మాట,పాట నా రెండు కళ్లు

ABN , First Publish Date - 2022-08-18T07:09:17+05:30 IST

‘‘నేను పుట్టేనాటికే మా ఇంట్లో సంగీత, సాహిత్య వాతావరణం ఉంది. మా నాన్నగారు పాలగుమ్మి రాజగోపాల్‌ హైదరాబాద్‌ ఎ.జి.

మాట,పాట నా రెండు కళ్లు

‘‘నేను పుట్టేనాటికే మా ఇంట్లో సంగీత, సాహిత్య వాతావరణం ఉంది. మా నాన్నగారు పాలగుమ్మి రాజగోపాల్‌ హైదరాబాద్‌ ఎ.జి. ఆఫీసులో  ఆడిట్‌ ఆఫీసర్‌ గా పని చేసేవారు. మా అమ్మగారు సీతామహాలక్ష్మి బిఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగి. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా అభిరుచులను మాత్రం వారు కొనసాగించారు. మా నాన్నగారికి సంగీతంలో మంచి అభినివేశం ఉంది. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారి శిష్యులు. మంచి గాయకులు, స్వరకర్త. పధ్నాలుగు సినిమాల్లో పాటలు పాడారు. అంతేకాదు, మా  నాన్న గారు స్థాపించిన రాసి కేర్స్‌ అనే సంస్థ  ద్వారా తన జీతంలో పది శాతాన్ని కేటాయించి మంచి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేశారు. 14వ  శతాబ్దంలో  శ్రీ  అనంత నారాయణ కవి రచించిన ‘శివాష్టపదులు’, పోతన భాగవతంలోని ‘గజేంద్ర మోక్షం’, ‘ప్రహ్లాద చరిత్ర’, ‘వామనావతారం’, ‘రుక్మిణీ కల్యాణం’, ‘మనుచరిత్ర’ ‘ఆముక్తమాల్యద’ లాంటి ప్రబంధ కావ్యాల్లోని  పద్యాలను రాగయుక్తంగా పాడి, పాడించి... సరళమైన వ్యాఖ్యాన సహితంగా రికార్డు చేసి విడుదల చేశారు. ముఖ్యంగా పిల్లలు వీటిని విని, ఆ కథలను తెలుసుకోవాలన్నది ఆయన తపన. ‘రుక్మిణీ కల్యాణం’లో రుక్మిణిగా, ‘ప్రహ్లాద చరిత్ర’లో ప్రహ్లాదుడిగా, ‘వామనావతార’ ఘట్టంలో వామనుడిగా నేను   కొన్ని పద్యాలు పాడాను. నాన్నగారి పుస్తకాల్లోని పాటలు చూసి పాడుకుంటూ ఉండేదాన్ని. అలా బాల్యంలోనే మన సాహిత్యం, సంస్కృతుల పట్ల  నాలో పునాది పడింది.


వెయ్యికి పైగా ఇంటర్వ్యూలు... 

నా బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్‌, మద్రాసులలో సాగింది. ఐసిడబ్ల్యూఏ చదివాను. వివాహానంతరం విశాఖపట్నం వచ్చాను. నా భర్త కొమరగిరి ఆనంద్‌  ప్రముఖ వ్యాపారవేత్త. నా చదువుకు ఉన్నత సంస్థల నుంచి ఉద్యోగావకాశాలు ఎన్నో వచ్చాయి. హరీష్‌, ఆశీష్‌ ఇద్దరు పిల్లల తల్లినైన నేను వాళ్ళను పెంచడం నా మొదటి బాధ్యతగా భావించాను. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి వెళ్ళడానికి బదులు... ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. శ్రీ అభయా లాజిస్టిక్స్‌కు మేనేజింగ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాను. అయితే నా కళాభిరుచిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరి కర్ణాటక సంగీతంలో  ఎం.ఎ. చేసి, డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నాను.


దక్షిణ భారతదేశంలో సినీ సంగీతంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ నేనే. ఆల్‌ ఇండియా రేడియోలో  ఎఫ్‌ఎమ్‌ అనౌన్సరుగా అనేక కార్యక్రమాలు చేసే అవకాశం నాకు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్‌ల కోసం వెయ్యి మందికి పైగా ప్రముఖులను లైవ్‌లో ఇంటర్వ్యూ చేశాను. పద్మవిభూషణ్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ  గారితో కలిసి... రెండువేల మంది సమక్షంలో... ‘సలలిత రాగ సుధారససారం’ పాటను పాడడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం. అదృష్టం. జీ-టీవీ  నిర్వహించిన ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్‌’లో పాల్గొనడం మరో మంచి అనుభూతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి పది వేల మందిని వడబోసి... ఎంపిక చేసినవారికి పోటీ నిర్వహించారు. నేను  టైటిల్‌ గెలిచాను. అంతేకాదు, ‘బెస్ట్‌ కమ్యూనికేషన్స్‌’ అవార్డు కూడా వచ్చింది.  


అంతకన్నా సంతృప్తి మరేదీ ఉండదు 

‘రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది’ (1022-2022) సందర్భంగా ‘తెలుగు మహా భారత సహస్రాబ్ది’ ఉత్సవాలు నిర్వహించాలనే ఆలోచన నాలో కలిగించినవారు.... మా  మేనమామ, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు నడుపల్లి శ్రీరామరాజు. తెలుగులో తొలి సమగ్ర కావ్యమైన మహాభారతాన్ని రచించి... ఆది కవిగా నిలిచి, కావ్యం ఎలా ఉండాలో ఒక ప్రామాణికతను నిర్దేశించిన నన్నయ్యను జాతి స్మరించుకొని, స్ఫూర్తి పొందడానికి ఇది మంచి సందర్భం అని నాకూ అనిపించింది. ఎందుకంటే తెలుగు వారి భాషా సంస్కృతుల ఘనతను చాటి చెప్పడానికి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కృషి చేశారు. ఆ తరువాత అంతటి స్థాయిలో కార్యక్రమాలేవీ జరగలేదు. కానీ ఇదొక బృహత్ప్రణాళిక. ప్రభుత్వాలు చేపట్టాల్సిన పని. అయినా ధైర్యం చేశాను. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విషయం చెప్పాను. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సందర్భంలోనే... నన్నయ సహస్రాబ్ది జరపడం సముచితంగా కూడా ఉంటుందని ఆయన భావించారు. ఆయన సూచన మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారం కోసం విజ్ఞప్తి చేశాను. ఆ శాఖ నుంచి అనుమతి లభించాక...


మా పనులను వేగవంతం చేశాం. నన్నయ్యను మహాభారత ఆంధ్రీకరణకు ప్రోత్సహించిన రాజరాజనరేంద్రుడు ఏలిన రాజమహేంద్రవరం, హైదరాబాద్‌, విశాఖపట్టణాలో కార్యక్రమాలను నిర్వహించాం. రాజమండ్రిలో పల్లకిలో, విశాఖపట్నంలో రథంలో, హైదరాబాద్‌లో బోనాలతో మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలనూ ఊరేగింపుగా సభాస్థలికి తీసుకువెళ్ళాం. కవులు, పండితులు, కళాభిమానులు, ప్రజాప్రతినిధులతో పాటు వందలాది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, స్ఫూర్తివంతమైన పని చేశావంటూ ఎందరో అభినందించడం సంతోషం కలిగిస్తోంది. ఈ సహస్రాబ్ది నిర్వహణలో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ... ఈ  మహోన్నత కార్యక్రమం ద్వారా బాలబాలికల్లో  కొందరికైనా తెలుగు సాహిత్యం, సంస్కృతి పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించగలిగానన్న సంతృప్తి నాకు  కలిగింది. రాబోయే కాలంలో... నా రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలన్నది నా ఆశయం.’’

 కృష్ణశర్మ


ఆదర్శంగా ఉండాలి...

నా జీవితం 2014లో కొత్త మలుపు తిరిగింది. బిజెపిలో చేరాను. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. రాజకీయ నేతల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటాను. 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేసినప్పుడు కూడా ప్రచారాన్ని హుందాగా నిర్వహించాను. 

టీవీ చర్చల్లోనూ... మాటల విషయంలో మర్యాదను ఎప్పుడూ మీరలేదు.

Updated Date - 2022-08-18T07:09:17+05:30 IST