అంగన్‌వాడీ భవన నిర్మాణాలు వేగవంతం

ABN , First Publish Date - 2022-09-27T06:45:49+05:30 IST

ఏజెన్పీలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

అంగన్‌వాడీ భవన నిర్మాణాలు వేగవంతం
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం

మాతాశిశు మరణాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచన


పాడేరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏజెన్పీలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ఏజెన్సీ మండలాల గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అఽధికారులు, సీడీపీవోలతో అంగన్‌వాడీ భవన నిర్మాణాల ప్రగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 130 అంగన్‌వాడీ భవనాలను నాడు- నేడు కింద నిర్మిస్తున్నామన్నారు. వాటిలో 97 భవన నిర్మాణాలకు  రూ.221.68 లక్షలు రివాల్వింగ్‌ ఫండ్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని, అందులో రూ.41.16 లక్షలు వ్యయం చేశారన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తల్లుల కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే భవన నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. భవనాల నిర్మాణానికి ఎక్కడైనా భూ సమస్యలుంటే పరిష్కరిస్తామని, సిమెంట్‌, ఇనుము కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఏజెన్సీ వ్యాప్తంగా అంగన్‌ వాడీ భవనాలన్నీ ఒకే రూపంగా నిర్మించాలని సూచించారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు భవన నిర్మాణ పనులను రోజూ పర్యవేక్షించాలన్నారు.


మాతా శిశు మరణాల నివారణకు పటిష్ఠ చర్యలు

ఏజెన్సీలో మాతా శిశు మరణాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ సూచించారు. గ్రామాల్లోని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వ యంతో పని చేయాలని పేర్కొన్నారు. మాతా శిశు మరణాల డేటా సక్రమంగా నమోదు చేయడం లేదన్నారు. మాతా శిశు మరణాలు జరిగితే మరణాలకు గల కారణాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు క్రమశిక్షణ లేకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. సూపర్‌ వైజర్లు వారానికి ఐదు రోజులు విధిగా క్షేత్ర పర్యటనలు చేసి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల ఎదుగులను పక్కాగా పర్యవేక్షించాలన్నారు. అలాగే బలహీనత, రక్తహీనతతో బాధపడే చిన్నారులకు అదనపు పోషకాహారాన్ని అందించాలని ఆదేశించారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు కేజీబీవీలు, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించి బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా కమిటీ సమావేశాలను విధిగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో శిశు సంక్షేమ శాఖ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, ఏజెన్సీ మండలాల ఇంజనీరింగ్‌ అధికారులు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-27T06:45:49+05:30 IST