పరాగ్.. అడ్డంకుల్ని అధిగమించి ట్విట్టర్ పిట్ట చేత కూత పెట్టించగలరా? అమితాసక్తితో గమనిస్తున్న ప్రపంచం!

ABN , First Publish Date - 2021-12-12T15:25:43+05:30 IST

రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నట్లే... ఆయా దేశాల ప్రభుత్వాల నుంచీ సెగ తగులుతోంది ట్విట్టర్‌కు!.

పరాగ్.. అడ్డంకుల్ని అధిగమించి ట్విట్టర్ పిట్ట చేత కూత పెట్టించగలరా? అమితాసక్తితో గమనిస్తున్న ప్రపంచం!

రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నట్లే... ఆయా దేశాల ప్రభుత్వాల నుంచీ సెగ తగులుతోంది ట్విట్టర్‌కు!. ఇలాంటి అడ్డంకుల్ని చాకచక్యంతో ఒక భారతీయ సీఈవో ఎలా అధిగమిస్తాడు? ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాడు? చూడాలనుకుంటోంది ప్రపంచం. ట్విట్టర్‌కు సంబంధించిన గొడవలు, ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ సమస్యల మధ్య కొత్త సీఈవోగా ఎంపికయ్యాడు భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌. మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, గూగుల్‌కు సుందర్‌ పిచయ్‌, ఐబీఎంకు అరవింద్‌ క్రిష్ణ, అడోబ్‌కు శంతను నారాయణ్‌ల వరుసలో మన దేశానికి దక్కిన మరొక ఖ్యాతి - ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ ఎంపికవ్వడం...


‘నీకెప్పుడూ చదువు పిచ్చి. నాకేమో పాటల పిచ్చి. భవిష్యత్తులో ఎవరు ఏమవుతామో.. చూద్దాం’ క్యారియర్‌ విప్పి భోజనం చేస్తున్నప్పుడు అనేది శ్రేయా ఘోషల్‌. మెత్తగా నవ్వుతూ తలవంచుకుని భోజనం చేయడంలో మునిగిపోయేవాడు పరాగ్‌. ముంబయిలోని అటామిక్‌ ఎనర్జీ స్కూల్‌లో వాళ్లిద్దరూ క్లాస్‌మేట్స్‌. పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌కు సీఈవో అవుతాడనీ, ఆయనకు అదే ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెబుతాననీ శ్రేయాఘోషల్‌ ఏనాడూ ఊహించలేదు. శ్రేయ కూడా ఇంత పెద్ద నేపథ్య గాయని అవుతుందనీ, ఆమె పాటలను కారులో వింటూ ఆఫీసుకు వెళతాననీ పరాగ్‌ కూడా కల కనలేదు. మొత్తానికి ఇద్దరు స్కూల్‌మేట్స్‌లో ఒకరు గాయని, మరొకరు అగ్ర సంస్థకు అధినేత అయ్యారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి. తండ్రి అటామిక్‌ ఇంజనీర్‌ అయితే తల్లి ఉపాధ్యాయురాలు. ముంబాయిలోనే పాఠశాల విద్య పూర్తయింది. జేఈఈలో 77వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ బాంబేలో సీటొచ్చింది. తనకు ఇష్టమైన కంప్యూటర్‌సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. పీహెచ్‌డీ కోసం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అనేక అవకాశాలు వచ్చాయి. తనకు నచ్చిన సమాచార సాంకేతిక రంగంలోనే స్థిరపడాలనుకున్నాడు.


ఇండియాలో ప్రఖ్యాతి గాంచిన బాంబే ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌, అమెరికాలో డాక్టరేట్‌...  పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి మరీ ఉద్యోగాలను ఇచ్చాయి. ముందుగా మైక్రోసాఫ్ట్‌ ఆ తరువాత యాహూ, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌లలో పనిచేశాడు పరాగ్‌. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరాక దశ మారింది. ఆరేళ్లు తిరిగేసరికి అతని ప్రతిభను గుర్తించింది కంపెనీ. 2017లో చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. కృత్రిమ మేథ సాంకేతిక వ్యవస్థతో ట్విట్టర్‌ను మరింత దృఢంగా మార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రఖ్యాత సంస్థలన్నీ యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్న తరుణంలో ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకులైన జాక్‌ డోర్సే అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ‘‘మా సంస్థను లోతుగా అర్థం చేసుకుని, ప్రస్తుతం సంస్థకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి పరాగ్‌’’ అంటూ అతన్ని అభినందించాడు జాక్‌. ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌ పట్ల అనేక ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌లో వచ్చే ట్వీట్ల పట్ల కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కొన్ని విషయాల పట్ల నియంత్రణ ఉండాలని విమర్శలు గుప్పించింది. వివాదాస్పదమైన సంఘటనల పట్ల కేసులు సైతం నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే పరాగ్‌ అగర్వాల్‌ను ట్విట్టర్‌ సీఈవోగా నియమించినట్లు సంస్థ పేర్కొంది. వీటన్నిటికీ ఒక పరిష్కారం వెదికి, సంస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు పరాగ్‌.


భారతీయ సీఈవోలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఎంత గురి అంటే... పరాగ్‌ అగర్వాల్‌ను సీఈవోగా ప్రకటించిన వెంటనే ట్విట్టర్‌ షేర్‌ ఏకంగా 11 శాతం రయ్‌మని దూసుకెళ్లింది. సమయానుకూల నిర్ణయాలు, వివాదారహిత నాయకత్వం, దూరదృష్టి, సానుకూల మార్పులు... ఇలాంటివే పరాగ్‌ నాయకత్వ లక్షణాలు. అందుకే భవిష్యత్తులో ఆయన ఆధ్వర్యంలో నడిచే ట్విట్టర్‌లో మరిన్ని మార్పులను ఆశించే అవకాశం ఉందంటున్నారు ఇన్వెస్టర్లు.


ఉద్యోగంలో దంపతులు ఇద్దరూ ఇంత బిజీగా ఉన్నప్పటికీ విహారయాత్రలకు వెళ్లడం, అన్యోన్యంగా మెలగడం, కుటుంబ బంధాలకు విలువనివ్వడం వీరికి సొంతం. ఇంట్లో కూడా సంప్రదాయ వాతావరణమే కనిపిస్తుంది. పరాగ్‌ అగర్వాల్‌, వినీత అగర్వాల్‌లది ప్రేమ వివాహం. ఆమె స్టాన్‌ఫోర్డ్‌ మెడిసిన్‌లో బయోఫిజిక్స్‌ చేసింది. తను క్లినికల్‌ ప్రొఫెసర్‌, ఫిజీషియన్‌గా చేసింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఎండీతో పాటు పీహెచ్‌డీ కూడా చేసింది. ఆ తరువాత వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా మారింది. వీరికి ఒక చిన్న బాబు.

Updated Date - 2021-12-12T15:25:43+05:30 IST