HYD : ఇంకా ‘కట్టడి’లోనే కంటోన్మెంట్‌ రోడ్డు.. అంతర్గత మార్గాలు తెరిచేదెన్నడో.. కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య Tweet వార్‌!

ABN , First Publish Date - 2022-02-12T11:45:36+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రస్తుతానికి ప్రధాన ..

HYD : ఇంకా ‘కట్టడి’లోనే కంటోన్మెంట్‌ రోడ్డు.. అంతర్గత మార్గాలు తెరిచేదెన్నడో.. కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య Tweet వార్‌!

  • చుట్టూ తిరిగి వస్తున్న స్థానికులు
  • సా..గుతున్న సమస్య

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రస్తుతానికి ప్రధాన రహదారులపై రాకపోకలు సాగుతున్నప్పటికీ, చాలాకాలంగా అంతర్గత రోడ్లు మూతపడి ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పలు రోడ్లు మూసివేయడంతో చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని కంటోన్మెంట్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ట్వీట్ల వార్‌..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రహదారులపై మిలిటరీ ఆంక్షలపై, రోడ్ల మూసివేత అంశంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ల మధ్య గత డిసెంబర్‌ 20వ తేదీన ట్వీట్లు, ప్రకటనల యుద్ధం జరిగింది. కంటోన్మెంట్‌ రోడ్లను మిలిటరీ అధికారులు మూసివేయడంతో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని, వీటిని తెరిపించాలంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి స్పందిస్తూ ‘మల్కాజిగిరి తదితర రోడ్లను అప్పగించినప్పటికీ, వాటినే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ఇప్పుడు మిలిటరీ ఏరియా కావాలంటూ మున్సిపల్‌ శాఖ మంత్రి కోరుతున్నారు. కంటోన్మెంట్‌లోని ఆ రోడ్ల జాబితా ఇవ్వండి’ అన్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఇవిగో మీరు అడిగిన రోడ్ల లిస్ట్‌’ అంటూ 22 రోడ్ల పేర్లతో ట్వీట్‌ చేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది.


 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పదుల సంఖ్యలో మిలిటరీ స్థావరాలు, సంస్థలు, కార్యాలయాలు ఉండడంతో దశాబ్దాలుగా మిలిటరీ యంత్రాంగం-సాధారణ ప్రజానీకం మధ్య రోడ్లు, ఇతర అంశాల్లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా కారణాల వల్ల పలు రోడ్లను మిలిటరీ అధికారులు మూసివేస్తూ వచ్చారు.  ఆరేళ్ల క్రితం గఫ్‌, వెల్లింగ్టన్‌ రోడ్లను మొదట రాత్రి వేళల్లో, ఆ తర్వాత పగలూ మూసివేశారు. దాంతో అల్వాల్‌, బొల్లారం, మల్కాజిగిరి, ఏఎ్‌సరావునగర్‌, నేరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి లక్షలాది మంది విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వాణిజ్య తదితర అవసరాల నిమిత్తం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లకు రాకపోకలు సాగిస్తారు. వారంతా నాచారం, తార్నాక, మెట్టుగూడ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లవలసి వచ్చింది. దాంతో ట్రాఫిక్‌, ఇంధన, సమయం వృథా తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 


దీనిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా మిలిటరీ ఉన్నతాధికారులు వినలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌లు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అందరి ఒత్తిళ్ల కారణంగా రోడ్లను తెరిచిన మిలిటరీ ఉన్నతాధికారులు, ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించుకోవాలని, అప్పటి వరకు తమ రహదారులపై రాకపోకలను అనుమతిస్తామని ప్రకటించారు. దాంతో సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. ప్రస్తుతం గఫ్‌, వెల్లింగ్టన్‌ ప్రధానరహదారులపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఏ క్షణంలో మళ్లీ మిలిటరీ అధికారులు వాటిని మూసివేస్తారోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ప్రధాన రోడ్లను తెరిచిన అధికారులు పలు అంతర్గత రోడ్లను మాత్రం ఇంకా తెరవలేదు. వాటిని మూసివేసి ఉంచడంతో వేలాది ప్రజలు ఇంకా అవస్థలకు గురవుతూనే ఉన్నారు.


ఇంకా మూసి ఉన్న రోడ్లు

లక్డావాలా రోడ్డు, హోలీ ట్రినిటీ చర్చి రోడ్‌, మిల్కాసింగ్‌ కాలనీ రోడ్డు, బొల్లారం పార్కు పక్కన రోడ్‌. అమ్ముగూడ వద్దఉన్న బట్టికలోవా రోడ్‌, లాల్‌బజార్‌ నుంచి ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్ వెళ్లే రోడ్డు, ఎంప్రెస్‌ రోడ్డు తదితర అంతర్గత రోడ్లు ఇంకా మూసి ఉన్నాయి. కౌకూర్‌ రోడ్డుపై తరచూ మిలిటరీ అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ఐడెంటిటీ కార్డులు చూసి రాకపోకలకు అనుమతిస్తున్నారు.


సమన్వయ సమావేశమేదీ?

గతంలో స్థానిక మిలిటరీ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ (లైజన్‌) సమావేశం ఆరు నెలలకోసారి జరిగేది. మిలిటరీ ఏరియాల్లో సాధారణ పౌరులకు కలుగుతున్న ఇబ్బందులు, సాధారణ ప్రజానీకం వలన మిలిటరీకి కలిగే అసౌకర్యాలపై సమావేశంలో చర్చించి, పరిష్కార మార్గాల కోసం యత్నించేవారు. స్థానిక మిలిటరీ యంత్రాంగం దీనిపై ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖకు కూడా నివేదిక పంపేవారు. అయితే ఏడేళ్లుగా సమావేశం జరగడం లేదు. దాంతో ఆయా సమస్యలను స్థానిక మిలిటరీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా కలగడం లేదు. వాటిలో కొన్నింటికైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఈ సమావేశం జరిగేలా చొరవ చూపాలని పలువురు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-02-12T11:45:36+05:30 IST