OU నయా గాథలు : ‘సెక్యూరిటీ’ లేని బతుకులు.. 20 ఏళ్ల సేవకు ఫలితం.. తొలగింపు.. అధికార నేత కోసం ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-11-11T16:42:40+05:30 IST

ఏళ్ల తరబడి ఆరేడు వేల జీతానికే ఆ సిబ్బంది ఉస్మానియా యూనివర్సిటీకి రక్షణగా నిలిచారు. పనికి..

OU నయా గాథలు : ‘సెక్యూరిటీ’ లేని బతుకులు.. 20 ఏళ్ల సేవకు ఫలితం.. తొలగింపు.. అధికార నేత కోసం ఎందుకిలా..!?

  • అధికార నేత కోసం సెక్యూరిటీ గార్డుల బలి
  • పలు నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టిన వైనం
  • అనుకూలంగా వ్యవహరించిన వర్సిటీ వర్గాలు
  • పెద్దఎత్తున బిల్లులు పొంది సగానికి సగమే చెల్లింపు

ఏళ్ల తరబడి ఆరేడు వేల జీతానికే ఆ సిబ్బంది ఉస్మానియా యూనివర్సిటీకి రక్షణగా నిలిచారు. పనికి తగిన వేతనం చెల్లించాలని ఎన్నో మార్లు వర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జీతం పెంచకపోగా, ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  తన ఏజెన్సీని రంగంలోకి దించేందుకు ఇదంతా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి అధిక వేతనాలు చెల్లించి ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని నియమించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సెక్యూరిటీ బాధ్యతలే కాదు.. ఇటీవల వర్సిటీలోని హాస్టల్‌, మెస్‌ ఇలా పలు విభాగాల నిర్వహణ బాధ్యతలను అర్హత లేని సంస్థలకు వర్సిటీ అధికారులు కట్టబెట్టారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కూడా లేని ఆంక్షలు ప్రస్తుతం ఆరంభమయ్యాయి. వర్సిటీలో విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు చేయడానికి ఆంక్షలు విధించడంతో పాటు అవసరమైతే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా వర్సిటీలోకి ఇతరుల ప్రవేశాలను అడ్డుకోవడం స్థానిక సెక్యూరిటీ సిబ్బందితో సాధ్యమవ్వదని, రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. వర్సిటీలోని ఎంట్రీ, ఎగ్జిట్లతో పాటు సెక్యూరిటీ నిర్వహణ మొత్తం రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బందికి అప్పగిస్తూ ఇటీవల వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలోకి రాకపోకలు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే అనుమతించి ఆ తర్వాత పూర్తిగా గేట్లను మూసివేస్తున్నారు.


20 ఏళ్లుగా పని చేస్తున్నా..

ఉస్మానియా యూనివర్సిటీకి మొన్నటి వరకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తించిన సిబ్బంది మొత్తం స్థానికులే. సుమారు 20 ఏళ్లుగా వర్సిటీలో విధులు నిర్వరిస్తున్నారు.  చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కరోనా సమయంలో కూడా విధులు నిర్వర్తించారు. కరోనా నేపథ్యంలో రూ.6 వేల వేతనంలో పది శాతం కట్‌ చేశారు. కట్‌ చేసిన వేతనాలు ఇప్పటి వరకు చెల్లించకపోగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే 150 మందికి పైగా సిబ్బందిని తొలగించారు. దీంతో తమ ఉద్యోగాలు కొనసాగించాలని కొద్ది రోజులుగా వారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారిపై వర్సిటీ అధికారుల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇతర రాష్ట్రాలకు చెందిన..

రూ. 6 వేలకు పని చేసే సిబ్బందిని తొలగించి ప్రస్తు తం నెలకు రూ.19,500 వేతనంతో ఇతర రాష్ట్రాలకు చెం దిన రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బందిని నియమించారు. వీరిలో అత్యధికంగా బిహార్‌, ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.   కనీస వేతనం ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్న సిబ్బందిని తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలో విద్యార్థి ఉద్యమాలను అణగదొక్కేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


తొలగింపు వెనుక..

సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడంలో అధికార పార్టీకి చెందిన కీలకనేత హస్తమున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నతమైన హోదాను అనుభవించిన సదరు నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన పలుకుబడితో యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ పనులను కుటుంబ సభ్యులకు ఇప్పించుకున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఏజెన్సీ దక్కించుకోగా, ఇటీవల వర్సిటీ హాస్టల్‌, మెస్‌ కార్మికుల ఏజెన్సీని దక్కించుకున్నారు. వర్సిటీ హాస్టల్‌, మెస్‌ కార్మికుల ఏజెన్సీ కోసం అర్హత కలిగిన పది సంస్థలు పోటీ పడితే ఎలాంటి అనుభవం లేని సంస్థకు వర్సిటీ వర్గాలు కట్టబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనుభవం కలిగిన ఇతర సంస్థలు పోటీ నుంచి తప్పుకునేలా వర్సిటీలోని కొంతమంది అధికారులు శ్రమించినట్లు సమాచారం. పలుమార్లు సమావేశాలు జరుపుతూ విడతల వారీగా ఒక్కో ఏజెన్సీని తప్పించారు. చివరకు అధికార పార్టీ నేతకు ఏజెన్సీలను కట్టబెట్టడం గమనార్హం. వర్సిటీలో హాస్టల్‌, మెస్‌ కార్మికులు 350మంది వరకు  ఉంటే ఒప్పందంలో 300 ప్లస్‌ అంటూ పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 399 మంది వరకు బిల్లులు పొందే అవకాశాన్ని కల్పించేందుకే అధికారులు ఇలా చేశారని వర్సిటీలో చర్చ జరుగుతోంది.


అరకొర చెల్లింపులు..

యూనివర్సిటీలో గతంలో ఒక సెక్యూరిటీకి నెలకు రూ.9వేలు వేతనముండగా, ప్రస్తుతం రూ.19,500 లు చేశారు. 12గంటలు విధి నిర్వహిస్తే రూ.22వేలు చెల్లించే విధంగా  కాంట్రాక్ట్‌ అప్పగించారు. కొత్తగా సెక్యూరిటీ గార్డులుగా విధుల్లోకి తీసుకున్న రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బందికి కూడా రూ.19,500లో సగమే ఇస్తున్నట్లుగా తెలిసింది. ఒకరిద్దరికి మాత్రమే రూ.15వేలకు పైగా చెల్లిస్తున్నట్లు సమాచారం. మహిళా సెక్యూరిటీ సిబ్బందికి కూడా రూ.9వేలు చెల్లిస్తామని విధుల్లోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే వర్సిటీ నుంచి పెద్దఎత్తున బిల్లులు పొంది అరకొర చెల్లింపులు చేయడంలో ఏజెన్సీ, వర్సిటీలోని కొందరు అధికారులూ భాగస్వామ్యమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నిబంధనల మేరకే ఏజెన్సీల ఎంపిక..

యూనివర్సిటీలో భద్రతను పటిష్టం చేయడానికి రిటైర్డ్‌ ఆర్మీ సిబ్బంది అవసరమని, నిబంధనల మేరకు ఏజెన్సీని ఎంపిక చేశాం. పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం. అర్హత కలిగిన ఏజెన్సీలకే బాధ్యతలు అప్పగించాం. సిబ్బంది బాధ్యతంతా ఏజెన్సీలే చూసుకుంటాయి. ఆందోళన చేసే సెక్యూరిటీ సిబ్బంది గత ఏజెన్సీలకు చెందినవారు. ఆ ఏజెన్సీలే బాధ్యత వహించాలి. యూనివర్సిటీకి సంబంధం లేదు. హాస్టల్‌, మెస్‌ సిబ్బందికి సంబంధించిన ఏజెన్సీ ఎంపికలోనూ పారదర్శకంగా వ్యవహరించాం. మహిళలకు జనరల్‌ డ్యూటీ ఉండేలా, సెక్యూరిటీ సిబ్బందికి బయోమెట్రిక్‌ ఏర్పాటుతో పాటు వేతనాలు ఖాతాలో వేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. అవకతవకలు జరిగితే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదు. - ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌


సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలి

తొలగించిన సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఇటీవల సెక్యూరిటీ ఏజెన్సీ ఖరారు, విధి విధానాలు, సిబ్బందికి చెల్లించే జీతభత్యాలను బహిర్గతం చేయాలి. - ఏఐఎస్‌ఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌ఎన్‌ శంకర్‌.



Updated Date - 2021-11-11T16:42:40+05:30 IST