గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T06:42:13+05:30 IST

కందుకూరు డివిజన్‌లో సమష్టి కృషితో గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.

గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ 

కందుకూరు, జూన్‌ 21 : కందుకూరు డివిజన్‌లో సమష్టి కృషితో గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున గడువు సమయంలోగా వాటి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ లేఅవుట్‌లో సమస్యలుంటే పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాటిల్లో గృహాలు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా చేయటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ఓగూరు గ్రామంలో గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసి ఉన్న లేఅవుట్స్‌ని జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్లు జేవీ మురళి, విశ్వనాథన్‌, ఆర్డీవో వసంతబాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాథ్‌కుమార్‌, డ్వామా పీడీ శీనారెడ్డి, జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మదార్‌ అలీ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:42:13+05:30 IST