ఆయువు తీస్తున్న అతివేగం.. ఎందుకిలా జరుగుతోంది.. అసలు కారణాలివేనా.. !?

ABN , First Publish Date - 2022-03-14T15:17:48+05:30 IST

ఆయువు తీస్తున్న అతివేగం.. ఎందుకిలా జరుగుతోంది.. అసలు కారణాలివేనా.. !?

ఆయువు తీస్తున్న అతివేగం.. ఎందుకిలా జరుగుతోంది.. అసలు కారణాలివేనా.. !?

  • అనుభవం, అవగాహనలేక నిర్లక్ష్యపు డ్రైవింగ్‌..
  • అలసట, నిద్రలేమి కూడా కారణాలే..
  • విశ్రాంతిలేని డ్రైవింగ్‌తో ప్రమాదాలు

- చిన్నారికి అన్నప్రాసన కోసం శేరిలింగంపల్లి నుంచి శనివారం అర్ధరాత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు హుషారుగా బయలుదేరిన ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో అసువులు బాశారు. 

- మూడు నెలల క్రితం కామారెడ్డి వద్ద జరిగిన ఓ ప్రమాదంలో నగరానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.


అతివేగానికి తోడు నిద్రమత్తు  ప్రయాణాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సొంత వాహనాల్లో బయలుదేరే వారు సరైన అవగాహన లేకుండా రాత్రి ప్రయాణాలు చేస్తుండడం  ముప్పు తెస్తోంది. అలసట చెంది క్షణంపాటు నిద్రమత్తులోకి జారినా ప్రమాదాలు జరుగుతు న్నాయి. మరికొందరు  త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో హైవేలపై  అతివేగంగా వెళ్తూ  వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : హుషారుగా బయలుదేరిన యాత్రలు విషాదాలుగా మారుతున్నాయి. దూర ప్రయాణాలు పెట్టుకున్న వారు అలసట లేకుండా డ్రైవింగ్‌ చేయడం, త్వరగా చేరాలని వేగంగా వెళ్లడంతో ప్రమాదాలకు గురై భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగంతోపాటు పరిమితికి మించిన ప్రయాణం చేయడం ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి.


నిర్లక్ష్యం.. అతివేగమే..

తాజా ప్రమాదం, మూడు నెలల క్రితం జరిగిన ప్రమాదాలకు నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణాలని తెలుస్తోంది. రాత్రి ప్రయాణాలు, విశ్రాంతి లేకుండా త్వరగా చేరాలనే ఆత్రుత,  హైవేలపై స్పీడ్‌ కంట్రోల్‌ లేకపోవడం, డ్రైవింగ్‌ అనుభవ రాహిత్యంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోందని తెలుస్తోంది. సిటీలో వాహనం నడిపే ప్రాక్టీసు ఉన్న వాళ్లు సిటీ దాటిన తర్వాత తప్పని సరిగా పాటించాల్సిన కొన్ని నియమాలను విస్మరించడంతోనే ఈ ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడు తోందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీతో సిటీ దాటి దూర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.


- దూర ప్రాంతాలకు పగటి పూటే ప్రయాణించాలి.  అంతకుముందు రాత్రి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని ఉదయం బయలు దేరాలి. 

- ఫ్యామిలీతో వెళ్లే సమయంలో సాధారణంగా ఒకరే డ్రైవ్‌ చేస్తారు. విశ్రాంతికి ప్రాముఖ్యత ఇస్తూ పగటి పూట ప్రయాణం చేయాలి. 

- ప్రతి 3 గంటలకు కనీసం ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. చేతులకు, కాళ్లకు, కళ్లకు కాస్త విరామం ఇచ్చినట్లు ఉంటుంది.

- రోడ్డుపై పూర్తి అవగాహన ఉండాలి. ఎక్కడ మలుపు ఉందో, ఎక్కడ సింగిల్‌ రోడ్డు, డబుల్‌ రోడ్డు ఉందో జాగ్రత్త వహించాలి. రోడ్డుపై గుంతలు, కల్వర్టుల గురించి సూచికలు ఫాలో చేయాలి.

- జాతీయ రహదారులపై రిస్కు మరింత పెరుగుతుం ది. సో.. ఎంత పర్‌ఫెక్ట్‌ డ్రైవింగ్‌ ఉన్నా జాతీయ రహదారులు, కొత్త రోడ్లపై స్పీడ్‌ తగ్గించి ప్రయాణించాలి.

- ప్రమాదానికి 2 సెకన్ల వ్యవధి చాలు. నిద్ర మత్తు లాంటిది అనిపిస్తే విశ్రాంతి తీసుకుని ప్రయాణించాలి.


డ్రైవర్‌ కాకుండా..  

మూడు నెలల క్రితం చాదర్‌ఘాట్‌లోని మూసానగర్‌, ఫలక్‌నుమాలోని తీగల్‌కుంట ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాల సభ్యులు మహారాష్ట్ర నాందేడ్‌లోని కాన్‌దార్‌ దర్గాను దర్శించుకొనేందుకు బయలుదేరారు. తిరిగి వస్తున్న క్రమంలో వాహనదారుడు మహ్మద్‌ హుసేన్‌ తన స్నేహితుడైన మహ్మద్‌ ఆమేర్‌కు డ్రైవ్‌ చేయమని ఇచ్చాడు. అతను నడపడం వల్లే ప్రమాదం జరిగి అతని కుటుంబంతోపాటు హుసేన్‌ కుటుంబీకులు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2022-03-14T15:17:48+05:30 IST