సీబీఐసీ భూసేకరణకు..ఫాస్ట్‌ట్రాక్‌!

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

జిల్లా అభివృద్ధిలో కీలకం కానున్న చెన్నై-బెంగళూరు..

సీబీఐసీ భూసేకరణకు..ఫాస్ట్‌ట్రాక్‌!

రెవెన్యూ అదికారులతో ప్రత్యేక బృందాలు

ప్రాజెక్టుకు 11,340 ఎకరాలు అవసరం

ఇప్పటికే 5,978 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరణ

పట్టా భూమి విలువ కోసం బృందాల ఆరా

వీరి నివేదికల ఆధారంగా రైతులకు పరిహారం

అంతా పూర్తయితే త్వరలో మొదటి విడత పనులు


నెల్లూరు: జిల్లా అభివృద్ధిలో కీలకం కానున్న చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీఐసీ) భూసేకణ వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. చిల్లకూరు, కోట మండలాల్లో సీబీఐసీ ఏర్పాటుకు 11,340 ఎకరాలు అవసరం. అయితే 2018లోనే 5978 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ స్వాధీనం చేసుకొంది. మిగిలిన 5362 ఎకరాల పట్టా భూమి కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నించగా, పరిహారం ధర విషయంలో ప్రభుత్వానికి ,రైతులకు మధ్య సయోధ్య కుదరలేదు. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు  జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఈ భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జేసీ (రెవెన్యూ) హరేందిర ప్రసాద్‌ ఆధ్వర్యంలో సంబంధిత శాఖలు, తహసీల్దార్లతో పలుమార్లు సమావేశమై రైతులతో సమావేశమై ధరల విషయమై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 


భూసేకరణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ టీమ్‌లు 

సీబీఐసీ భూసేకరణ కోసం రైతుల అభిప్రాయాలు, పరిహారం ఎంత ఇవ్వాలి!? ఆ ప్రాంతంలో భూముల విలువ ఎంత ఉంది!? తదితర అంశాలపై అధ్యయనం కోసం జేసీ హరేందిర ప్రసాద్‌, గూడూరు సబ్‌కలెక్టర్‌ గోపాల్‌కృష్ణ పలు ఫాస్ట్‌ట్రాక్‌ బృందాలు ఏర్పాటు చేశారు. అయితే చిల్లకూరు, కోట మండలాల రెవెన్యూ అధికారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు ఈ బృందంలో చోటు కల్పించారు. ఆరుగురు సభ్యులు ఉండే ఒక్కో ఫాస్ట్‌ ట్రాక్‌ బృందంలో తెలుగుగంగ ప్రాజెక్ట్‌, ఆత్మకూరు, రాపూరు రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీరందరూ భూసేకరణ జరగాల్సిన గ్రామాల్లో పర్యటించి అన్ని విషయాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే తమ్మినపట్నం, కొత్తపట్నం ప్రాంతాల్లో 343 ఎకరాల సేకరణలో ఈ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. భూసేకరణ పూర్తయితే మొదటి విడతగా 2,430 ఎకరాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


భూసేకరణ వేగవంతం: జె.చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం

చెన్నై-బెంగుళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే  సుమారు 6 వేల ఎకరాలు సేకరించాము. మిగతా 5362 ఎకరాలు ప్రైవేటు భూములు కావాల్సి ఉంది. వీటి కోసం జేసీ హరేందిర ప్రసాద్‌ పలువురు రెవెన్యూ అధికారులతో  ఫాస్ట్‌ట్రాక్‌ బృందాలు ఏర్పాటు చేశారు. త్వరలో వీరిచ్చే నివేదికల ఆధారంగా రైతుల నుంచి ఎంత పరిహారం చెల్లించి భూసేకరణ చేయాలో తెలుస్తుంది. 


Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST