బండ్ల గణేష్ అంటే నటుడు, నిర్మాతే కాదు.. అంతకు మించి పవన్ కల్యాణ్‌కు భక్తుడు. ఇది టాలీవుడ్ ఎరిగిన సత్యం. మెగా ఫ్యామిలీతో బండ్ల గణేష్ ఎంతో సఖ్యతగా ఉంటారు. మెగా హీరోలను ఎవరేమన్నా ఆయన సహించరు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందన్న ప్రచారం మేరకే ఆయన ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మద్దతు ఇచ్చారు. ప్రకాష్ రాజ్‌ను ఎవరేమన్నా వెనకేసుకొచ్చారు. అయితే ప్రకాష్ సడెన్‌గా తన ప్యానల్లోకి జీవితా రాజశేఖర్‌ను తీసుకోవడం బండ్ల గణేష్‌కు ఏమాత్రం రుచించలేదు. పైగా ప్రకాష్ రాజ్ ప్యానల్లో సభ్యుడిగా తన పేరు లేకపోవడం కూడా ఆయన ఆ ప్యానల్ నుంచి బయటకు రావడానికి కారణం అయింది. మెగాస్టార్ చిరంజీవిని గతంలో బహిరంగంగానే విమర్శించిన యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ సతీమణి జీవితను జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేయమనడం బండ్ల గణేష్ మనస్సాక్షికి నచ్చలేదు. దీంతో తనకు అప్పగించిన అధికార ప్రతినిధి బాధ్యతను బండ్ల గణేష్ త్యజించారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రకాష్ రాజ్‌కు బహిరంగంగానే ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్ పోటీ చేయనున్న జనరల్ సెక్రెటరీ పదవికే తాను స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
బండ్ల గణేష్ ఒకవేళ కేవలం ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అధ్యక్ష పదవి నుంచి ఈసీ మెంబర్ వరకు దేనికైనా పోటీ చేయొచ్చు. అయితే ప్రత్యేకంగా జనరల్ సెక్రెటరీ పదవికే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం వెనుక జీవితా రాజశేఖర్‌ను ఓడించడమే ధ్యేయమని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదనే బండ్ల గణేష్ విమర్శ వెనుక కూడా జీవితా రాజశేఖర్ పని తీరును ఎండగట్టడమే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం వీకే నరేష్ ప్యానల్లో జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ పదవిలో ఉన్నారు. ఆమెను ఉద్దేశించే బండ్ల విమర్శలు చేశారు.
ఎలాంటి విభేదాలు లేవు: జీవిత
జనరల్ సెక్రెటరీ పదవికి బండ్ల గణేష్ పోటీ చేస్తున్నారన్న విషయంపై జీవిత ఓ చానెల్‌తో మాట్లాడారు. ‘మా’ అనేది అందరిదీ అని, ఇందులో ఎవరు ఎవరికీ వ్యతిరేకం కాదని జీవిత అన్నారు. బండ గణేష్ తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బండ్ల గణేష్ తనను శత్రువుగా చూస్తున్నారని అనుకోవడం లేదన్నారు. ‘మా’ అసోసియేషన్‌లో ఎవరైనా పోటీ చేయొచ్చని, ఏ ఎన్నికల్లోనైనా గెలుపోటములు సహజమని జీవితా రాజశేఖర్ తెలిపారు. తాను గెలిచినా, ఓడినా ప్రకాష్‌రాజ్ ప్యానెల్లోనే పనిచేస్తానని చెప్పారు.
ఒకవైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు ఇద్దరు అధ్యక్ష పదవికి హోరాహోరీగా పోటీ పడుతున్న ‘మా’ ఎన్నికల్లో బండ్ల గణేష్ ఇచ్చిన ట్విస్ట్ మరింత చర్చనీయాంశంగా మారింది. తనకు ‘మెగా’ మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్న ప్రకాష్ రాజ్.. ఇప్పుడు బండ్ల గణేష్ యూటర్న్‌తో చిక్కుల్లో పడ్డట్లు అయింది. మేమంతా ఒకటే అంటూ చెప్పుకునే సినిమా పెద్దలు.. ఈ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై ఏం తేలుస్తారో చూడాలి.