అర్భన్ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దాలి: స్పెషల్ సీఎస్ శాంతకుమారి

ABN , First Publish Date - 2022-02-16T21:10:13+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులను (హరిత వనాలు) ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా చిక్కటి పచ్చదనం, అందమైన ప్రకృతితో వెల్లివిరియాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

అర్భన్ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దాలి: స్పెషల్ సీఎస్ శాంతకుమారి

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులను (హరిత వనాలు) ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా చిక్కటి పచ్చదనం, అందమైన ప్రకృతితో వెల్లివిరియాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ పరిసరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 179 పట్టణ ప్రాంత అటవీ పార్కులను (హరిత వనాలు) “తెలంగాణకు హరితహారం” ద్వారా అటవీ శాఖ అభివృద్ది చేస్తోంది. వీటి పురోగతిపై అటవీశాఖతో పాటు మున్సిపల్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ కార్పోరేషన్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శాంతి కుమారి అరణ్య భవన్ లో సమీక్షించారు. 1.77లక్షల ఎకరాల్లో మొత్తం 179 హరిత వనాల అభివృద్ది జరుగుతోందని తెలిపారు. వీటిల్లో  రెండు కోట్ల మొక్కలను నాటాలని గతంలో నిర్ణయించారు. అన్ని హరిత వనాల్లో ఖాళీ ప్రదేశాల్లో టాల్ ప్లాంట్స్ నాటడం ద్వారా చిక్కదనంతో కూడిన పచ్చదనం పెరిగేలా, జీవ వైవిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


శాఖల వారీగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పార్కుల పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్షించారు. రెండు కోట్ల లక్ష్యంలో ఇప్పటిదాకా 60 లక్షల మొక్కలు నాటడం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా కోటీ నలభై లక్షల మొక్కలను వచ్చే నవంబర్ కల్లా వందశాతం నాటాలని శాంతికుమారి ఆదేశించారు.ఇప్పటికే అభివృద్ది చేసిన అటవీ పార్కులపై వివిధ వర్గాల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయని, అదే స్ఫూర్తితో మిగతా పార్కుల పనులను పూర్తి చేయాలని కోరారు. ఆరోగ్యం, అహ్లాదం కోసం పార్కులకు వచ్చే వారికి కనీస సౌకర్యాలతో పాటు, పర్యావరణం, అడవుల పునరుద్దరణపై అవగాహన పెరిగేలా ఆయా అటవీపార్కులను తీర్చిదిద్దాలని అన్నారు.  


హరిత వనాలు అభివృద్ది చేస్తున్న ప్రాంతాల్లో అటవీ సరిహద్దుల గుర్తింపు, తక్షణ వివాదాల పరిష్కారం చేపట్టాలని సూచించారు. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ ఎం డోబ్రియల్,  పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర రెడ్డి, హెచ్ఎండీఏ (అర్బన్ ఫారెస్ట్రీ) డైరెక్టర్ ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-16T21:10:13+05:30 IST