స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ - 2022 ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-11T04:22:37+05:30 IST

ఓటర్ల జాబితా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ - 2022 ప్రారంభమైంది. ఓటర్‌ జాబితాల స్వచ్ఛీకరణ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించాలని జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ - 2022 ప్రారంభం

నవంబరు 1న సమీకృత ముసాయిదా ఓటర్‌ల జాబితా ప్రచురణ

వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా

గుంటూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ - 2022 ప్రారంభమైంది. ఓటర్‌ జాబితాల స్వచ్ఛీకరణ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించాలని జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 31వ తేదీ నాటికి ఓటర్‌ జాబితాల్లో బహుళ నమోదు, లాజికల్‌ ఎర్రర్స్‌ని తొలగించాలని స్పష్టం చేసింది. అలానే బూతస్థాయి అధికారులు తమ పరిధిలో ఇంటింటికీ ఓటర్‌ జాబితాలతో వెళ్లి ఓటర్లున్నారో, లేదో పరిశీలన చేయాలి. పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులకు పంపించారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్‌ జాబితా తర్వాత జరిగిన చేర్పులు, తొలగింపులతో ముసాయిదా ఓటర్‌ జాబితాలను నవంబరు 1వ తేదీన ప్రచురించాల్సిందిగా రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. ఇక కొత్తగా ఓటుహక్కు కోసం క్లెయిమ్‌లు దాఖలు చేయడం, ఎవరివైనా ఓట్లపై అభ్యంతరాలను నవంబరు 30వ తేదీ వరకు స్వీకరిస్తారు. నవంబరు 20, 21 తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా ప్రకటించారు. ఆ రెండు రోజుల్లో బీఎల్‌వోలు స్థానికంగా పోలింగ్‌ బూతల వద్ద అందుబాటులో ఉంటారు. కొత్తగా ఓటరు నమోదు కోసమే కాకుండా పేర్లలో తప్పులు, చిరునామాల మార్పు, వేరే నియోజకవర్గానికి ఓటు బదిలీ వంటి సేవల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు నేరుగా బీఎల్‌వోలకే కాకుండా ఎవీఎస్‌పీ.ఇన్‌ వెబ్‌సైట్‌, వోటర్‌ హెల్ప్‌లైన్‌ మొబైల్‌యాప్‌ ద్వారా కూడా పంపవచ్చు. నవంబరు నెలాఖరు వరకు దాఖలైన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు డిసెంబరు 12వ తేదీ నాటికి పరిష్కరించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి 2022 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాని ప్రచురించాలని సూచించింది. కాగా గత ఏడాది స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ జరిగిన తర్వాత జిల్లాలో ఓటర్ల సంఖ్య 40,47,214కి చేరింది. ఇందులో పురుషులు 19,76,299, మహిళలు 20,70,430, ట్రాన్స్‌జెండర్లు 485మంది ఉన్నారు. ఈ దఫా సవరణ తర్వాత కనీసం మరో 20 వేల వరకు ఓటర్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. 

 

Updated Date - 2021-08-11T04:22:37+05:30 IST