ఆధ్యాత్మిక మార్గదర్శి

ABN , First Publish Date - 2021-03-12T05:37:13+05:30 IST

తనను యోగిగా, దైవంగా ఆరాధించేవారికి రామకృష్ణులు చేసే బోధలు విలక్షణంగా ఉండేవి. ఆయన ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదు. తనదైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రకటించలేదు. తనను కలిసిన వారు చెప్పుకొనే సమస్యలకూ, అడిగే ప్రశ్నలకూ

ఆధ్యాత్మిక మార్గదర్శి

15న శ్రీ రామకృష్ణ పరమహంస జన్మతిథి


‘‘మతం గురించీ, ఆధ్యాత్మికత గురించీ మాట్లాడడం సులువు. కానీ వాటిని పాటించడం కష్టం’’ అన్నారు రామకృష్ణ పరమహంస. ఆయన వాటిని త్రికరణశుద్ధిగా పాటించారు. మహా భక్తునిగా, భారతీయత విశిష్టతను విశ్వమంతటికీ చాటి చెప్పిన వివేకానందుని గురువుగా ఆయనది అద్వితీయమైన స్థానం.


తనను యోగిగా, దైవంగా ఆరాధించేవారికి రామకృష్ణులు చేసే బోధలు విలక్షణంగా ఉండేవి. ఆయన ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదు. తనదైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రకటించలేదు. తనను కలిసిన వారు చెప్పుకొనే సమస్యలకూ, అడిగే ప్రశ్నలకూ చిన్న చిన్న కథలతో, ఉదాహరణలతో ఆయన పరిష్కారం చూపించేవారు. 


శ్రీ రామకృష్ణ పరమహంసను శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పుకోలేదు. చిన్నతనం నుంచీ ఆయనకు బడిలో చెప్పే పాఠాలన్నా, ప్రాపంచికమైన విషయాలన్నా ఆసక్తి ఉండేది కాదు. తల్లితండ్రులు ఆయనకు పెట్టిన పేరు గదాధర్‌. పాటలు పాడడం, బొమ్మలు గీయడం బాల్యంలో ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు. తమ ప్రాంతానికి వచ్చిన సాధు సంతులకు సేవ చేసేవారు. వారి ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. ఆరేళ్ళ వయసు నుంచే ఆయన మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఆ ధోరణి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. తల్లి చెప్పే జానపద కథలను ఆయన ఇష్టంగా వినేవారు. రామకృష్ణులు చదువుతున్న బడిలో నాటకం వేశారు. శివుడి పాత్ర వేసిన ఆయన ఆ పాత్రలో లీనమై స్పృహ కోల్పోయారు. తన్మయత్వంతో తనను తాను మరచిపోయే లక్షణం ఆయనకు బాల్యం నుంచీ ఉంది. ఇరవై మూడవయేట ఆయనకు శారదాదేవితో వివాహమయింది. 


ప్రసిద్ధమైన దక్షిణేశ్వర్‌లోని కాళికాదేవి ఆలయానికి రామకృష్ణుని అన్న రామ్‌ కుమార్‌ పూజారిగా ఉండేవారు. ఆ తరువాత రామకృష్ణులు ఆ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఆలయమే ఆయన లోకమైపోయింది. తాదాత్మ్యతలో మునిగిపోయి, కాళికాదేవితో సంభాషిస్తూ ఉండేవారు. ఆ దశలో తోతాపురి అనే సంచార సాధువు ఆయనకు పరిచయం అయ్యారు. అద్వైత వేదాంతాన్ని రామకృష్ణునికి బోధించడంతో పాటు దీక్ష కూడా ఇచ్చారు. ఎన్నో ఏళ్ళపాటు రామకృష్ఠులు ధ్యానాన్ని కొనసాగించారు. క్రమేపీ ఆయన దృక్పథం, చింతనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందనీ, ప్రతి పురుషుడూ, మహిళా పవిత్రమైనవారేననీ ఆయన చెప్పేవారు. మహిళలందరినీ కాళికా స్వరూపాలుగా పరిగణించేవారు. 


తనను యోగిగా, దైవంగా ఆరాధించేవారికి రామకృష్ణులు చేసే బోధలు విలక్షణంగా ఉండేవి. ఆయన ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదు. తనదైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రకటించలేదు. పుస్తకాలు రాయలేదు, బహిరంగ వేదికల మీద ప్రసంగాలు చేయలేదు. ఎలాంటి సందేహం లేని విశ్వాసంతో, పరిపూర్ణమైన శరణాగతితో భగవంతుణ్ణి తన అనుభవంలోకి తెచ్చుకున్నారు. రామకృష్ణుల దృష్టిలో భగవంతుడు నిర్వచనాలకూ, వర్ణనలకూ అందనివాడు. అయితే వ్యక్తిగతమైన దృష్టిలో అందరూ దేవుడికి ఒక ఆకారాన్ని కల్పించుకుంటారు. ఎవరు ఏ ఆకారంలో, ఏ పేరుతో పూజించినా అంతిమ లక్ష్యం భగవంతుడి గురించి తెలుసుకోవడమేనని బోధించేవారు.  


తనను కలిసిన వారు చెప్పుకొనే సమస్యలకూ, అడిగే ప్రశ్నలకూ చిన్న చిన్న కథలతో, ఉదాహరణలతో ఆయన పరిష్కారం చూపించేవారు. ఆత్మ ఉన్న ప్రతి ప్రాణికీ అంతిమ లక్ష్యం దైవం అనే సత్యాన్ని గ్రహించడమేననీ, మంచి నడవడికను అలవరచుకోవడం, ప్రాపంచిక సౌఖ్యాల నుంచి స్వేచ్ఛ పొందడం జరగకపోతే ఆ సత్యాన్ని గ్రహించడం అసాధ్యమని ఆయన చెప్పారు. అయితే, భగవంతుణ్ణి కనుక్కొనే క్రమంలో ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించనక్కరలేదనీ, కానీ ఆత్మనూ, హృదయాన్నీ నిర్మలంగా మార్చుకోవాలనీ ప్రకటించారు. ఏ ధర్మాన్నయినా సక్రమంగా అనుసరిస్తే అది అంతిమ లక్ష్యానికి చేరువ చేస్తుందన్నది రామకృష్ణుల విశ్వాసం. శిష్యులతో ఆయన చేసిన సంభాషణలను ఆయన భక్తుడైన మహేంద్రనాథ్‌ గుప్తా నమోదు చేసేవారు. వాటిని ‘శ్రీ రామకృష్ణ కథామృతం’ అనే పేరుతో సంకలనంగా వెలువరించారు. 


వివేకానందుడు మొదట హేతువాది అయినా, రామకృష్ణులను కలుసుకొని, ఆయనతో సంభాషించి, తన దృక్పథాన్ని మార్చుకున్నారు. ఇలా ఎందరికో గురువుగా ఆయన మార్గదర్శనం చేశారు. జీవితాంతం నిరాడంబరమైన జీవనం గడిపిన శ్రీ రామకృష్ణులు గొంతు కేన్సర్‌ను కూడా చిరునవ్వుతో భరించారు. సజీవంగా ఉన్నప్పుడే కాకుండా, మరణానంతరం సైతం ఆయన ప్రభావం భారత ఆధ్యాత్మిక రంగంపై ప్రస్ఫుటంగా ఉంటూనే ఉంది. 

Updated Date - 2021-03-12T05:37:13+05:30 IST