుక్త విజేతగా టైటిల్‌ దక్కించుకున్న భారత జట్టు సొంత దేశంలో చాంపియన్‌గా నిలిచి అభిమానులను మురిపించాలని ఆశిద్దాం.

Updated Date - 2022-07-29T06:09:21+05:30 IST