మల్లు స్వరాజ్యం అస్తమయం

ABN , First Publish Date - 2022-03-20T09:37:43+05:30 IST

ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైంది. జీవితకాల స్ఫూర్తిని మనకు మిగిల్చి, ‘ఇక సెలవు’ అంటూ ఉద్యమాల చిరునామా వెళ్లిపోయింది.

మల్లు స్వరాజ్యం అస్తమయం

  • కన్నుమూసిన సాయుధ పోరాట యోధురాలు.. 
  • 19 రోజులుగా ఆస్పత్రిలో.. శనివారం తుది శ్వాస

నల్లగొండ, హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైంది. జీవితకాల స్ఫూర్తిని మనకు మిగిల్చి, ‘ఇక సెలవు’ అంటూ ఉద్యమాల చిరునామా వెళ్లిపోయింది. ‘నా గొంతే తుపాకీ తూటా’ అని ప్రకటించిన విప్లవ స్వరం మూగబోయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బందూకు చేతబట్టిన ధీశాలి.. తుదివరకు సామ్యవాద సిద్ధాంతానికి నిబద్ధురాలైన యోధ.. నూతన సమాజ స్వాప్నికురాలు.. సీపీఎం సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) ఇకలేరు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు.  శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

భూస్వామ్య కుటుంబంలో పుట్టినా..

మల్లు స్వరాజ్యం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో 1931లో జన్మించారు. తల్లిదండ్రులు చొక్కమ్మ, రామిరెడ్డి. వీరిది 500 ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబం. స్వరాజ్యం నాలుగో తరగతి వరకు చదివారు. పదేళ్ల వయసులో సొంత భూమిలో పండిన పంటను పేదలకు పంచారు. అనంతరం తల్లి చొక్కమ్మ ప్రోత్సాహం కూడా తోడవడంతో విప్లవోద్యమం వైపు అడుగులేశారు. మాక్సిం గోర్కి ‘అమ్మ’ నవల ప్రేరణతో సామాజిక దురాచారాలపై ఉద్యమించారు. సొంత అన్న, సీపీఎం మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో నిజాం వ్యతిరేక పోరాటంలోకి దిగారు. సీపీఎం 1943లో విజయవాడలో నిర్వహించిన విప్లవోద్యమ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. గెరిల్లా యుద్ధ శిక్షణ, ఆత్మరక్షణ పద్ధతులతో పాటు తుపాకీ వాడకంపై శిక్షణ పొందారు. హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. స్వగ్రామంలోని రైతు కూలీ సమస్యలు, వెట్టిచాకిరీ నిర్మూలన ఉద్యమాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఊరూరా తిరుగుతూ విప్లవోద్యమ పాటలు పాడుతూ క్రియాశీల పాత్ర పోషించారు.

 సాయుధ పోరాటంలో.. నిజాం సర్కారు ప్రైవేటు సైన్యం రజాకార్లను 1946-48 మధ్య గెరిల్లా దళాలతో దీటుగా ఎదుర్కొన్నారు. అజ్ఞాత జీవితం గడుపుతూ.. తుపాకీ పట్టి ఉద్యమించారు. గ్రామ కమిటీల ఏర్పాటు, కార్యకర్తల ఎంపిక తదితర కార్యక్రమాలను నిర్వర్తించారు. రాజక్క పేరుతో దళ నాయకురాలిగా భూస్వాముల గడీల మీద దండెత్తారు. మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డ్డి నర్సింహారెడ్డిల పోరాటాన్ని అణచేందుకు వారి ఇంటికి 1947లో రజాకార్లు నిప్పు పెట్టారు. నిజాం ప్రభుత్వం స్వరాజ్యం మీద పదివేల రూపాయల రివార్డు ప్రకటించింది. కాగా, సహ ఉద్యమకారుడు మల్లు వెంకటనరసింహారెడ్డి (వీఎన్‌)ని 1954లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పెద్దల సమక్షంలో మల్లు స్వరాజ్యం పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె కరుణ, కుమారులు గౌతమ్‌, నాగార్జున ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం మల్లు స్వరాజ్యం దంపతులు సీపీఎంలో కొనసాగారు. కరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కుమారులిద్దరూ సీపీఎంలో కొనసాగుతున్నారు.

ప్రజా జీవితంలోనూ పోరు బాటలోనే..

మల్లు స్వరాజ్యం 1978, 1983లో సీపీఎం అభ్యర్థిగా నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిటీ బస్సులో అసెంబ్లీకి వెళ్లేవారు. తొలిసారి సభలో అడుగుపెట్టిన సమయంలో.. రమీజాబీ కేసులో బాధితల పక్షాన సభలో గొంతు బలంగా వినిపించారు. భూ సమస్యల మీద, పేదల పక్షాన అసెంబ్లీలో గళమెత్తారు. 1981 నుంచి 2002 వరకు సీపీఎం అనుబంధ మహిళా సంఘం ఐద్వా అధ్యక్షురాలిగా పనిచేశారు.మద్య నిషేధ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అమ్మాయిలకు ఆస్తి హక్కు విషయమై నాటి సీఎం ఎన్టీఆర్‌ నియమించిన కమిటీలో మల్లు స్వరాజ్యం కూడా ఒకరు.

తెలంగాణపై పార్టీ నిర్ణయానికి భిన్నంగా

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సుల కన్నా గ్రామాల్లో ప్రజల మధ్య పనిచేయడం అవసరమని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి స్వరాజ్యం సూచించేవారు. తెలంగాణ మలి దశ పోరాటంలో పార్టీ వైఖరిని ఆక్షేపిస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్ర నాయకత్వానికి లేఖలు రాశారు. నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాలని తుదివరకు కాంక్షించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ ‘విప్లవాన్ని ముందుకుతీసుకెళ్లాలి. రాజ్యాంగాన్ని రక్షించాలి’ అంటూ.. పరామర్శించడానికి వచ్చినవారికి సంజ్ఞలతో సూచించేవారు. కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ప్రజా సమస్యలపై తన గొంతును వినిపించారు. 

నల్లగొండ వైద్య కళాశాలకు భౌతిక కాయం దానం

మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో ఉంచుతారు. అనంతరం నల్లగొండ తరలిస్తారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్లగొండ ప్రభుత్వ వైద్యకళాశాలకు ఇవ్వనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి పీసీపీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఎం కేంద్ర నాయకులు బీవీ రాఘవులు, ఏపీ సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాస్‌, మాజీ కార్యదర్శి పి.మధు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించారు.

తెలుగు మహిళా శక్తికి రూపం.. తెలంగాణకు తీరని లోటు

మల్లు స్వరాజ్యం మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపం మల్లు స్వరాజ్యం. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం అసమానం. మల్లు స్వరాజ్యం, నేను ఒకేసారి ఎమ్మెల్యేలుగా పనిచేశాం. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆమె జీవన గమనం, గమ్యం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నిలిచిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గొప్ప ఆదర్శ, అసాధారణ వనితను కోల్పోయామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా మల్లు స్వరాజ్యం నిలిచారని, స్త్రీ జాతికి నిత్య స్ఫూర్తి అయిన ఆమె మృతి తీరని లోటని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటని పీసీపీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వరాజ్యం మృతికి టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు.

Updated Date - 2022-03-20T09:37:43+05:30 IST