అమరావతి.. ఓ కలల సౌథం.. జగన్ ప్రకటనతో సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2020-07-04T18:21:24+05:30 IST

అతనో చిరుద్యోగి. అమరావతి రాజధాని శాశ్వతం అని భావించి చదరపు గజం రూ. 20 వేలు ఖర్చు చేసి నివాసానికి 130 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

అమరావతి.. ఓ కలల సౌథం.. జగన్ ప్రకటనతో సీన్ రివర్స్..!

తమకూ ఇక్కడో ఇల్లు ఉండాలని కోరుకున్న రాష్ట్ర ప్రజలు

దేశ, విదేశాల్లో ఉంటున్న వారు అమరావతిలో ప్లాట్ల కొనుగోలు 

రాజధాని వికేంద్రీకరణ ప్రకటనతో అడియాశలు

రైతులతో పాటు నివాస స్థలాలు కొన్నవారూ ఆందోళన బాట


గుంటూరు (ఆంధ్రజ్యోతి): అతనో చిరుద్యోగి. అమరావతి రాజధాని శాశ్వతం అని భావించి చదరపు గజం రూ. 20 వేలు ఖర్చు చేసి నివాసానికి 130 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన తన పీఎఫ్‌ ఖాతా నుంచి నగదు డ్రా చేసుకోవాల్సి వచ్చింది. 


శ్రీనివాసరావు అనే గుంటూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మాతృభూమికి వచ్చి అమరావతి రాజధానిలో స్థిరపడాలన్న ఉద్దేశ్యంతో తాను సంపాదించుకొన్న నగదుతో 220 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 


రాయలసీమకు చెందిన ఓ చిరు వ్యాపారి అమరావతి రాజధానిలో వ్యాపారం విస్తరిస్తుందని భావించి తన కుటుంబ అవసరాల కోసం 100 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 


ఇలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు నా అమరావతి రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశ్యంతో అప్పోసొప్పో చేసి నివాస స్థలాలను కొనుగోలు చేశారు. కృష్ణానదికి సమీపంలోని రాయపూడి, ఉండవల్లి, వెంకటపాలెం, లింగాయపాలెం తదితర ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ ధర అయినా వెనకడుగు వేయలేదు. కేవలం అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతోనే వారంతా కొనుగోలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం తమపై రియల్‌ ఎస్టేట్‌ ముద్ర వేసిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రాజధాని ప్రకటించిన కొత్తలో బాగా డబ్బున్న వారే రైతుల వద్ద భూములు కొనుగోలు చేశారు. ఎప్పుడైతే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలో అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి నిర్మాణ పనులు ప్రారంభించారో అప్పుడు అందరికీ నమ్మకం కలిగింది.  ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు తాము పనిచేసే ఆఫీసుకు సమీపంలోనే నివాసం ఉండాలని తుళ్లూరు, నేలపాడు, దొండపాడు, వెలగపూడి తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు.  కొందరైతే తమ పిల్లల చదువుల కోసం విట్‌, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐడీ నిర్మాణాలు జరిగిన ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లో భూమిని కొన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు కూడా భూములు తీసుకోవడంతో వాటికి సమీపంలో కొందరు నివేశన స్థలాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం లేఅవుట్‌లు అభివృద్ధి చేయగానే గృహనిర్మాణ రుణాలకు బ్యాంకులు, వివిధ ఫైనాన్స్‌ సంస్థలకు దరఖాస్తు చేసుకొన్నారు. సరిగ్గా గత ఏడాది డిసెంబరు నెలలో సీఎం జగన్‌ అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రస్తావనతో ఒక్కసారిగా వారి ఆశలు తలకిందులయ్యాయి. అప్పటి నుంచి వారు కూడా రైతులతో కలిసి అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్నారు.  


అమరావతికి మద్దతుగా నేడు దీక్షలు

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో 200 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు మద్దతుగా శనివారం వివిధ పక్షాలు, సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. గుంటూరు రాజీవ్‌గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ నుంచి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటి మీదగా డాక్టర్‌ లక్ష్మణ స్వామి ఆసుపత్రి వరకు రోడ్డుకిరువైపులా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చీలు వేసుకొని దాదాపు రెండు వేల మంది దాకా నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. గార్డెన్స్‌, లక్ష్మీపురం, రింగ్‌రోడ్డు, రాజేంద్రనగర్‌, గుజ్జనగుండ్ల, చంద్రమౌళినగర్‌, జేకేసీ తదితర ప్రాంతాలల్లో అపార్టుమెంట్ల వద్ద నిరసనలు తెలపనున్నట్లు టీడీపీ నేత మన్నవ సుబ్బారావు తెలిపారు.  


ఆందోళనలకు ఎన్నారైలు సంఘీభావం

రెండొందలు రోజులుగా ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేస్తోన్న పోరాటానికి అమెరికాలోని ప్రిస్కో నగరంలో ఉంటున్న గుంటూరుకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు సంఘీభావం తెలిపారు. శుక్రవారం వారు కొవ్వుత్తులతో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ శివరావమ్మ మాట్లాడుతూ రైతుల త్యాగం వృథాకాదని, వారికి తన వంతుగా రూ.లక్ష విరాళాన్ని అమరావతి రాజధాని రైతులకు అందజేస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాసరావు కొమ్మినేని మాట్లాడుతూ శనివారం రైతులకు సంఘీభావంగా అందరూ సామాజిక దూరం పాటిస్తూ తమ నివాస ప్రాంతాల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు సంఘీభావం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు విష్ణు, యోగేష్‌, మానస, విద్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T18:21:24+05:30 IST