Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 25 Nov 2020 14:01:28 IST

షహర్‌ హమారాపై రాజకీయ క్రీనీడలు

twitter-iconwatsapp-iconfb-icon
షహర్‌ హమారాపై రాజకీయ క్రీనీడలు

హైదరాబాద్ వాసులలో విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ధార్మిక పంథాలను ఆచరించే వారున్నప్పటికీ ఎవరూ తమ హద్దులు దాటి ఇతరులకు ఇబ్బంది కలిగించలేదు. ఇది ఒక విశిష్టత. అందుకే హైదరాబాద్ అందరికీ.. షహర్ హమారా.


హైదరాబాద్ ఒక విశిష్ట ఖ్యాతికి పర్యాయపదం. ఆ విఖ్యాతికి రుచికరమైన బిర్యానీ మొదలు ఆర్థిక విషయాలకు సంబంధించిన ఓరాకిల్ కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వరకు ఎన్నో ఆలంబనలు. విదేశాలలోని ఇతర జాతీయులు విశేష ఆసక్తి చూపే భారతీయ నగరం హైదరాబాద్. స్వాతంత్ర్యానికి పూర్వమే అభివృద్ధి చెందిన ఐదు భారతీయ నగరాలలో అది ఒకటి. ఇప్పటికీ తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకుం టూనే ఉంది. అయితే ఈ ఘనతలో మహా నగర పాలక సంస్ధ పాత్ర నిమిత్తమాత్రమే. తనతో పాటు తన నగర అందం కూడ గొప్పదని 1960 దశకంలో అప్పటి హైదరాబాద్ యువ మేయర్ సరోజిని పుల్లారెడ్డి వ్యాఖ్యానించే వారు! 

మౌలిక సదుపాయాల విస్తరణే అభివృద్ధి అనుకుంటే ఇతర భారతీయ మహానగరాలలో తరహా రోడ్లు, వంతెనలు, మెరుగయిన నీటి సరఫరా వ్యవస్ధ హైదరాబాద్‌కూ కాలక్రమంలో సమకూరాయి. మెరుగైన అవకాశాల కోసం వలస అనేది ఒక సహజ ప్రక్రియ. కొందరు విదేశాలకు వచ్చినట్లుగా అత్యధికులు హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. వారి అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన ఎంతవరకు జరిగిందనే ప్రశ్నకు సంతృ ప్తికరమైన సమాధానం లేదు. విశాల వీధులు, వీధి దీపాల సోయగాలు మాత్రమే నగర ప్రతిష్ఠను పెంచవు. మానవత వెలుగులు విరజిమ్మే సద్భావన పరిస్ధితులూ ఉండాలి. 1983కు ముందు ఆకాశవాణి వార్తలు విని మరీ జిల్లాల నుండి హైదరాబాద్‌కు బస్సు ఎక్కవల్సిన కల్లోల పరిస్థితులు ఉండేవి. తెలుగు దేశం ప్రభుత్వ చిత్తశుద్ధితో ఆ పరిస్థితి నుంచి హైదరాబాద్ బయటపడింది.


ఐటి పుణ్యమా అని గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో మార్పులు శరవేగంగా సంభవించాయి. ప్రపంచ ఐటి దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, అమెజాన్ సంస్ధలు నగరంలో అడుగుపెట్టాయి. ఇవే కాకుండా గల్ఫ్, ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన అసంఖ్యాక పరిశ్రమలు, ప్రభుత్వ సంస్ధలకు ఐటి ఆధారిత సేవలందించే కంపెనీలకు హైదరాబాద్ ఇప్పుడు నెలవుగా ఉన్నది. నగరంలో విలసిల్లుతున్న అధునాతన సాంకేతికతలు విద్యాధికులకు, సామాన్యులకు ఉపాధి విషయంలో ఒక ఆసరాగా నిలుస్తున్నాయి. దుబాయికి వెళ్ళకున్నా హాయిగా జీవించవచ్చనే ఒక ఆశాజ్యోతిని యువతరంలో చిగురింప చేసిన పురా నవ నగరం హైదరాబాద్. హైదరాబాదీలలో విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ధార్మిక పంథాలను ఆచరించే వారున్నప్పటికీ ఎవరూ కూడా తమ హద్దులు దాటి ఇతరులకు ఇబ్బంది కల్గించలేదు. ఇది ఒక విశిష్టత. అందుకే ఇది అందరికీ.. షహర్ హమారా. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకపాత్ర వహించవలసిన నగర పాలక సంస్థ దురదృష్టవశాత్తు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల కబంధ హస్తాలలో ఇరుక్కుపోవడం ఆనవాయితీ అయిపోయింది. నగర పాలక సంస్థకు ప్రస్తుత ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆవేశపూరితంగా జరుగుతోంది. ప్రవాసులు సైతం ఈ ఎన్నికల తతంగాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.