ప్రమాదంలో ‘పెద్ద’రికం.. పిల్లల పలకరింపు కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-06-25T18:09:25+05:30 IST

కన్నతల్లిని కట్టుబట్టలతో రోడ్డుమీదకు నెట్టాడు ఒక కసాయి కుమారుడు. కరోనా కష్టకాలంలో

ప్రమాదంలో ‘పెద్ద’రికం.. పిల్లల పలకరింపు కోసం పడిగాపులు

  • వయోధికులపై లాక్‌డౌన్లో పెరిగిన వేధింపులు
  • హెల్ప్‌లైన్‌కు రోజుకి వెయ్యి మంది బాధితులు ఫోన్‌కాల్స్‌
  • రెండో లాక్‌డౌన్‌లో వేధింపులు మరింత అధికం


కన్నతల్లిని కట్టుబట్టలతో రోడ్డుమీదకు నెట్టాడు ఒక కసాయి కుమారుడు. కరోనా కష్టకాలంలో నా అనేవాళ్లెవరూ లేని ఆ తల్లి అదే కాలనీలోని ఫుట్‌పాత్‌ మీద రోజులు గడిపిన దయనీయ పరిస్థితి. ఆమె కష్టం చూసి చలించిన ఇరుగుపొరుగు వయోధిక సహాయకేంద్రానికి సమాచారమిచ్చారు. సదరు అధికారులు ఆ తల్లిని వయోధికాశ్రమంలో చేర్పించారు. అయినా, ఫలితం లేకపోయింది. ఆఖరి మజిలీలో తనకు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేని ఆ తల్లి గుండె ఆగిపోయింది.


చనిపోవాలనుకుంటున్నా అంటూ ఒక అరవై ఐదేళ్ల ఆమె వయోధిక హెల్ప్‌లైన్‌కు ఫోనుచేసి బోరున ఏడ్చింది. కౌన్సెలర్లు ఆమెకు ధైర్య వచనాలు బోధించి, విషయమేంటని ఆరాతీశారు. ఆ ఒంటరి వయోధికురాలు కొడుకు అమెరికాలో స్థిరపడటంతో, హైదరాబాద్‌లోని కూతురి వద్ద ఉంటోంది. ‘ఇంటిపట్టునే ఉంటూ పనిచేస్తున్న నా కూతురు చీటికీమాటికీ నన్ను కసురుకుంటోంది. ఒక్కోసారి గట్టిగా నామీద అరుస్తోంది. నా మనుమరాలు కూడా అకారణంగా విసుక్కుంటోంది. ఇవన్నీ చూస్తున్న అల్లుడు వాళ్లను కనీసం వారించడు. నా వాళ్లే నాకు విలువ ఇవ్వనప్పుడు ఇక నేనెందుకు బతకాలి’ అంటూ కన్నీటిపర్యంతమైంది ఆ వయోధికురాలు.’’


హైదరాబాద్‌ సిటీ : ఇలాంటి దీనగాథలు ఒకటా, రెండా. లాక్‌డౌన్‌లో రోజుకు వెయ్యి ఫోనుకాల్స్‌ బాధితుల నుంచి వయోధిక సహాయకేంద్రానికి వచ్చాయని హెల్పేజ్‌ ఇండియా ప్రతినిధి డా.ఇంతియాజ్‌ అహ్మద్‌ చెబుతున్నారు. రెండో లాక్‌డౌన్‌లో సుమారు ఇరవై వేల ఫోన్లు తమ హెల్ప్‌లైన్‌కు వచ్చాయని ఆయన వివరించారు. అందులో 54 శాతం మంది తమకు ఆర్థిక భరోసా కావాలని అడుగుతున్నారు. బాధితులకు 111 శాతం కౌన్సెలింగ్‌ అవసరమని హెల్పేజ్‌ ఇండియా వలంటీర్లు గుర్తించారు. తొలి లాక్‌డౌన్‌తో పోలిస్తే రెండో లాక్‌డౌన్‌లో ఫిర్యాదులు 36 శాతం ఎక్కువయ్యాయి. పెద్దలపై హింస 18 శాతం పెరిగింది. కరోనా కష్టకాలంలో 62.1శాతం మంది వయోధికులు తమపై వేధింపులు పెరిగాయని సర్వేలోనూ వెల్లడించారు. ‘పెద్దలను గౌరవించాలి’ అంటూ గోడలమీద నీతిరాతలు చూసి మురిసే భారతీయ సంస్కృతిలో వయోధికులకు అడుగడుగునా అవమానాలే. అందులోనూ ఈ కరోనా సమయంలో పెద్దల జీవితాలు మరింత వేదనాభరితంగా మారాయి. 


సమస్యల్లో ఉన్న వయోధికులు సంప్రదించాల్సిన ఉచిత హెల్ప్‌లైన్‌ నెంబర్‌ : 18001801253



కన్నబిడ్డలే కాలాంతకులు...

కుటుంబం కోసం సర్వస్వాన్ని ధారపోసిన వయోధికులకు సొంతింటి నుంచే వేధింపులు ఎదురవుతున్న అమానవీయ స్థితి. అందులోనూ కన్నబిడ్డలే కాలాంతకులుగా మారి వేధిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు అగౌరవంగా చూస్తున్నారని 45.6శాతం వయోధికులు హెల్పేజ్‌ ఇండియా సర్వేలో వెల్లడించారు. తమను సొంత వ్యక్తులే రకరకాల మానసిక వేధింపులకు లోను చేస్తున్నట్లు 60.1 శాతం వయోధికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము శారీరక వేధింపులను చవిచూస్తున్నట్లు 58.6శాతం మంది వాపోయారు. ఆర్థికపరమైన వేధింపులకు లోనైనట్లు 61.6శాతం మంది తెలిపారు. కన్నవాళ్లపై వేధింపులకు కుమారులు 43.8శాతం, కోడళ్లు-27.8శాతం కారణమవుతున్నారని పెద్దలు చెబుతున్నారు. తల్లిదండ్రుల పట్ల మమకారంగా మసులుకోవాల్సిన కూతుళ్ల నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నట్లు 14.2శాతం వయోధికులు ఆవేదన వ్యక్తం చేయడం సమాజంలో మానవీయ విలువలు అడుగంటుతున్నాయనడానికి నిదర్శనం.


వర్క్‌  ఫ్రం హోంతో ఇంట్లో ఇబ్బంది...

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు చాలా కార్పొరేట్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం బాటపట్టాయి. దాంతో 80 శాతం మంది ఉద్యోగులు ఇంటి పట్టునుంటూ పనిచేస్తున్నారు. విద్యాసంస్థలకు సైతం సెలవులు కావడంతో పిల్లలూ ఇంటికే పరిమితమయ్యారు. అలా మూడు తరాలు ఇంట్లోనే ఎదురుబొదురుగా రోజంతా ఉండటంతో కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నమాట వాస్తవమే. అయితే, మరో వైపున చాలా కుటుంబాల్లోని వయోధికులకు మానసిక వ్యథలకు కారణం అయింది. పెద్దల మనస్సును, వాళ్ల వయస్సును అర్థం చేసుకోకుండా కొడుకు, కోడలుతో పాటు మనవలు వారిపై చీటికీమాటికీ దూషణలకు దిగడం, వాళ్లను లెక్కచేయక పోవడం వంటి చేష్టలతో వయోధికులను బాధపెడుతున్నట్లు అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ సంక్షోభ సమయంలో చాలామంది పిల్లలు ఇంట్లోని వయోధికులపైనే తమ అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 


సర్వే ఇలా...

కరోనా సమయంలో వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హెల్పేజ్‌ ఇండియా ఒక అధ్యయనం చేపట్టింది. అందులో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైతో పాటు హైదరాబాద్‌ మహానగరాల్లో వివిధ వర్గాలకు చెందిన 3,526 మంది వయోధికులపై సర్వే నిర్వహించారు.


పిల్లల పలకరింపు కోసం పెద్దల పడిగాపులు

హెల్ప్‌లైన్‌ ద్వారా మా దృష్టికొచ్చిన సమస్యలను దాదాపుగా కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరిస్తుంటాం. నిలువ నీడ కూడా లేనివాళ్లను అయితే కొవిడ్‌ లేదని నిర్ధారించుకున్న తర్వాత అనాథ వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నాం. కరోనా కాలంలో వృద్ధులపై వేధింపులు బాగా పెరిగాయి. 35.7శాతం వృద్ధులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తమ పిల్లల నుంచి ఫోను కోసం ఎదురుచూస్తున్నట్టు మా సర్వేలో తెలిపారు. సమాజంలో మానవీయ విలువలు పెరగడం ద్వారా మాత్రమే ఈ సమస్య సమసిపోతుంది అనుకుంటున్నా. ఉద్యోగాలు కోల్పోయిన లేదా ఆర్థికంగా నష్టపోయిన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల మీద అకారణ కోపాన్ని చూపుతున్నారు. కొందరు కొన్ని సందర్భాల్లో చేయి కూడా చేసుకుంటున్నారు. - శ్యామ్‌, తెలుగు రాష్ట్రాల ప్రతినిధి, హెల్పేజ్‌ ఇండియా


62.1శాతం వయోధికులు..

‘‘మానవాళి పాలిట ఉపద్రవంలా దాపురించిన కొవిడ్‌-19 వయోధికుల్లో తీవ్ర వేదనలను కలిగిస్తోంది. మానవ సంబంధాలనూ ఛిద్రం చేసింది. మానసిక ప్రశాంతతో సాఫీగా సాగాల్సిన జీవిత చరమాంకానికి ఆవేదనలే మిగిలాయి. కన్నబిడ్డల నుంచి కాస్తంత ప్రేమను ఆశిస్తున్న ఆఖరి మజిలీకి నిరాదరణే మిగిలింది. లాక్‌డౌన్‌లో రోజుకు వెయ్యికిపైగా బాధితులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించినట్లు సమాచారం. కరోనా కష్టకాలంలో 62.1 శాతం మంది వయోధికులు తమపై వేధింపులు పెరిగాయని హెల్పేజ్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడించారు.’’

Updated Date - 2021-06-25T18:09:25+05:30 IST