పుట్టుకతో వచ్చే వెన్ను సమస్యలపై అధ్యయనం

ABN , First Publish Date - 2022-08-10T06:38:22+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వెన్ను అవకరాలతో పుట్టే చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

పుట్టుకతో వచ్చే వెన్ను సమస్యలపై అధ్యయనం

ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ తరహా జననాలు

 ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత అధికం

నిర్మూలనపై కేజీహెచ్‌ న్యూరో సర్జరీ విభాగం పరిశోధన

ఎనిమిది గ్రామాల్లో 150 మంది ఎంపిక

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అవలంబిస్తున్న విధానాలు అమలు

పోలిక్‌ యాసిడ్‌ ఇవ్వడం ద్వారా సమస్యకు పరిష్కారం

ఉప్పులో కలిపి అందజేత


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

ప్రపంచవ్యాప్తంగా వెన్ను అవకరాలతో పుట్టే చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలోనూ ఏటా వేలాది మంది పుట్టుకతోనే వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ తరహా జననాలు అధికంగా వుంటున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారం సూచించేందుకు కేజీహెచ్‌లోని న్యూరో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనకు జిల్లా కలెక్టర్‌తోపాటు ఎథిక్స్‌ కమిటీ నుంచి అనుమతి పొందారు. 


గోధుముల్లో కలిపి...

అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా జననాలు అధికంగా వుండడంతో దీనిపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. పోలిక్‌ యాసిడ్‌ లోపం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. దీంతో పోలిక్‌ యాసిడ్‌ను అందించడం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని చూపించవచ్చునని భావించిన ప్రభుత్వం...అందుకు అనుగుణంగా దేశంలో ప్రజలకు గోధుములు, ఇతర ఆహార పదార్థాల్లో పోలిక్‌ యాసిడ్‌ కలిపి ఇవ్వడం ప్రారంభించింది. కొన్నేళ్లకు ఈ తరహా జననాల్లో భారీగా తగ్గుదల కనిపించడంతో అనేక దేశాలు పోలిక్‌ యాసిడ్‌ ఇవ్వడాన్ని ప్రారంభించాయి. 


ఏజెన్సీలో పరిశోధన.. 

కేజీహెచ్‌కు ఈ తరహా కేసులు ఎక్కువగా రావడాన్ని గుర్తించిన వైద్య నిపుణులు దీనిపై పరిశోధన చేయాలని భావించారు. అందుకు సిద్ధమవుతున్న న్యూరో సర్జరీ విభాగానికి చెందిన వైద్యులకు సహకరించేందుకు ఫ్లోరిడాలో పీడియాట్రిక్‌ న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జోగి పట్టిశపు...తన తండ్రి ప్రొఫెసర్‌ గంగాధరం రీసెర్చ్‌ అకడమిక్‌ సెల్‌ను ఏర్పాటుచేశారు. న్యూరో సర్జరీ విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.హయగ్రీవరావు, మరో ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శివరామకృష్ణలతో కూడిన బృందం ఈ పరిశోధన ప్రారంభించింది. వీరికి రామకృష్ణ మిషన్‌కు చెందిన పలువురు వలంటీర్లు ఏజెన్సీ ప్రాంతంలో సహకరాన్ని అందిస్తున్నారు. సాల్ట్‌ ఫోర్టిఫికేషన్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్పైన్‌ బైఫిడా పేరుతో పరిశోధనను ప్రారంభించారు. 


ఎనిమిది గ్రామాల్లో పంపిణీ..

పరిశోధన కోసం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది గ్రామాలను ఎంపికచేసుకున్నారు. పాడేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో గుత్తుం, కిమిడిపుట్టు, చీకటిపుట్టు, జీలుగుపుట్టు, అలాగే నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్రంపేట, అంకంపాలెం, తుమ్మలబంద, నెల్లిపూడి గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో 18-45 ఏళ్లలోపు మధ్య వయసు కలిగిన 150 మందిని ఎంపిక చేసి పలు రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా హెచ్‌బీ శాతం, బ్లడ్‌ కౌంట్‌, థైరాయిడ్‌, పోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, విటమిన్‌ బి 12, కాల్షియం వంటివి పరిశీలిస్తారు. పరిశోధనలో భాగంగా వారికి కొన్ని రకాల పదార్థాలు అందించి, మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. ముందు, తరువాత వచ్చే ఫలితాలను బేరీజు వేసుకుంటారు. 


ఉప్పు పంపిణీ.. 

స్పైన్‌ బైఫిడాకు ప్రధాన కారణం పోలిక్‌ యాసిడ్‌ లోపంగా అనేక పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో..ఆయా దేశాల్లోని ప్రజలు తీసుకునే ఆహార పదార్థాల్లో పోలిక్‌ యాసిడ్‌ కలిపి అందిస్తున్నారు. కానీ, భారత్‌ వంటి దేశాల్లో భిన్నమైన ఆహారపు అలవాట్లను ప్రజలు కలిగి ఉన్నారు. దీంతో, ఆహార పదార్థాల్లో పోలిక్‌ యాసిడ్‌ కలిపి ఇవ్వడం సా ధ్యం కాదని గ్రహించిన పరిశోధన బృందం..ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించే ఉప్పులో పోలిక్‌ యాసిడ్‌ను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. జైపూర్‌ నుంచి పోలిక్‌ యాసిడ్‌ కలిపిన ఉప్పును తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించి ప్రజలకు అందిస్తున్నారు. ఈ ఉప్పు రోజూ వినియోగించే ప్రజల ఆరోగ్య పరిస్థితిని నెల రోజులు తరువాత మరోసారి పరీక్షలు ద్వారా తెలుసుకుంటుంది. ఈ విధంగా వచ్చిన మార్పులను బేరీజు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. 


గర్భధారణకు ముందే.. 

ప్రతి మహిళ గర్భం దాల్చిన తరువాత వైద్యులను సంప్రతించినప్పుడు వైద్యులు తప్పనిసరిగా పోలిక్‌ యాసిడ్‌, విటమిన్లు వంటి మాత్రలను వినియోగించాలని సూచిస్తారు. వైద్యుల సూచనలకు అనుగుణంగా మందులు వినియోగించినప్పటికీ ఎంతోమంది చిన్నారులు ఈ తరహా అవకరంతో జన్మిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గర్భధారణకు నెల ముందే గర్భంలో ఏర్పడబోయే శిశువుకు సంబంధించిన మెదడు, వెన్ను వంటివి ఏర్పాటవుతాయి. ఇవి ఏర్పాటైనప్పుడే పోలిక్‌ యాసిడ్‌ లోపం ఉంటే...ఈ తరహా అవకరాలు ఏర్పడుతుంటాయి. వీటికి తరువాత మందులు వాడినా  పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి, ముందుగానే పోలిక్‌ యాసిడ్‌ను అందిస్తే...ఈ సమస్య బారినపడకుండా వుండేందుకు అవకాశముంటుంది. ఆయా గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న డబుల్‌ ఫోర్ట్‌ఫైడ్‌ ఉప్పులో అయోడిన్‌, పోలిక్‌ యాసిడ్‌ ఉండగా, క్వార్టబుల్‌ ఫోర్ట్‌ఫైడ్‌ సాల్ట్‌లో అయోడిన్‌, ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ (బీ 9), బీ 12 ఉంటాయి. 


రీసెర్చ్‌ అకడమిక్‌ సెల్‌ ఏర్పాటుతో పరిశోధన

- డాక్టర్‌ జోగి పట్టిశాపు, పీడియాట్రిక్‌ న్యూరో సర్జన్‌, ఫ్లోరిడా

ప్రపంచవ్యాప్తంగా వెన్ను అవకరాలతో పుట్టే చిన్నారుల సమస్యకు పరిష్కారాన్ని సూచించే దిశగా అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఈ సమస్య పరిష్కారాన్ని సూచించే ఉద్దేశంతో నాన్న ప్రొఫెసర్‌ గంగాధరం పేరుతో రీసెర్చ్‌ అకడమిక్‌ సెల్‌ ఏర్పాటుచేసి పరిశోధన చేస్తున్నాం. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పోలిక్‌ యాసిడ్‌ కలిగిన ఉప్పును సొంత ఖర్చులతో అందిస్తున్నాం. ఇప్పటివరకు మూడు టన్నులు తెప్పించాం. రెండు టన్నులు పంపిణీ చేశాం. రెండు నెలల తరవాత పరిశోధనలో వచ్చిన ఫలితాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. 


ఈ తరహా కేసులు చూస్తున్నాం.. 

- డాక్టర్‌ జి.హయగ్రీవరావు, ప్రొఫసర్‌ ఆఫ్‌ న్యూరో సర్జరీ విభాగం, కేజీహెచ్‌

వెన్ను సంబంధిత సమస్యలతో పుట్టే చిన్నారులను చూస్తున్నాం. వీటికి పరిష్కారం కోసం పరిశోధన చేస్తున్నాం. వెన్నులో కణితి, కాళ్ల పక్షవాతం, మూత్రం, మలం కంట్రోల్‌ తప్పడం, తలలో నీళ్లు చేరడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తాయి. పరిశోధనలో భాగంగా అందించే ఉప్పులో పోలిక్‌ యాసిడ్‌ కలిపి అందిస్తాం. కొద్దినెలలు తరువాత మరోసారి పరీక్షలు నిర్వహించి శరీరంలో పోలిక్‌ యాసిడ్‌ పెరిగిందా..? ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ముందు చేసిన పరీక్షలకు, తరువాత చేసిన పరీక్షలకు తేడా ఏమైనా ఉందా? పరిశీలిస్తాం. పోలిక్‌ యాసిడ్‌ పెరిగినట్టు నిర్ధారణ అయితే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. పోలిక్‌ యాసిడ్‌ కలిపిన ఉప్పు రోజువారీ వినియోగించే ఉప్పు మాదిరిగానే ఉంటుంది. 

Updated Date - 2022-08-10T06:38:22+05:30 IST