హైదరాబాద్‌లో కొన‘సాగు’తున్న గంజాయి.. తనిఖీలెక్కడ..!?

ABN , First Publish Date - 2022-03-14T16:38:26+05:30 IST

నాలుగైదు నెలల క్రితం గంజాయిపై ఉక్కుపాదం మోపిన అధికారులు కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది...

హైదరాబాద్‌లో కొన‘సాగు’తున్న గంజాయి.. తనిఖీలెక్కడ..!?

  • గంజాయి వాష్‌ అవుట్‌ ఉట్టిదేనా? 
  • అధికారుల్లో నాలుగు నెలల క్రితం కనిపించిన వేగం ఏదీ?


హైదరాబాద్‌ సిటీ : నాలుగైదు నెలల క్రితం గంజాయిపై ఉక్కుపాదం మోపిన అధికారులు  కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కనిపించిన ఉత్సాహం సన్నగిల్లినట్లు స్పష్టమవుతోంది. దీంతో కలుగులో దాక్కున్న గంజాయి సరఫరాదారులు మళ్లీ తమ ఉనికిని చాటుతున్నారు. అప్పట్లో వందల సంఖ్యలో గంజాయి విక్రేతలను అరెస్టు చేసి, టన్నుల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసులు రికార్డు సృష్టించారు. ఐదు నెలల క్రితం పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జరిపిన ప్రత్యేక సమావేశం అనంతరం వరసగా గంజాయి సరఫరాదారులపై దాడులు జరిపారు. అక్టోబర్‌ మూడో వారంలో ప్రారంభమైన వరస దాడులు నవంబర్‌ చివరి వరకు ఎడతెరిపి లేకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో కొనసాగాయి. దానికి తోడు ఎక్సైజ్‌ అధికారులు కూడా తోడయ్యారు. కానీ, ఇటీవల దాడులు కాస్త తగ్గినట్లు అనిపించగానే గంజాయి సరఫరాదారులు మళ్లీ దందా ప్రారంభించారు. తాజాగా బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చిక్కిన ఏడుగురితోపాటు ఇటీవల కాలంలో చిక్కిన గంజాయి కేసులే దీనికి నిదర్శనం.


బయటకు వస్తున్న వ్యాపారులు..

గతేడాది పోలీసుల చర్యలతో జంకిన గంజాయి సరఫరా ముఠాలు, వ్యాపారులు, విక్రేతలందరూ కలుగులోకి దూరారు. చాలామంది అండర్‌ గ్రౌండ్‌కు చేరిపోయారు. అయినా వ్యాపారాన్ని వదులుకోలేని కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతాలనుంచి మాత్రమే కాకుండా నగర శివారు ప్రాంతాల్లో గంజాయి సాగుచేస్తున్న కేసులు కూడా వెలుగు చూశాయి. నగరంలో మాత్రమే కాకుండా  హైదరాబాద్‌ కేంద్రంగా మార్చుకుని ఇతర రాష్ట్రాలకూ గంజాయి చేరుతోందనే వాస్తవాలు దాడుల్లో వెలుగు చూశాయి. ధూల్‌పేట్‌, జియాగూడ, మంగళ్‌హాట్‌తోపాటు పలు ప్రాంతాల్లో గంజాయి సరఫరానే ఉపాధి మార్గంగా ఎంచుకున్న పలు కుటుంబాలపై  పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డన్‌ సెర్చ్‌ చేసి చర్యలు తీసుకోవడంతో సరఫరాదారులు కనిపించకుండా పోయారు. కొందరు చిక్కినప్పటికీ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్ద వ్యాపారుల ఆచూకీ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. కొంతకాలంగా పోలీసుల దాడులు తగ్గాయని గుర్తించిన వ్యాపారులు మెల్లిగా బయటకు వస్తున్నారు.  


తనిఖీలెక్కడ..?

గంజాయిని అరికట్టేందుకు గతేడాది గణనీయంగా తనిఖీలు జరిగాయి. కానీ, ప్రస్తుతం ఆ స్థాయిలో జరగడం లేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా గంజాయిని నగరం నుంచి వాష్‌అవుట్‌ చేశామన్నారు. కానీ వాస్తవంలో ఆ  పరిస్థితులు కనిపించడం లేదు. గంజాయి దందా సాగుతోందని తాజా ఘటనలు తెలియజేస్తున్నాయి. అప్పట్లో లా అండ్‌ ఆర్డర్‌, ఎక్సైజ్‌ అధికారులు, ప్రత్యేక ఎన్డీపీఎస్‌ టీమ్‌లను రంగంలోకి దింపి గంజాయి స్మగ్లర్స్‌పై పీడీయాక్టులు నమోదు చేశారు.


గంజాయి విక్రేతల అరెస్ట్‌..

గంజాయిని విక్రయిస్తున్న బాలుడితోపాటు మరో ముగ్గురు నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బోయిన్‌పల్లి పీఎ్‌సలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రవి కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఫిలింనగర్‌ బీజేఆర్‌ నగర్‌కు చెందిన యాప నవీన్‌, మానేకర్‌ మదన్‌, మాన్టి అనే మహిళ గంజాయి విక్రయించేవారు. వీరి నుంచి గాజులరామారం దేవేందర్‌నగర్‌కు చెందిన షేక్‌ ఆమీర్‌, సాయిరాంరెడ్డి అలియాస్‌ డీజేసాయి, షేక్‌ సల్మాన్‌, ఓ బాలుడితో కలిసి గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో గంజాయిని తీసుకునేందుకు శనివారం సాయంత్రం ఓల్డ్‌ బోయిన్‌పల్లి డైరీ ఫాం రోడ్డుకు రమ్మని షేక్‌ ఆమీర్‌, షేక్‌ సల్మాన్లను పిలిచారు. అక్కడే పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీస్‌ సిబ్బందికి ఈ ఏడుగురు అనుమానాస్పదంగా కంటపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 12కిలోల గంజాయి బయటపడింది. గంజాయితోపాటు మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. నిందితుల్లో యాసిన్‌, నవీన్‌, మానేకర్‌, మదన్‌, మాన్టి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


గతంలో ఇలా..

- ప్రత్యేక డ్రైవ్‌లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 60 కేసులు నమోదు చేసిన పోలీసులు 80కి పైగా సరఫరాదారులను అరెస్టు చేశారు. 500 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 14 మంది స్మగ్లర్స్‌పై పీడీయాక్టు నమోదు చేశారు. 

- సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 260 మందికి పైగా స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి, 135 కేసులు నమోదు చేశారు. 270 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 9 మంది స్మగ్లర్స్‌పై పీడీయాక్టు నమోదు చేశారు. 

- రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1,356 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 3 కేసులు నమోదు చేసి, ఆరుగురు స్మగ్లర్స్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2022-03-14T16:38:26+05:30 IST