టైటిల్‌ పోరుకు సింధు

ABN , First Publish Date - 2021-12-05T09:06:03+05:30 IST

టైటిల్‌ పోరుకు సింధు

టైటిల్‌ పోరుకు సింధు

బాలి: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో అదరగొడుతున్న భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో సింధు 21-15, 15-21, 21-19తో అకానె యమగూచి (జపాన్‌)పై గెలిచింది. ఆదివారం జరిగే తుది పోరులో కొరియా షట్లర్‌ అన్‌ సియెంగ్‌తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. 2018లో టైటిల్‌ నెగ్గిన సింధు.. ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌కు ముందు యమగూచితో ముఖాముఖి పోరులో 12-8తో పైచేయిగా ఉన్న సింధు.. సెమీస్‌ పోరులోనూ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌ ఆరంభంలో 0-4తో వెనుకబడిన సింధు.. వరుసగా పాయింట్లు సాధిస్తూ 9-9తో సమం చేసింది. ఆ తర్వాత ఆధిక్యం చేతులు మారుతూ పోవడంతో ఒక దశలో సింధు 15-14తో నిలిచింది. కానీ, చాకచక్యంగా ఆడి 18-15తో ముందంజ వేసింది. ఈ క్రమంలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 21-15తో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకొంది. రెండో గేమ్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా ఆడడంతో 10-10తో స్కోరు సమమైంది. ఒక్కసారిగా దూకుడు పెంచిన యమగూచి 21-15తో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక గేమ్‌లో ఆరంభంలో 5-5తో నిలిచిన సింధు వరుసగా ఏడు పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. కానీ, పట్టువీడని యమగూచి 11-13తో అంతరాన్ని తగ్గించింది. అయితే, కీలక సమయంలో పదునైన స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు 17-12తో ముందంజ వేసినా.. యమగూచి పట్టువీడకుండా 19-19తో స్కోరు సమం చేసింది. ఎంతో ఒత్తిడి మధ్య రెండు పాయింట్లు నెగ్గి సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కాగా, పురుషుల సింగిల్స్‌ సెమీ్‌సలో లక్ష్యసేన్‌ 13-21, 11-21తో విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 

Updated Date - 2021-12-05T09:06:03+05:30 IST