ఆట అదుర్స్‌

ABN , First Publish Date - 2021-09-16T05:42:59+05:30 IST

జాతీయస్థాయి ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్..

ఆట అదుర్స్‌

ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ పోటీలు
తొలి రోజు రెండు స్వర్ణపతకాలు సాధించిన రైల్వేస్‌ క్రీడాకారులు
ఇంకా బోణీ కొట్టని రాష్ట్ర క్రీడాకారులు
పోటీలను చూసేందుకు పెద్దసంఖ్యలో నగరవాసుల రాక
ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, దయాకర్‌రావు


హనుమకొండ:
జాతీయస్థాయి ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల నుంచే పోటీలు ప్రారంభం కాగా, రాత్రి స్టేడియం ఆవరణలో లాంఛనంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, దయాకర్‌రావు పాల్గొన్నారు. తొలి రోజు 13 ఈవెంట్లలో పోటీలు జరగగా, మూడు ఈవెంట్లలో తుది విజేతలను ప్రకటించారు. 5వేల మీటర్ల మహిళల పరుగు పందెంలో రైల్వేస్‌ జట్టు క్రీడాకారిణి పారుల్‌చౌదరి స్వర్ణం సాధించగా, ఇదే క్రీడాంశంలో పురుషుల విభాగంలో రైల్వేస్‌ క్రీడాకారడు అభిషేక్‌పాల్‌ స్వర్ణ పతకాలు సాధించి బోణీకొట్టారు. వాల్‌పోల్ట్‌ మహిళల విభాగంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పవిత్ర వెంకటేష్‌ ప్రథమస్థానం సాధించారు.


డెకాథ్లాన్‌ మెన్‌ క్రీడాంశంలోని పది పోటీల్లో భాగంగా మొదటి రోజు 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్‌, షాట్‌ఫుట్‌, హైజంప్‌తోపాటు 400 మీటర్ల పరుగుపందెం క్రీడలు నిర్వహించారు. డెకాథ్లాన్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా ఈ ఐదు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతోపాటు రెండోరోజు జరిగే 110 మీటర్ల హడిల్స్‌, డిస్క్‌సత్రో, పోల్‌వాల్ట్‌, జావెలిన్‌త్రో క్రీడల్లో పోటీపడాల్సి ఉంటుంది. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అధిక పాయింట్లు సాధించిన క్రీడాకారుడిని విజేతగా ఎంపిక చేస్తారు. డెకాథ్లాన్‌ క్రీడా పోటీల్లో 17 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల్లో 5వేల మీటర్ల పరుగుపందెంలో పురుషుల విభాగంలో అభిషేక్‌ పాల్‌ (రైల్వేస్‌), మహిళల విభాగంలో పారుల్‌ చౌదరి (రైల్వేస్‌), పోల్‌వాల్ట్‌ (మహిళలు)లో పవిత్ర వెంకటేష్‌ (తమిళనాడు) ప్రథమస్థానంలో నిలిచారు.

566 మంది క్రీడాకారులు..
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో మొత్తం 47 క్రీడాంశాల్లో క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీటిలో పోటీపడేందుకు 26 రాష్ట్రాల నుంచి 566 మంది క్రీడాకారులు తరలివచ్చారు. వీరితోపాటు 250 మంది టెక్నికల్‌ అఫిషీయల్స్‌ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది క్రీడాకారులు పాల్గొనాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాకు చెందిన నవీన్‌, మహబూబ్‌నగర్‌ చెందిన భాగ్యలక్ష్మి హాజరుకాలేదు. ఆల్‌ ఇండియా పోలీస్‌, రైల్వేస్‌, ఎల్‌ఐసీతోపాటు అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారులు పోటీల్లో తమ సత్తా చాటనున్నారు.

క్రీడాభిమానుల సందడి
జేఎన్‌ఎస్ వేదికగా బుధవారం ప్రారంభమైన జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ క్రీడాపోటీలను వీక్షించేందుకు తొలిరోజైన బుధవారం క్రీడాభిమానులు, క్రీడాకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సింథటిక్‌ ట్రాక్‌ను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభకు జేజేలు పలుకుతూ ఉత్సాహపరుస్తున్నారు.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు
క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు నిర్వాహకులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష సర్టిఫికెట్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు. కాగా, హరియానాకు చెందిన సోనిక అనే క్రీడాకారిణి 5వేల మీటర్ల పరుగుపందెంలో పాల్గొనడానికి స్టేడియంకు చేరుకోగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష సర్టిఫికెట్‌ లేకపోవడంతో నిర్వాహకులు క్రీడలకు అనుమతించలేదు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమై వేడుకున్నప్పటికీ నిర్వాహకులు నిరాకరించారు. తాను కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చిందని, కానీ తన సెల్‌కు ఎలాంటి మెస్సేజ్‌ రాలేదని ఆమె తెలిపింది. అయితే నిబంధనలు అనుమతించవని నిర్వాహకులు చెప్పడంతో ఆమె దుఃఖంతో వెళ్లిపోయింది.

ప్రముఖుల సందడి

అథ్లెటిక్స్‌ పోటీలను తిలకించేందుకు కేరళకు చెందిన ప్రముఖ అథ్లెట్‌, 2003 ప్యారిస్‌ ప్రపంచ చాంపియన్‌పిప్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అంజు బాబీ జార్జ్‌ నగరానికి తరలివచ్చారు. సాట్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌, సీనియర్‌ అథ్లెట్‌ నాగమణి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్‌లీజోన్స్‌, కార్యదర్శి సారంగపాణి, సీపీ తరుణ్‌జోషి, అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ వరద రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులు కుమార్‌యాదవ్‌, ఐలి చంద్రమోహన్‌గౌడ్‌, టెక్నికల్‌ అఫిషీయల్స్‌, కోచ్‌లు, తదితరులు క్రీడల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

నేటి నుంచి నిట్‌లో వాకింగ్‌ పోటీలు
కాజీపేట: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో భాగంగా వాకింగ్‌ పోటీలను కాజీపేటలోని నిట్‌లో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 6గంటల నుంచి 20 కిలోమీటర్లు నడక (వాకింగ్‌) మహిళలు, పురుషులకు నిర్వహించనున్నారు. అలాగే శుక్రవారం 35 కి.మీ వాకింగ్‌ మహిళలు, పురుషులకు, శనివారం 50కి.మీ వాకింగ్‌ మహిళలు, పురుషులకు నిర్వహించనున్నారు.























Updated Date - 2021-09-16T05:42:59+05:30 IST