మేం ఆడం..ఐఓసీకి షాక్‌

ABN , First Publish Date - 2020-03-24T10:38:35+05:30 IST

మేం ఆడం..ఐఓసీకి షాక్‌

మేం ఆడం..ఐఓసీకి షాక్‌

ఒలింపిక్స్‌ నుంచి వైదొలగిన కెనడా, ఆస్ట్రేలియా

క్రీడల వాయిదా తప్పదేమోనన్న జపాన్‌ ప్రధాని

అంత సులువుకాదన్న ఐఓసీ చీఫ్‌ 


టోక్యో: కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్నా.. ఒలింపిక్స్‌ నిర్వహించి తీరుతామని చెబుతున్న అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి కెనడా, ఆస్ట్రేలియా షాకిచ్చాయి. ఈ ఏడాది జూలై 24నుంచి ఆగస్టు 9వరకు జరిగే ఒలింపిక్స్‌లో తాము పాల్గొనబోమని కెనడా సోమవారం ప్రకటించింది. అనంతరం కొద్దిసేపటికే ఆస్ట్రేలియా కూడా కెనడా బాటలో పయనించింది. ఈ ఏడాది విశ్వక్రీడలు జరిగితే.. వాటికి తాము దూరంగా ఉంటామని ఆస్ట్రేలియా ఒలింపిక్‌ కమిటీ (ఏఓసీ) తెలిపింది. ఈ రెండు దేశాల నిర్ణయంతో ఐఓసీపై మరింత ఒత్తిడి ఏర్పడింది. విశ్వ క్రీడల వాయిదాపై తక్షణమే నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పదని అంతర్జాతీయ అథ్లెటిక్‌ సమాఖ్యల సంఘం చీఫ్‌ సెబాస్టియన్‌ కో కూడా అభిప్రాయపడ్డాడు.  


ప్రజల ఆరోగ్య సమస్య..

కేవలం అథ్లెట్లేకాదు.. మొత్తం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాము ఒలింపిక్స్‌లో పాల్గొనరాదని నిర్ణయించామని కెనడా ఒలింపిక్‌ కమిటీ (సీఓసీ) వెల్లడించింది. ‘అథ్లెట్ల కమిషన్‌, అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలతోపాటు దేశ ప్రభుత్వ సూచనల మేరకు 2020 ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌కు మా దేశ క్రీడాకారులను పంపవద్దన్న కష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాం’ అని సీఓసీ, కెనడా పారా ఒలింపిక్‌ కమిటీ (పీఓసీ) తమ ప్రకటనలో వివరించాయి. ‘ఏడాదిపాటు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని ఐఓసీ, అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థలను కోరుతున్నాం. క్రీడలను వాయిదా వేస్తే ఉత్పన్నమయ్యే సంక్లిష్ట పరిణామాలను ఎదుర్కోవడంలో ఐఓసీకి మేం మద్దతుగా నిలుస్తాం’ అని కూడా పేర్కొన్నాయి. 


‘2021’కి సిద్ధంకండి

ఆస్ట్రేలియా ఒలింపిక్‌ కమిటీ సోమవారం అత్యవసర టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఒలింపిక్స్‌నుంచి తప్పు కొంటున్నట్టు ప్రకటించింది. ‘తమ ఆరోగ్యంతోపాటు చుట్టు పక్కలవారి ఆరోగ్య పరిరక్షణకు కూడా అథ్లెట్లు ప్రాధాన్యం ఇవ్వాలి. జాతీయ క్రీడా సమాఖ్యలతో చర్చించిన అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోవాలి’ అని ఏఓసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్‌ కరోల్‌ తెలిపారు. ఈ సందర్భంగా 2021లో జరిగే ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వాలని కరోల్‌ తమ అథ్లెట్లకు సూచించడం గమనార్హం.


సమర్థనీయం కాదు..

కరోనా వైరస్‌ ప్రపంచంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నదని, అందువల్ల ఒలింపిక్స్‌ను ఇప్పుడు నిర్వహించడం సమర్థనీయం కాదని అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్యల సంఘం అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో అన్నాడు. ఈ మేరకు అతడు ఐఓసీ చీఫ్‌కు లేఖ రాశాడు. 


నెల తర్వాత భారత్‌ నిర్ణయం: ఐఓఏ

 ఒలింపిక్స్‌లో పాల్గొనాలా..వద్దా..అనే విషయమై నెల తర్వాత నిర్ణయం తీసుకుంటామని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) పేర్కొంది. ‘మా అథ్లెట్లు, అధికారుల ఆరోగ్య భద్రతే అత్యంత ప్రధానం’ అని ఐఓఏ చీఫ్‌ నరీందర్‌ బాత్రా అన్నారు. ఒలింపిక్స్‌ సన్నాహకాలు, ఆరోగ్య పరిస్థితిని వారంలో తెలియజేయాలని టోక్యో క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ కోరామని ఆయన తెలిపారు. 


నిర్వహణకే మొగ్గు.. కానీ..

ఒలింపిక్స్‌ నిర్వహణకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని జపాన్‌ ప్రధాని షింజొ అబే పార్లమెంట్‌కు సోమవారం తెలిపారు. ‘కానీ పరిస్థితులు చూస్తే క్రీడల వాయిదా తప్పదేమో’ అని అభిప్రాయపడ్డారు.


వాయిదాను పరిశీలిస్తున్నాం..

పలు దేశాలు, అథ్లెట్లనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ చెప్పింది. ‘క్రీడల వాయిదాపై మేం నిర్ణయం తీసుకోలేదు. అయితే నిర్ణీత షెడ్యూల్‌ మేరకే జరుగుతాయని కూడా చెప్పడంలేదు’ అని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరొ మోరి అన్నారు.


ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లా తరలించలేం

పరిస్థితులు ఎంతో సంక్లిష్టంగా ఉన్నా ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మాత్రం ఒలింపిక్స్‌ నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ‘ఒలింపిక్స్‌ వాయిదా అంటే ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తర్వాతి శనివారానికి వాయిదా వేసినంత సులువు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-03-24T10:38:35+05:30 IST