Abn logo
Sep 20 2021 @ 23:18PM

ప్రభుత్వ వైద్యంలో ‘స్పెషాలిటీ’ వైద్య సేవలు

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న జనరల్‌ ఫిజిషియన్‌ వైద్యుడు డా.పరశురాం

టెలిమెడిసిన్‌‘ ద్వారా నిపుణుల సేవలు

 

సంగారెడ్డిఅర్బన్‌, సెప్టెంబరు 20: పల్లె, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.  ప్రజలకు నాణ్యమైన స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యేలా టెలిమెడిసిన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను క్షేత్రస్థాయిలో రోగులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. తద్వారా ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులు తమ సమస్యలను వైద్య నిపుణులకు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, టాటా ట్రస్టు సహకారంతో  టెలిమెడిసిన్‌’ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.


‘టెలిమెడిసిన్‌ ’ వైద్య సేవలు ఇలా

సంగారెడ్డి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారిలో ప్రత్యేక సేవలు అవసరమైన రోగులు టెలిమెడిసిన్‌ విధానంలో వైద్య సేవలు పొందవచ్చు. ఓ రోగి పీహెచ్‌సీకి వచ్చినప్పుడు అతని ఆరోగ్య సమస్య ఆధారంగా పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌  ఆ రోగికి ఫలానా స్పెషాలిటీ వైద్యసేవలు అవసరమని గుర్తిస్తారు. రోగి వివరాలు నమోదు చేసుకుని అవసరమైన స్పెషాలిటీ డాక్టర్‌కు స్కైప్‌ వీడియోకాల్‌ లేదా టెలివిజన్‌ ద్వారా కనెక్టు చేస్తారు. సదరు డాక్టర్‌.. రోగి వ్యాధి లక్షణాలు తెలుసుకొని అవసరమైన మందులు, సూచనలు, సలహాలు, కౌన్సిలింగ్‌ ఇస్తారు. టెస్టులు అవసరమైన వారికి పరీక్షలకు సిపార్సు చేస్తారు. మందుల ద్వారా నయంకాని పక్షంలో రోగి పరిస్థితిని బట్టి.. సర్జరీ అవసరమైన వారికి ఎంపిక చేయబడిన నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తారు. ఈ విధంగా ‘టెలిమెడిసిన్‌’ ద్వారా ఉచిత స్పెషాలిటి వైద్య సేవలు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కోరోజు ఒకటి లేదా రెండు విభాగాల స్పెషాలిటీ వైద్యులు మధ్యాహ్నం 12నుంచి 2 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తారు. 


అందుబాటులో స్పెషలిస్టులు

సోమవారం- గైనకాలజిస్ట్‌, నెఫ్రాలజిస్టు, డెర్మటాలజిస్టు, మంగళవారం-ఈఎన్‌టీ, నెఫ్రాలజిస్టు, ఆప్తామాజిస్టు, బుధవారం- జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజిస్టు, గురువారం- పిడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, శుక్రవారం- నెఫ్రాలజిస్టు, గైనకాలజిస్ట్‌, సైక్యాట్రిస్టు, మెడికల్‌ ఆంకాలజీ, శనివారం- ఆర్థోపెడిక్‌, నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే టెలిమెడిసిన్‌ వైద్య సేవలకు మంచి స్పందన వస్తుందని, జిల్లావ్యాప్తంగా ప్రతి నెల సుమారు 200 మంది రోగులు స్పెషాలిటి వైద్య సేవలు పొందుతున్నారని ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శశాంక్‌దేశ్‌పాండే తెలిపారు.