మాటలు–బాటలు

ABN , First Publish Date - 2020-04-15T06:35:43+05:30 IST

కరోనా కష్టకాలంలో నరేంద్రమోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఇది నాలుగోసారి. ఈ మారు ఆయన ప్రసంగం చివర్లో కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా చప్పట్లు చరచమనో...

మాటలు–బాటలు

కరోనా కష్టకాలంలో నరేంద్రమోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఇది నాలుగోసారి. ఈ మారు ఆయన ప్రసంగం చివర్లో కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా చప్పట్లు చరచమనో, వెలుగులు చూపమనో ప్రజలను కోరలేదు. మే 3వతేదీ వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు తేల్చి, అందులో రాబోయే వారం రోజులు అతిముఖ్యమని చెప్పడానికి ప్రజల ముందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కొనసాగింపు ఊహించనిదేమీ కాదు. దాదాపు పదకొండు రాష్ట్రాలు ఇప్పటికే ఏప్రిల్‌ ముప్పైవరకూ లాక్‌డౌన్‌ అన్నాయి. ముఖ్యమంత్రులతోనూ, విపక్ష నాయకులతో ప్రధాని ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో అందరూ దానికే ఓటుచేశారు కనుక, ప్రధాని నోట ఆ మాటతో పాటు కాసింత ఉపశమనాన్నిచ్చే చర్యలు వెలువడతాయని మాత్రమే ప్రజలు ఎదురుచూశారు. ‘జహాన్‌’ మేళవింపు ఎంతోకొంత ఉంటుందని ఆశించారు. ప్రధాని ఇందుకు భిన్నంగా, రాబోయే వారంలో కేంద్రం ఈ దేశంలోని ప్రతీరాష్ట్రాన్నీ, ప్రతీ జిల్లానీ నిశితంగా గమనిస్తుందని గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం దృష్టి ‘జాన్‌ హైతో జహాన్‌ హై’ నుంచి ‘జాన్‌ భీ, జహాన్‌ భీ’ వైపు మళ్ళిందని మొన్ననే అన్న ప్రధాని ఇప్పుడు ప్రాణాలు ముఖ్యం, మిగతావన్నీ ఆ తరువాతేనని తేల్చేశారు.


ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ కూడా ఏకంగా నలభైరోజుల లాక్‌డౌన్‌లో లేదు. అలా ఉంచడం ఎంత కష్టమో ప్రధానికీ తెలుసు. ఆదాయం లేక అత్యధికశాతం ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొనే కాబోలు ప్రజలు పడుతున్న కష్టాలను కాస్తంత స్మరించుకున్నారు. ఈ మలివిడత కొనసాగింపు నిర్ణయానికి తాను మాత్రమే బాధ్యుడిని కానని కూడా పరోక్షంగా గుర్తుచేశారు. మంచి తన ఖాతాలో వేసుకొని చెడు అందరికీ పంచడం నాయకులకు తెలిసిన విద్య. కరోనాకు వ్యతిరేకంగా సంఘటితంగా నిలబడినందుకు ప్రజలను మెచ్చుకుంటూనే, తన ప్రభుత్వం ఆదినుంచీ ఎంత అద్భుతంగా పోరాడుతున్నదో చక్కగా వివరించారు. లెక్కలేనన్న చావులతో సతమతమవుతున్న అగ్రరాజ్యాలతో భారత్‌ను పోల్చుతూ, అందరికంటే ముందే మనం మేల్కొన్నామనీ, అన్ని దారులూ మూసి కరోనాను బాగా కట్టడిచేయగలిగామని చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలమీద ఆదిలో పెద్ద చర్చ జరగలేదు కానీ, మర్కజ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత, ప్రభుత్వం అప్పటివరకూ ఏ రోజున ఏం చేసిందన్నది ప్రజలకు బాగానే తెలిసొచ్చింది. తన ప్రభుత్వం ముందే మేల్కొన్నదని ప్రధాని ఇప్పుడు చెప్పుకోవడం రాజకీయ ప్రయోజనాలను ఆశించా, లేక ప్రజలకు వివరణ ఇచ్చుకోవడమా అన్నది వేరే విషయం. 


నాలుగు గంటల హెచ్చరికతో, తగిన ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రకటించిన తొలివిడత లాక్‌డౌన్‌ అనుభవాల ఆధారంగా ప్రధాని ఇప్పటి ప్రసంగం నిర్దిష్టంగా ఉంటుందని అనేకులు నమ్మారు. కాంగ్రెస్ విమర్శలను అటుంచినా, మలివిడత ప్రణాళిక, సంసిద్ధతల గురించి ఆయన ఒక్కముక్కా చెప్పకపోవడం విచిత్రమే. నేడు ప్రకటించబోయే లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో ప్రజలకు ఉత్తేజాన్నీ, ఉపశమనాన్నిచ్చేవి ఏమి ఉంటాయో తెలియదు. ఆయన ప్రసంగం ముగించిన కొద్దిగంటల్లోనే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ బాంద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర వేలాదిమంది వలస కార్మికులు గుమిగూడిన దృశ్యం దేశం ఎదుర్కొంటున్న తీవ్ర విషాదానికి నిదర్శనం. లాక్‌డౌన్‌ కొనసాగింపు ప్రకటనతో పాటుగానే, వీరి విషయంలో తన ప్రభుత్వం ఏం చేయబోతున్నదో ప్రధాని మాటమాత్రంగానైనా చెప్పివుంటే ఇటువంటివి జరిగేవి కావు. ఈ కల్లోల కాలాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నవారిని మోదీ హెచ్చరించినా బాగుండేది. గతంలో ప్రకటించిన లక్షాడెబ్బయ్‌వేల కోట్ల ప్యాకేజీ వినా కొత్తవాటి ఊసే లేకపోయింది. మందు లేని కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ వినా మరో మార్గం లేకపోవచ్చు. దానిని కొనసాగించదల్చుకున్నప్పుడు భవిష్యత్తుకు కాస్తంత భరోసానిచ్చే అంశాలు కూడా తోడైతే ప్రజలు నిరాశలో మునిగిపోరు. ఆదాయ మద్దతు, ఆర్థిక ఉద్దీపన, ఆకలి నివారణ ఇత్యాది అంశాల జోలికి పోకుండా మోదీ సప్త సూత్రాలు మాత్రమే బోధించారు. వృద్ధుల సంరక్షణ, పేదలకు చేతనైనంత సాయం, వైద్య సిబ్బందిని గౌరవించడం, యాజమాన్యాలు ఉద్యోగులకు అండగా ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటివి మోదీ నోట విన్న ప్రభావం ప్రజలపై కచ్చితంగా ఉంటుంది. కరోనా నియంత్రణకు డిజిటల్‌ ట్రాకింగ్‌ అవసరమని నిపుణులు నొక్కివక్కాణిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యసేతు యాప్‌కు మోదీ ప్రచారం కల్పించడం మంచిదే. కానీ, కష్టకాలాన్ని దాటడానికి ఉపకరించేవాటితోపాటే, రాబోయేరోజుల్లో ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చూచాయగా చెబుతూ, ముందున్నది మంచికాలమేనని కాస్తంత భరోసా కూడా ఇచ్చివుంటే దేశనాయకుడి ప్రసంగం మరింత బాగుండేది.

Updated Date - 2020-04-15T06:35:43+05:30 IST