సోలిపేట.. పోరుబాట.. నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం

ABN , First Publish Date - 2020-08-07T19:22:21+05:30 IST

ఓ ఉద్యమతార రాలిపోయింది. అక్షరాలు నేర్చుకున్న చోటు నుంచే పోరుబాట పట్టి కడదాకా కొనసాగించి.. ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, రచయితగా పేదల పక్షాన

సోలిపేట.. పోరుబాట.. నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం

అదే స్పూర్తితో అభివృద్ధి మంత్రం

లింగన్న అనే పిలుపుతో ప్రజలకు చేరువ


దుబ్బాక(సిద్ధిపేట) : ఓ ఉద్యమతార రాలిపోయింది. అక్షరాలు నేర్చుకున్న చోటు నుంచే పోరుబాట పట్టి కడదాకా కొనసాగించి.. ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, రచయితగా పేదల పక్షాన నిలిచారు. ప్రజాప్రతినిధిగా బడుగువర్గాలకు బాసటగా మారారు. అన్నింటా ఉద్యమ పంథానే కొనసాగించారు. అదే సోలిపేట రామలింగారెడ్డిని అలియాస్‌ లింగన్న అలియాస్‌ ఆర్‌ఎల్‌ఆర్‌ అలియాస్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టింది. 


రాడికల్‌ విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం

దుబ్బాకలోని జూనియర్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో ఇంటర్‌ విద్య నుంచే ఆయన క్రియాశీలక రాజకీయాలను ప్రారంభించారు. అభ్యుదయ, విప్లవ విద్యార్థి సంఘాలకు ఆయన దగ్గరయ్యారు. 1981-83లో దుబ్బాక జూనియర్‌ కళాశాలకు జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలిచారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  చేరిన ఆయన ప్రగతిశీల విద్యార్థి సంఘంలో కొద్ది రోజులు పని చేసి, ఆ తరువాత రాడికల్‌ విద్యార్థి సంఘంలో చేరారు. జిల్లా కార్యదర్శిగా పని చేశారు. పీపుల్స్‌ వార్‌ సానుభూతిపరుడిగా పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలిచారు. ఆయన జర్నలిస్టు వృత్తిలో చేరారు. 


జర్నలిస్టుగా నిర్బంధాల్లో.. ప్రజల్లో..

ఉదయం దినపత్రికలో దుబ్బాక తాలుకా ప్రతినిధిగా 1987లో చేరిన ఆయన జర్నలిస్టుగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు బాసటగా జర్నలిస్టు ఉద్యమాలను నడిపారు. ఆయనపై 1990లో చెన్నారెడ్డి ప్రభుత్వం టాడా కేసును నమోదు చేసింది. ప్రస్తుత ఏపీ రిటైర్డ్‌ డీజీపీ సాంబశివరావు ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న సమయంలో మెదక్‌ సీఐ సత్యనారాయణ దుబ్బాకలోని మిత్రుడి బట్టల దుకాణం నుంచి రామలింగారెడ్డిని తీసుకెళ్లారు. ఆయనను ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దుబ్బాక ప్రెస్‌క్లబ్‌తో పాటు, జిల్లా వర్కింగ్‌ జర్నలిస్టులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించారు. మొట్టమొదటిసారి దేశంలో ఒక జర్నలిస్టు మీద టాడా కేసు నమోదు కావడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. 


సామాజిక ఉద్యమ నేతగా..

సోలిపేట అంటేనే సామాజిక ఉద్యమ నావ. ఆయన జిల్లాలో అనేక ఉద్యమాలకు ఊతమిచ్చారు. మంజీర రచయితల సంఘంతో కలిసి, వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ను నడిపారు. రెండు ప్రజా సంఘాలు ఒక్కగొంతుకగా మారి జిల్లాలోని అనేక అసమానతలు, అసాంఘిక చర్యలపై సమరశంఖం ఊదారు. ప్రజాకవి నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివా్‌సతో పాటు జర్నలిస్టు నాయకులు విరాహత్‌ అలితో కలిసి ప్రజా ఉద్యమ నిర్మాణాలల్లో చురుకైన పాత్ర పోషించారు. 1992 నుంచి సారాపై ఉద్యమం, బహుళ జాతి కంపెనీలపై ఊరువాడ తిరిగి సభలను నిర్వహించారు. అందాల పోటీలపైన, వరకట్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తనవంతుగా పాలుపంచుకుంటూ, 2001లో టీఆర్‌ఎ్‌సకు పరోక్ష మద్దతుగా కదిలారు. 


రామలింగారెడ్డిది సభా వివాహం

ప్రజా ఉద్యమాలు, అభ్యుదయ భావాలు కలిగిన సోలిపేట రామలింగారెడ్డి తన సభా వివాహం చేసుకున్నారు. 1986లో తన ఉద్యమ మిత్రుడు, పీపుల్స్‌వార్‌ నాయకుడు శాకమూరి అప్పారావు, నాగన్న కలిసి కొండపాక మండలం జప్తినాచారం గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆయన మంజీరా రచయితల సంఘం ఆద్వర్యంలో సిద్దిపేటలో వేదిక వివాహం చేసుకున్నారు. ఆయన వివాహానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, వరవరరావు హాజరయ్యారు. వరకట్న దురాచారాలు, వివాహ ఆరడంబరాలు సాగుతున్న సమయంలో సభా వివాహం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. తన పిల్లలకు కూడా స్టేజ్‌ మ్యారేజ్‌లు చేశారు. 


ఉద్యమ నేపథ్యం నుంచి ఎమ్మెల్యే స్థాయికి 

దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి ఉద్యమ నేపథ్యమే 2004లో ఎమ్మెల్యేగా గెలిపించింది. సీఎం కేసీఆర్‌ దుబ్బాకపై ప్రత్యేక దృష్టి సారించి, ఉద్యమ నేపథ్యం ఉన్న సోలిపేటను టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున బరిలో దింపారు. ఆయన అప్పటి దొమ్మాట నియోజకవర్గం (ప్రస్తుత దుబ్బాక) నుంచి తొలిసారి సుమారు 24 వేల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు 2008లో తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేశారు. మళ్లీ జరిగిన ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 1500 మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గ పునర్‌విభజనతో దుబ్బాక నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2014లో మళ్లీ 36 వేల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 65 వేల మెజార్టీతో గెలుపొంది, రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా నియమితులైనారు. 


సవాల్‌ స్వీకరించి.. ఎమ్మెల్యేగా గెలిచి

జర్నలిస్టుగా వరుస కథనాలతో తన ప్రత్యర్థిగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డికి ఆయన ప్రతిసారీ సవాల్‌ విసిరారు. అనేక కథనాలతో మంత్రిగా ఉన్న ముత్యంరెడ్డికి కంటవిడుపుగా మారారు. దౌల్తాబాద్‌ మండలంలో ఆకలిచావులు, పలు అవినీతి కథనాలను అప్పటి టీడీపీ నేతలు జీర్ణించుకోలేదు. దీంతో అసహనానికి గురైన ముత్యంరెడ్డి అనుచరులు సిద్దిపేటలోని పత్రిక కార్యాలయం ఎదుట పలుసార్లు ధర్నాలు నిర్వహించారు. ఇదే క్రమంలో మంత్రిగా ముత్యంరెడ్డి ఆవేశంగా పలు సమావేశాల్లో ‘ఒక్క ఓటుకు చెల్లనోళ్లు పేపర్ల వార్తలు రాస్తరు. దమ్ముంటే ప్రజాప్రతినిధిగా పోటీ చేసి గెలవాలి’ అని సవాల్‌ విసరగా ఇది అనూహ్యంగా రామలింగారెడ్డికి కలిసి వచ్చింది. 2004లో బరిలో దిగిన ఆయన రాజకీయ దురంధరుడు చెరుకు ముత్యంరెడ్డిని ఓడించారు. ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు. 


ఏడాదిలోనే ఒరిగిన అభివృద్ధి కాముకులు

ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా సుదీర్ఘంగా కొనసాగిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇద్దరూ ఏడాది తిరగకముందే ప్రజలను విడిచి తీరని లోకాలకు వెళ్లారు. దుబ్బాక రాజకీయాల్లో ఇద్దరిదీ ప్రత్యేక ముద్రగానే ప్రజలు గుర్తిస్తారు. సుదీర్ఘంగా ప్రజాజీవితంలో గడిపిన వ్యక్తులను ఏడాదిలో కోల్పోయింది. గతేడాది సెప్టెంబర్‌ 2న చెరుకు ముత్యంరెడ్డి తనువు చాలించగా 11 నెలల్లోనే సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. ఇద్దరుసనాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994, 1999, 2009లో మాజీ మంత్రి ముత్యరెడ్డి గెలుపొందగా, 2004, 2008(ఉపఎన్నిక), 2014, 2019లో సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందారు. 


విప్లవ సాహిత్యంలో కవిగా ‘ఎస్‌ఎల్‌ఆర్‌’

అభ్యుదయ కవిగా, మంజీర రచయితల సంఘం సభ్యుడిగా సోలిపేట రామలింగారెడ్డి సాహిత్యం పట్ల మక్కువని చెప్పవచ్చు. ఆయన అజ్ఞాత వీరుల కవితలను ్‌అజ్ఞాత కలం’ ఎస్‌ఎల్‌ఆర్‌ పేరుతో కవితలు రాసేవారు. పీపుల్స్‌వార్‌ రాష్ట్ర నాయకుడు మహేందర్‌ ఎన్‌కౌంటర్‌పై ఆయన ‘అబాలాగోపాలపురం కన్నీరు మున్నీరైంది’ అంటూ కవితలు రాశారు. ప్రజాకవితలు, తెలంగాణ ఉద్యమంపై కూడా ఆయన రాశారు. రాజకీయ మిత్రులు ఆయనను ఆర్‌ఎల్‌ఆర్‌ అని పిలిచినా, ఆయన కలం పేరు ‘ఎస్‌ఎల్‌ఆర్‌’గా సాగింది. ఆయన జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచినా ఆయన కలం మాత్రం ఆగలేదు. అనేక వ్యాసాలను వివిధ పత్రికలకు అందించారు. సామాజిక అంశాలపై, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పునర్‌ నిర్మాణాలపై ఆయన అభిప్రాయాలను కరాఖండిగా వ్యాసాల రూపంలో అందించారు.


సోలిపేట కుటుంబ నేపథ్యం ఇదే

దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన సోలిపేట రామకృష్ణారెడ్డి, మణెమ్మల చిన్న కుమారుడు రామలింగారెడ్డి. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయనకు ఇద్దరు అన్నలు, ముగ్గురు అక్కలు. ఆయనకు ఒక కుమారుడు సతీ్‌షరెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు.


నక్సల్‌బరి చూడటమే నాచివరి కోరిక

ఉద్యమ నేపథ్యంతో పని చేసిన ఆయన ఒక జర్నలిస్టు మిత్రుడికి ఇటీవల చివరి సారి ఫోన్‌ చేశారు. ఆసుపత్రిలో చేరే ముందు సన్నిహితులతో కొన్ని విషయాలను పంచుకున్నారు. గత నెల 21న ఆయన ఆసుపత్రి నుంచే మాట్లాడారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జి అయితే తిరుపతి వెళ్లాలని మిత్రుడు అంటే.. కాదు కాదు డార్జిలింగ్‌లోని నక్సల్‌బరికి వెళ్లాలని, చారుమజుందార్‌ నివాసం చూడాలని, తనకు అదే చివరి కోరికని అన్నారు. పలుసార్లు వెళ్లాలనుకుంటే వాతావరణం సహకరించ లేదని చెప్పారు. ఈసారి అందరం జర్నలిస్టులతో కలిసి వెళ్దాం అంటూ తన కోరికను చెప్పి నెరవేరకముందే అందని తీరాలకు వెళ్లారు. 


నేతన్నల బతుకులను తట్టిన నేత

సుమారు 120 మంది నేతన్నలు ఆకలిచావులు, ఆత్మహత్యలతో తల్లడిల్లి చావుకేకపెడుతున్న సమయమది. జర్నలిస్టుగా ఆయన వరుస కథనాలను సమాజానికి అందించారు. జాతీయస్థాయి మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నది. 2001 వరకు తెలంగాణ ఉద్యమానికి చేనేతల సమస్యలు ప్రధాన భూమికగా నిలిచాయి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొదట ఆయన చేనేతల బతుకులను మార్చేందుకే ఎక్కువగా పని చేశారు. 

Updated Date - 2020-08-07T19:22:21+05:30 IST