స్పీడు తగ్గిన టూవీలర్‌

ABN , First Publish Date - 2021-11-26T09:19:34+05:30 IST

దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలోని రెండు అతిపెద్ద కంపెనీలైన హీరో మోటోకార్ప్‌, హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎ స్‌ఐ) ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నట్లు

స్పీడు తగ్గిన టూవీలర్‌

  • ఏడేళ్ల కనిష్ఠానికి  హీరో మోటోకార్ప్‌, హెచ్‌ఎంఎస్‌ఐ ఉత్పత్తి..
  • మార్కెట్లో గిరాకీ మందగించడమే కారణం


ముంబై: దేశీయ ద్విచక్ర వాహన తయారీ రంగంలోని రెండు అతిపెద్ద కంపెనీలైన హీరో మోటోకార్ప్‌, హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎ స్‌ఐ) ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు, నవంబరులో ఈ రెండు కంపెనీల వాహన ఉత్పత్తి 7 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని అంచనా. పండగ సీజన్‌లోనూ విక్రయాలు జోరందుకోలేకపోవడంతో కంపెనీల వద్ద 45 నుంచి 55 రోజుల సరిపడా నిల్వలు పేరుకుపోయాయని డీలర్‌ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్‌ మార్కెట్‌ అయిన భారత్‌లో ఈ రెండు కంపెనీలదే 60 శాతం వాటా. 


10 లక్షల యూనిట్ల దిగువకు హీరో ఉత్పత్తి 

హీరో మోటోకార్ప్‌ దేశంలో నం.1 టూవీలర్‌ కంపెనీ. ఏడేళ్లలో తొలిసారిగా ఈ కంపెనీ పండగ సీజన్‌లో 10 లక్షల కంటే తక్కువ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. ఈ రెండు నెలల్లో కంపెనీ మొత్తం 8,90,228 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు అంచనా. గత ఏడాది ఇదే కాలానికి 13,94,742 ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసింది. పండగ సీజన్‌లో సగటున 8 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసే హెచ్‌ఎంఎ్‌సఐ సైతం..ఈసారి 6.53 లక్షల యూనిట్లతో సరిపెట్టుకున్నట్లు తెలిసింది. మిగతా టూవీలర్‌ కంపెనీలైన టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో కూడా ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.


2021-22 విక్రయాల్లో 6 శాతం వరకు క్షీణత

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశీయం గా ద్విచక్ర వాహన అమ్మకాలు 1-4 శాతం మేర క్షీణించవచ్చని ఇక్రా రేటింగ్‌ అంచనా వేసింది. మరో రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ మాత్రం 3-6 శాతం వరకు తగ్గే అవ కాశాలున్నాయని వెల్లడించింది. 


విక్రయాలు మందగించడానికి కారణాలు?

  • గత 4-5 ఏళ్లలో ధరలు 25 శాతం మేర పెరగడం 

వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితుల కారణంగా 

గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు నెమ్మదించడం

కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజీల మూసివేత, 

 కుటుంబాల రాబడికి గండి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో తగ్గిన రోజువారీ ప్రయాణాలు 

గడిచిన కొన్ని నెలల్లో భారీగా పెరిగిన పెట్రోల్‌ ధరలు 

ఈ-స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్‌ పెరుగుతుండటం

Updated Date - 2021-11-26T09:19:34+05:30 IST