Abn logo
Jul 12 2020 @ 15:59PM

భూతల స్వర్గం.. మరుభూమిలా ఆర్తనాదాలు పెడుతోంది..!

భూతల స్వర్గం అమెరికా ఇప్పుడు నరకంలా మారింది. ఇంకా చెప్పాలంటే మరుభూమిలా ఆర్తనాదాలు పెడుతోంది. ఆస్పత్రుల్లో మరణమృదంగం వినిపిస్తోంది. అలాంటి ఆపత్కాలంలో మన తెలుగు వైద్యులు అమెరికాకు అండగా నిలుస్తున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆ యుద్ధంలో ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ.. ఆ బాధలు వారి మాటల్లోనే తెలుసుకుందాం..విల్లు రాసేశాం...

నా పేరు డా.కమల, మా ఆయన ప్రవీణ్‌. అమెరికాలో ఇద్దరం కార్డియాలజిస్టులమే. కోవిడ్‌ రోగులకు హృద్రోగాలు వచ్చినప్పుడు చూస్తుంటాం. ఐసీయూలో పనిచేస్తున్నప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. స్టెతస్కోప్‌, పెన్నులు, వాచీలు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇంటికి రాగానే బేస్మెంట్‌లోనే మా బట్టల్ని వాషింగ్‌ మిషిన్‌లో వేసి.. డైరెక్టుగా బాత్‌రూం వెళ్లి స్నానం చేస్తాం. అప్పుడు కానీ ఇంట్లోకి వెళ్లలేం. అయినా పిల్లలకు, పెద్దలకు దూరంగానే ఉంటున్నాం. మేము హాలులో ఉన్నప్పుడు వాళ్లు రారు. వాళ్లు వచ్చినప్పుడు మేం లోపలికి వెళతాం. ఒకేసారి అందరం భోజనం చేయం. ఈ జాగ్రత్త లేకపోతే.. హాస్పిటల్‌ నుంచి వైరస్‌ను ఇంటికి తీసుకొచ్చిన వాళ్లం అవుతాం. కొన్నాళ్ల క్రితం ప్రవీణ్‌కు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు ఒక గదిలోనే ఉండాల్సి వచ్చింది. మా ఇద్దరికీ ఏమైనా జరిగితే? అనే భయంతో విల్లు రాసేసి ఉంచాం. పేషెంట్లు చనిపోవడం ప్రతి డాక్టరు చూస్తుంటాడు. అయితే కరోనా వల్ల ఇంతమంది అమెరికాలో మా కళ్లెదుటే రాలిపోతుండటం తట్టుకోలేకపోతున్నాం. ఆఖరి గడియల్లో కూడా ఆత్మీయులు దగ్గరలేని ఘోరం. ఫేస్‌టైమ్‌లోనే కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఆ సన్నివేశాలు చూడలేక మనసు వికలం అవుతోంది.


ఇళ్లకే వెళ్లలేదు..

న్యూయార్క్‌లోని నాసౌ యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాను. నా పేరు డా. అతీత్‌ కొసరాజు. ఇదివరకు వృద్ధులు ఎక్కువగా చనిపోయేవారు. ఇప్పుడు చిన్న వయసు వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. నాతో పనిచేసే ఆరుగురు సహోద్యోగులు కరోనాతో చనిపోయారు. ఆ బాధను దిగమింగుకుని పనిచేస్తున్నా. మరోవైపు రిటైర్‌ అయిన వైద్యులు కూడా  ధైర్యంగా ఆస్పత్రికి వచ్చి వైద్యం చేస్తుంటే.. మా భయం పోతోంది. డాక్టర్లు అందరం ఇళ్లకు వెళ్లడం లేదు. హోటళ్లలోనే ఉంటున్నాం. నా తోటి వైద్యుడికి పాప పుట్టింది. ఇంతవరకు ఫోన్లలో చూడటమే కానీ.. ఇంటికెళ్లి చూడలేదు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎన్నడూ చూడలేదు. 


పుట్టుకా విషాదమే..

నేను డా.కిరణ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ప్రాన్సిస్కో హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. అప్పట్లో ఆస్పత్రి లోపలికి ఏ ఇబ్బందీ లేకుండా వెళ్లేవాళ్లం. ఇప్పుడు కుదరదు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. లేవని నిర్ధారణ అయితేనే లోపలికి వెళ్లగలుగుతాం. నేను గైనకాలజిస్టును కాబట్టి గర్భిణిలను చూస్తుంటాను. కడుపుతో ఉన్న ఒకావిడ మా వద్దకు వచ్చింది. పరీక్ష చేసి ఇంటికి పంపాం. ఫలితం ఇంకా రాలేదు. అప్పుడే ఆమె ఇంటి నుంచి ఫోన్‌ చేసి.. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. వెంటనే రమ్మని చెప్పాం. ఆమె వాళ్ల ఇంటిదగ్గర ఉన్న చిన్న ఆస్పత్రికి వెళ్లింది. వాళ్లు తిరిగి మాకు రెఫర్‌ చేశారు. అప్పటికే ఆ మహిళ పరిస్థితి దిగజారింది. ఐసీయూలో వెంటిలేటర్‌పై పెట్టాల్సి వచ్చింది. అత్యవసర కాన్పు చేయక తప్పలేదు. ఇప్పుడు తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. 


కడచూపు కోసం..

అమెరికాలో నేను (డా.సరస్వతి బట్టర్‌) వృద్ధులకు చికిత్స చేస్తుంటాను. డిమెన్షియా ఉన్న వృద్ధులకు కోవిడ్‌ అంటే అర్థం కావడం లేదు. వాళ్లకు జ్ఞాపకశక్తి ఉండదు కాబట్టి. రోజూ సాయంత్రం కాగానే అందరూ కలిసి డిన్నర్‌ చేయడం, టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవడం అలవాటు. ఇప్పుడు వాళ్లను ఒక గదిలో పెట్టడం నచ్చడం లేదు. ఒకపెద్దాయన క్యాన్సర్‌ పేషెంట్‌. అతని కూతురు తన పన్నెండేళ్ల కొడుకుని తీసుకుని.. ఎంతో దూరం నుంచి నాన్నను చూసేందుకు కారులో వచ్చింది. ‘న్యూయార్క్‌ హై రిస్క్‌ ఏరియా. మీరెందుకు వచ్చారు?’ అని వైద్యులం అడిగాం. అయినా తండ్రిని చూసే వరకు ఆ కూతురు ప్రాణం నిలువలేదు. మేము ఒక ఐపాడ్‌ తెప్పించి ఐసీయూలోని ఆ తండ్రిని కూతురికి చూపించాం. ఆయన ముక్కు, నోటికి పైపులు, ఆక్సిజన్‌వంటివన్నీ ఉన్నాయి. కూతుర్ని గుర్తుపట్టాడో లేదో తెలీదు. ఆమె మాస్క్‌ విప్పితేనే గుర్తుపట్టగలడు. కానీ ఆమె మాస్క్‌ తీస్తే ప్రమాదం. ఆ సన్నివేశం భరించలేకపోయాను. ఆ తరువాత మా స్టాఫ్‌ అందరూ అతని చుట్టూ ఉండగానే చనిపోయాడు. నేను చాలా బాధ పడ్డాను. 


ఆత్మీయులకుదూరమై..

నేను డా. ఉషా కారమూడి, పిట్స్‌బర్గ్‌లో ఇన్‌పెక్షన్‌ డిసీజ్‌ స్పెషలిస్టుగా పనిచేస్తున్నాను. మొదట్లో వైరస్‌ అంటే భయపడేవాళ్లం. ఇప్పుడు అలవాటైంది. ఒక పేషెంట్‌ ఆస్పత్రిలో పడితే.. వారి కుటుంబ సభ్యులు దగ్గరుంటే త్వరగా కోలుకుంటారు. మనో ధైర్యం వస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో అలా చేయడం కుదరదు. కరోనా పేషెంట్లు ఇంట్లో వాళ్లను చూడాలని ప్రాధేయపడుతుంటారు. వాళ్లను చూస్తే బాధ కలుగుతుంది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ఆత్మీయులు ఆస్పత్రికి వస్తే వారికీ వ్యాధి సోకుతుంది. అదింకా ప్రమాదం. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. భరించాల్సిదే!.  


ముప్పును తప్పించుకుంటూ..

న్యూయార్క్‌లోని మౌంట్‌ సినాయ్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను.. కోవిడ్‌ పేషెంట్లకు రకరకాల పరీక్షలు అవసరం అవుతాయి. అందులో సీటీ స్కాన్‌ ఒకటి. నాకు ఆ బాధ్యత అప్పగించారు. పేషెంట్లను స్కాన్‌ చేశాక ప్రతి చిన్న పరికరాన్నీ శానిటైజ్‌ చేయాలి. దానికి కనీసం ఒక గంట పడుతుంది. మాకు సాధారణ మాస్కులు, గ్లవుజ్‌లు ఇస్తున్నారు. వాటితో పనిచేయాలంటే భయం వేస్తోంది. నా స్నేహితుల ద్వారా ఎన్‌95 మాస్కును తెప్పించుకున్నా. ఇంటి నుంచి ఆస్పత్రికి చేరుకోవడం అంత సులభం కాదు. ఇదివరకు సబ్‌వే రైలులో వెళ్లేదాన్ని. అది కిక్కిరిసి ఉంటుంది. ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ వస్తుదో చెప్పలేం.. అన్నారు డా.ఆర్తిరెడ్డి.


ఏడుపు, కోపం అన్నీ..

నా పేరు డా.రాఘవేంద్రరావు శనివారపు. న్యూయార్క్‌లోనే ఓ ఆస్పత్రిలో క్రిటికల్‌కేర్‌లో పనిచేస్తున్నాను. కోవిడ్‌ రోగులకు వైద్యం చేయడానికి రమ్మని పిలుపు రాగానే.. నా భార్యా, తొమ్మిది నెలల కొడుకును ఇండియాకు పంపించాను. అక్కడైతే ఇంట్లోనే భద్రంగా ఉంటారన్న నమ్మకం. ఇక్కడ నేను ఆస్పత్రి నుంచీ వచ్చి రోగాన్ని అంటిస్తే.. వాళ్ల గతేం కాను.. అనే భయంతోనే పంపించాను. ఆస్పత్రుల్లో మేమింత కష్టపడుతున్నా పేషెంట్లు చనిపోతుంటే.. ఓడిపోతున్నామన్న భావన వేధిస్తుంది. ఒక్కోసారి ఏడుపొస్తుంది, కోపం కూడా వస్తుంది. ముఖ్యంగా మాకు దగ్గరవాళ్లు చికిత్సకు వచ్చి చనిపోతే.. ఆ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు చెప్పినప్పుడు నరకం అనుభవించాల్సి వస్తోది. కోవిడ్‌ సమయంలోనే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. మేమింత కష్టపడుతుంటే.. కొందరు లాక్‌డౌన్‌లు ఎత్తేయాలని నిరసనలు, ఆందోళనలు చేస్తుండటం ఇంకా బాధ అనిపిస్తుంది. ప్రజలు కొంత చైతన్యంతో వ్యవహరించి ఉంటే.. ఇంత మంది చనిపోయుండేవారు కాదు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. లేకపోతే ఇళ్లలోనే ఉండిపోవడం మేలు.

Advertisement
Advertisement
Advertisement