ప్రాణాలు తీసిన వేగం

ABN , First Publish Date - 2022-09-29T05:22:59+05:30 IST

అతివేగం భార్యాభర్తల ప్రాణాలను బలిగొంది. కారును నడుపుతున్న వారి కుమారుడి పరిస్థితిని విషమంగా మార్చింది.

ప్రాణాలు తీసిన వేగం
కారులోనే ప్రాణాలు కోల్పోయిన సీతారామయ్య

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి 

కొడుకు పరిస్థితి విషమం 

ఒంగోలు సమీపంలో ఘటన 

ఒంగోలు (క్రైం), సెప్టెంబరు 28 : అతివేగం భార్యాభర్తల ప్రాణాలను బలిగొంది. కారును నడుపుతున్న వారి కుమారుడి పరిస్థితిని విషమంగా మార్చింది. ఒంగోలు సమీపంలోని కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్‌పై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన భార్యాభర్తలు కందనగట్ల సీతారామయ్య (60), సుశీల (55) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సీతారామయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను భార్య సుశీల, కుమారుడు శ్రీనివాసరావు కారులో చెన్నై తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం తిరుగుముఖం పట్టారు. శ్రీనివాసరావు డ్రైవింగ్‌ చేస్తుండగా ఆయన పక్క సీటులో సీతారామయ్య, వెనుక సుశీల కూర్చున్నారు. వారి వాహనం వేగంగా వస్తూ ఒంగోలు సమీపంలోని  కొప్పోలు ప్లైఓవర్‌ బ్రిడ్జిపైన ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో సీతారామయ్య, సుశీల అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీనివాసరావు తలకు, గుండె పైభాగాన తీవ్రగాయాలయ్యాయి. ఆయన చెవులు, ముక్కుల్లో నుంచి రక్తస్రావమైంది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ శ్రీనివాసరావును వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ప్రభాకర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-09-29T05:22:59+05:30 IST