ప్రచారంలో స్పీడు

ABN , First Publish Date - 2021-03-08T05:10:55+05:30 IST

ప్రచార పర్వానికి మరో రోజు మాత్రమే గడువుంది. దీంతో అభ్యర్థులు, నాయకులు, పార్టీల శ్రేణులు స్పీడు పెంచాయి. ఎండను కూడా లెక్క చేయకుండా ఒకరు వెళ్లిన తరువాత మరొకరు ఓటరు ఇంటికి క్యూ కడుతున్నారు. విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కొన్ని వార్డుల్లో కనిపిస్తోంది. సుమారు 15 వార్డుల్లో వైసీపీకి చెందిన నాయకులు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

ప్రచారంలో స్పీడు

మిగిలింది ఒక్క రోజే

ఇంటింటి ప్రచారంతో ముందుకు సాగుతున్న అభ్యర్థులు

చివరి నిమిషం వరకు వ్యూహ ప్రతివ్యూహాలు

వలంటీర్ల నుంచి సెల్‌ఫోన్ల స్వాధీనం

ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వలంటీర్ల తొలగింపు

(విజయనరగం- ఆంధ్రజ్యోతి)

ప్రచార పర్వానికి మరో రోజు మాత్రమే గడువుంది. దీంతో అభ్యర్థులు, నాయకులు, పార్టీల శ్రేణులు స్పీడు పెంచాయి. ఎండను కూడా లెక్క చేయకుండా ఒకరు వెళ్లిన తరువాత మరొకరు ఓటరు ఇంటికి క్యూ కడుతున్నారు. విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కొన్ని వార్డుల్లో కనిపిస్తోంది. సుమారు 15 వార్డుల్లో వైసీపీకి చెందిన నాయకులు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు స్వతంత్రులుగా పోటీలో ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఉంది. అయా వార్డుల్లో ఉన్న పరిచయాలు.. ఇంతవరకు చేపట్టిన కార్యక్రమాల ద్వారా వారు ప్రజల్లో ఉన్నారు. దీంతో ఆయా వార్డుల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. వైసీపీలోని గ్రూపుల కారణంగానే రెబల్‌ అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో నిలిచారని సమాచారం. ఇది అధికార పార్టీకి నష్టం తెస్తుందా!.. ప్రతిపక్ష టీడీపీకి మేలు చేస్తుందా! అనేది చూడాలి. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు అపూర్వ మద్దతు ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రచారానికి సోమవారం ఒక్క రోజు మాత్రమే గడువున్న కారణంగా అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచార హోరుతో వార్డులు జాతర్లను తలపిస్తున్నాయి. పార్టీ గీతాలతో పాటు అభ్యర్థుల పేర్లతో పాటలు తయారుచేసి డీజేలతో హోరెత్తిస్తున్నారు. వాహనాల ముందు మందుబాబులు హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల వెంట అభిమానులు, శ్రేణులు ఉండగా ఆదివారం బంధుగణం కూడా కనిపించింది.  ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.

జనంతో ప్రచారం

ప్రచార ఘట్టం చివరి దశకు చేరడంతో ఆయా వార్డుల్లో అభ్యర్థికి గట్టి పట్టున్నట్లు భావన కలిగించేందుకు ఎక్కువ జనాన్ని వెంట తీసుకెళ్తున్నారు. ఇలా వస్తున్న వారు కొంతమంది అదే వార్డుకు చెందిన వారు కానేకాదు. అయితే జనాన్ని కూడబెట్టడమే లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల కూలీలుగా తీసుకొచ్చిన వారికి సాయంత్రానికి రూ.300 నుంచి 500వరకు కూలి డబ్బులు చెల్లిస్తున్నారు. మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా ఉదయం 7.30 గంటలకే ప్రచారంలోకి దూకుతున్నారు. 1గంట వరకు కొనసాగి ఇళ్లకు చేరుతున్నారు. మళ్లీ సాయంత్రం 4గంటలకు ప్రారంభించి రాత్రి 7గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. 

ప్రలోభాలకు సన్నద్ధం

ప్రచారంతో గడుపుతున్న అభ్యర్థులు, నాయకులు ఇక నుంచి తెరచాటు ప్రలోభాలకు సిద్ధమవుతున్నారు. వార్డు పరిధిలో తాయిలాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మద్యం మత్తులో ముంచుతున్న అభ్యర్థులు చివరి దశలో డబ్బు పంపిణీకి సైతం రెడీ అవుతున్నారు. ప్రతి ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ఈనెల 9వ తేదీ రాత్రి ఇటువంటి ప్రలోభాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ విజయనగరం నగరపాలక సంస్థ వార్డుల్లో వలంటీర్లు వీధి వీధినా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రతి వార్డులోనూ ఓటర్లకు వారే ఓటు హక్కు స్లిప్‌లు అందిసున్నారు. ఈ తంతును బూత్‌ లెవిల్‌ అధికారులు మాత్రమే చేపట్టాలి. కాని వార్డుల్లో వీరితో పాటు వలంటీర్లు సైతం కొనసాగుతూ అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని గుర్తు చెబుతున్నట్లు తెలిసింది. కొన్ని వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్న వలంటీర్ల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటంతో విజయనగరంలో ఇద్దరు వలంటీర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. అలాగే వలంటీర్ల వద్ద ఉన్న అధికారిక సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ మొక్కుబడిగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి యంత్రాంగం మొత్తం తొత్తులుగా పనిచేస్తున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 



Updated Date - 2021-03-08T05:10:55+05:30 IST