గచ్చిబౌలి టిమ్స్‌ ఖాళీ.. ఇన్‌పేషెంట్‌ సేవలకు బ్రేక్‌..

ABN , First Publish Date - 2022-04-29T12:16:07+05:30 IST

టిమ్స్‌ ఆస్పత్రి ఖాళీ అవుతోంది. కొవిడ్‌ కోసమే ఈ ఆస్పత్రి ఏర్పాటైంది.

గచ్చిబౌలి టిమ్స్‌ ఖాళీ.. ఇన్‌పేషెంట్‌ సేవలకు బ్రేక్‌..

  • ఓపీ అయితే ఓకే..
  • సిబ్బంది ఇతర ఆస్పత్రులకు తరలింపు
  • నిలోఫర్‌కు 75 మంది నర్సులు
  • సూపర్‌స్పెషాల్టీ వైద్య సేవల కల్పన 

హైదరాబాద్‌ సిటీ : టిమ్స్‌ ఆస్పత్రి ఖాళీ అవుతోంది.  కొవిడ్‌ కోసమే ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత లేకపోవడంతో రోగులు పెద్దగా రావడం లేదు. ఇన్‌పేషంట్లు అసలే లేరు. ఓపీ కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. దీంతో ఇక్కడ ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


కొవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేశారు. హుటాహుటిన ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించలేదు. ప్రస్తుతం జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న జబ్బులకే ఓపీ చికిత్సలు అందిస్తున్నారు. 


అది కూడా రోజుకు పదుల సంఖ్యలోనే. దీంతో ఇక్కడి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తాజాగా 75మంది నర్సులను నిలోఫర్‌ ఆస్పత్రికి అటాచ్‌ చేశారు.  కొద్ది రోజుల క్రితం 50 మంది నర్సులను సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు 200 మందిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. అలాగే వైద్యులను గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌ ఆస్పత్రులకు తరలించే యోచనలో ఉన్నారు. అవసరమైతే వైద్యుల సేవలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నారు.


సూపర్‌ సెష్పాలిటీ దిశగా

ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి, అల్వాల్‌, గడ్డి అన్నారంలో నిర్మించ తలపెట్టిన మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులకు మూడు రోజుల కిత్రమే సీఎం భూమి పూజ చేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో కూడా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వ నిర్ణయం. దీంతో ఇక్కడ అందు కు అనుగుణంగా మరమ్మతులు, ఆపరేషన్‌ థియేటర్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇన్‌ పేషంట్లను చేర్చుకోవద్దని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఓపీని మాత్రం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈనెల మొదటి నుంచి ఇన్‌పేషంట్లు ఎవరూ అడ్మిట్‌ కావడం లేదు.

Updated Date - 2022-04-29T12:16:07+05:30 IST