క్రీ‘డల్‌’!

ABN , First Publish Date - 2022-08-05T04:05:02+05:30 IST

జిల్లాలో క్రీడాభివృద్ధి పడకేసింది. పాఠశాల స్థాయి నుంచి గిరిజన విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో నెలకొల్పిన స్పోర్ట్స్‌ స్కూల్‌ బాలారిష్టాలు దాటడం లేదు. ఇంకా గురుకుల రెసిడెన్సియల్‌ పాఠశాలల్లోనే తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ఆహార మెనూ లేదు. శిక్షకులు లేరు. శిక్షణకుగాను ప్రత్యేక పరికరాలు అంటూ లేవు.

క్రీ‘డల్‌’!
గత ఏడాది స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికలు (ఫైల్‌)

జిల్లాలో పడకేసిన క్రీడాభివృద్ధి

ఇంతవరకూ ప్రారంభంకాని స్పోర్ట్స్‌ స్కూల్స్‌

ఎప్పుడు తెరుస్తారో స్పష్టత కరువు

వందలాది మంది విద్యార్థులకు తప్పని ఎదురుచూపు

(సీతంపేట)

జిల్లాలో క్రీడాభివృద్ధి పడకేసింది. పాఠశాల స్థాయి నుంచి గిరిజన విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో నెలకొల్పిన స్పోర్ట్స్‌ స్కూల్‌ బాలారిష్టాలు దాటడం లేదు. ఇంకా గురుకుల రెసిడెన్సియల్‌ పాఠశాలల్లోనే తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ఆహార మెనూ లేదు. శిక్షకులు లేరు. శిక్షణకుగాను ప్రత్యేక పరికరాలు అంటూ లేవు. పేరుకే స్పోర్ట్స్‌ స్కూల్‌ కానీ.. గురుకుల రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో సామాన్య పీఈటీల మాదిరిగా శిక్షణనిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోతోంది. 

- జిల్లాల పునర్విభజనకు ముందు ప్రతీ ఐదు జిల్లాలకు ఒక స్పోర్ట్స్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలను ప్రకటించారు. ఈ లెక్కన సీతంపేటకు బాలుర స్కూల్‌ను, గరుగుబిల్లి మండలం భద్రగిరికి బాలికల స్పోర్ట్స్‌ స్కూల్‌ను మంజూరు చేశారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకూ ప్రవేశాలకు అవకాశమిచ్చారు. ఇందుకుగాను 160 సీట్లు కేటాయించారు. అయితే ఉన్నపలంగా ప్రకటించడంతో ఈ రెండు పాఠశాలలను గురుకుల రెసిడెన్సియల్‌ పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు. కానీ వాటికంటూ ప్రత్యేక భవనాలు, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటుచేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా అడ్మిషన్లపై స్పష్టతనివ్వడం లేదు. మరోవైపు గత ఏడాది 6,7,8 తరగతులకు చెందిన 110 మంది విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ప్రారంభం కాలేదు. పాఠశాలను తెరవలేదు. దీంతో వారు గురుకుల పాఠశాలల్లో తరగతులకే పరిమితమవుతున్నారు. అయితే ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన శిక్షకుల నియామకానికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 

   మెనూ ఏదీ?

వాస్తవానికి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రత్యేకంగా మెనూ అమలుచేయాల్సి ఉంటుంది. వారిని శారీరకంగా, మానసికంగా బలోపేతం చేయడానికి పౌష్టికాహారం అందించాలి. కానీ సాధారణ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలనే అందించి చేతులు దులుపుకుంటున్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులకు క్రీడలతో పాటు సమాంతరంగా విద్యను అందించాలి. కానీ కేవలం ఇక్కడ విద్యకే పరిమితమవుతున్నారు. క్రీడలు, క్రీడాంశాల మాటే లేకుండా పోతోంది.

 వాటిది కూడా అదే పరిస్థితి..

అదే సమయంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సీఎం కప్‌ పోటీలు కూడా సక్రమంగా నిర్వహించడంం లేదు. ఉన్నత పాఠశాలల్లో క్రీడల ఊసేలేదు. ఏటా నిర్వహించే వేసవి క్రీడలు, జోనల్‌  స్థాయి క్రీడల నిర్వహణకు ప్రభుత్వం నిధులు లేవని తేల్చి చెప్పడంతో క్రీడాకారుల్లో నైరాశ్యం నెలకొంది. మండల స్థాయిలో ఎక్కడా క్రీడా మైదానాలు లేవు. పట్టణాల్లో ఉన్నా అశించిన స్థాయిలో వసతులు లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానాన్ని గుర్తించారు. రూ.2 కోట్లతో మినీ స్టేడియంల నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఎక్కడా పనులు పూర్తికాలేదు. ఈ ఏడాది క్రీడా మైదానాల నిర్మాణాల పూర్తి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు.వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాల స్థాయి క్రీడా పోటీలకు ప్రాధాన్యమివ్వాలి. కానీ అటువంటి చర్యలేవీ చేపట్టలేదు.

ఆదేశాలు రాలేదు

స్పోర్ట్స్‌ స్కూల్‌కు సంబంధించి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలు రాలేదు. మార్గదర్శకాలు సైతం విడుదల కాలేదు. అసలు ఎలా ముందుకెళ్లాలో కూడా స్పష్టత లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. 

- సురేష్‌,  గురుకుల కళాశాల కన్వీనర్‌



Updated Date - 2022-08-05T04:05:02+05:30 IST