Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 07 Sep 2022 15:30:13 IST

గులాములే తప్ప, ‘ఆజాద్’లు లేని కాంగ్రెస్

twitter-iconwatsapp-iconfb-icon
గులాములే తప్ప, ఆజాద్లు లేని కాంగ్రెస్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒకవైపు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, మరోవైపు సువిశాల ఇస్లామిక్ టర్కీ ఒత్మాన్ సామ్రాజ్యం. ఈ రెండు మహా సామ్రాజ్యాల మధ్య చిన్న చితకా గల్ఫ్ దేశాలు తమ మనుగడ కొనసాగించాయి. హైదరాబాద్ నవాబు, బరోడా మహారాజులకు 21 తుపాకుల గౌరవ వందనంతో స్వాగతం పలికిన బ్రిటన్ పాలకులు గల్ఫ్ రాజులను కేవలం మూడు తుపాకుల గౌరవ వందనంతో స్వాగతించేవారు. ఎలాంటి ఆదాయ వనరులు లేక తినడానికి సరిగ్గా తిండి కూడ లేని నాటి కాలం నుంచి తమ చమురు ఆదాయం ద్వారా విశ్వ ఆర్థిక వ్యవస్థను శాసించే నేటి స్థాయికి గల్ఫ్ దేశాల రాచరిక పాలకులు ఎదిగిన తీరు ఒక అద్భుత చరిత్ర. మారుతున్న కాలానికి తగినట్లుగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొంటూ ఈ రాచరిక పాలకులు జనరంజక పాలన చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో మినహాయించి క్రియాశీలక రాచరిక వ్యవస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవు. అనుక్షణం క్షేత్రస్థాయిలో ప్రజానీకం నాడిని తెలుసుకుంటూ తమ అభిమతానికి అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడంలో ఈ రాచరిక పాలకులకు ఎవరూ సాటి లేరు, రారు కూడా. విశ్వసనీయత, విధేయుత, అంకితభావంతో పని చేసే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది.


ఈ దేశాలకు అభిముఖంగా అరేబియా సముద్రానికి ఆవలి వైపు ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లుతున్నా వారసత్వ నాయకత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ పాలన సుదీర్ఘ కాలం కొనసాగింది. అరబ్బుల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పాలక రాజకుటుంబం తరహా స్వభావం కలిగిన వ్యవస్థ అని చెప్పవచ్చు. ఒకనాటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ పట్ల అరబ్బులకు, గల్ఫ్ దేశాల పాలక రాజకుటుంబాలకు ప్రత్యేక గౌరవాదరాలు ఉన్నాయి. ఆబుధాబి రాజు శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్‌ను తన సోదరుడు, మిత్రుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) సంబోధిస్తారు. ఆబుధాబి రాజు కూడా మోదీ పట్ల విశేష గౌరవాభిమానాలు చూపుతారు. 1975లో శేఖ్ మొహమ్మద్ తండ్రి శేఖ్ జాయద్ ఇందిరాగాంధీని కలువడానికి భారత్‌కు వచ్చారు. అప్పుడు బాలుడుగా ఉన్న ప్రస్తుత రాజు కూడా తన తండ్రితో పాటు వచ్చి మరీ ఇందిరాగాంధీతో సమావేశమయ్యారు. ఇందిర మనవడు రాహుల్ గాంధీ ఎలాంటి అధికారిక హోదా లేకున్నా గల్ఫ్ దేశాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు పాలక రాచరిక కుటుంబాలు అన్నీ ఎనలేని గౌరవ మర్యాదలు చేశాయి. నెహ్రూ–గాంధీల కుటుంబంపై వారికి ఉన్న అమిత గౌరవమే అందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు.


మరి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దయనీయ స్థితికి ఎందుకు చేరుకున్నది? గల్ఫ్ పాలక కుటుంబాలకు ఉన్నట్లుగా విశ్వసనీయత, విధేయత, చిత్తశుద్ధి కలిగిన యంత్రాంగం లేకపోవడమే ఒక ప్రధాన కారణం. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వెళ్ళిపోతూ దుమ్మెత్తిపోసిన సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ విషయాన్నే చూడండి. ఆయన పార్టీ అధిష్ఠానవర్గ కోటరీలో ముఖ్యుడు. ఒక రకంగా చెప్పాలంటే మహామంత్రి తిమ్మరుసు. ప్రజాక్షేత్రంలో పట్టు లేకున్నప్పటికి న్యూఢిల్లీలో మాత్రం పట్టు సంపాదించిన నేత. అయితే ఇటువంటి నాయకుల వల్లే కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రాంగంగా పతనమయింది. దాని నాయకులుగా చెలామణీ అయిన వారు మాత్రం వ్యక్తిగతంగా అన్ని విధాల లబ్ధి పొందారు. కశ్మీర్‌లో గానీ, జమ్మూలో గానీ ప్రజలతో సంబంధం లేని గులాంనబీ ఆజాద్ కశ్మీరీ నేతగా ఢిల్లీలో అవతారమెత్తారు. సౌదీ అరేబియా రాజును కలవాలనే ఒక చిరకాల వాంఛ ఆయనకు ఉండేది. అయితే అది నెరవేరడమనేది, దౌత్యమర్యాదల కారణాన అది అంత సులభతరం కాదు. పీవీ నరసింహారావు తన దూతగా ఆజాద్‌ను అప్పటి రాజు ఫహాద్ వద్దకు పంపించారు. అలా ఆజాద్ కల నెరవేరింది.


తమ రక్తంతో కాంగ్రెస్‌ను తీర్చిదిద్దామని చెప్పిన గులాంనబీ ఆజాద్ కేవలం ఆ పార్టీ పుణ్యంతో మాత్రమే పరాయి రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. స్వరాష్ట్రంలో డిపాజిట్ కూడ దక్కించుకోలేని ఆజాద్‌కు అదే పార్టీ 2005లో ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన మొదటిసారిగా తన స్వరాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కాంగ్రెస్ కట్టబెట్టింది! ప్రజాబలం లేకున్నా ముఖ్యమంత్రిగా ఎదగడం కాంగ్రెస్ లోనే సాధ్యం. అటువంటి గౌరవాన్ని ఇచ్చిన పార్టీకి ఆజాద్ ఏ విధమైన వీడ్కోలు చెప్పారో అందరికి తెలిసిందే. ఈ తరహా దళారుల కారణాన పార్టీ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేని వారు పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ వేదికలపై వెలుగొందుతున్నారు. నిజమైన నాయకులు వందిమాగధులను దూరంగా ఉంచుతారు. భజనపరులతో కాకుండా విశ్వసనీయుల ద్వారా ప్రజానాడిని తెలుసుకుంటూ వ్యవహరిస్తారు. అరబ్బు పాలకులు చేసింది ఇదే. అందుకే నాడు బ్రిటన్‌తో మూడు తుపాకులతో మాత్రమే గౌరవ వందనాలు పొందిన గల్ఫ్ దేశాల అధినేతలు నేడు అగ్రరాజ్యాధినేతలను తమ వద్దకు పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. 

- మొహమ్మద్ ఇర్ఫాన్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.