రసమ్‌థింగ్‌ స్పెషల్‌!

ABN , First Publish Date - 2020-02-29T06:44:25+05:30 IST

ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఫ్రైలు, కర్రీల్లాంటి ఘనాహారాలతో నోట్లో ముద్ద దిగదు. సర్రున జారే సాంబార్‌, సుర్రుమనే రసాలుంటే మేలనిపిస్తుంది. ఈ రసాలు రుచిలోనే కాదు... ఆరోగ్య పరంగా కూడా దివ్యౌషధాలు. జీర్ణక్రియ సరిగా జరిగేటట్టు చేస్తాయి. బరువు తగ్గడానికి...

రసమ్‌థింగ్‌ స్పెషల్‌!

ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో  ఫ్రైలు, కర్రీల్లాంటి ఘనాహారాలతో నోట్లో ముద్ద దిగదు. సర్రున జారే సాంబార్‌, సుర్రుమనే రసాలుంటే మేలనిపిస్తుంది. ఈ రసాలు రుచిలోనే కాదు... ఆరోగ్య పరంగా కూడా దివ్యౌషధాలు. జీర్ణక్రియ సరిగా జరిగేటట్టు చేస్తాయి. బరువు తగ్గడానికి రసాలు బ్రహ్మాస్త్రాలు. వేసవి వేడి మొదలైన వేళ... రసాల గుబాళింపు, వాటి పసందైన రుచులతో ‘రసమ్‌’థింగ్‌ స్పెషల్‌ అనాల్సిందే!


పచ్చి మామిడి రసం

కావలసినవి: పచ్చిమామిడికాయ-ఒకటి, కందిపప్పు- ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి-ఒకటి, పసుపు-అర టీస్పూన్‌, ఉప్పు-రుచికి సరిపడినంత, నెయ్యి- రెండు టీస్పూన్లు, ఇంగువ-పావు టీస్పూన్‌, వెల్లుల్లిపాయలు-నాలుగు, పుదీనా ఆకులు-1/3 కప్పు, ఎండుమిర్చి- నాలుగు, మిరియాలపొడి-పావు టీస్పూన్‌, కరివేపాకులు-గుప్పెడు, బెల్లం తురుము-పావు టీస్పూన్‌, రసం పొడి- ఒక టీస్పూన్‌, 


తయారీ:

  1. మామిడికాయ మీద తొక్క పూర్తిగా తీసేసి ముక్కలుగా తరగాలి.
  2. కుక్కర్‌లో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో పచ్చిమామిడికాయముక్కలు, పసుపు, కందిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒక విజిల్‌ వచ్చేదాకా స్టవ్‌పై ఉడి కించి, ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై దాన్ని ఉంచాలి. తర్వాత కిందికి దించి అందులో ఆవిరి పోయేదాకా అలాగే ఉంచాలి.
  3. చిన్న పాన్‌లో నెయ్యి వేడెక్కగానే అందులో ఇంగువ వేసి గరిటెతో కదపాలి. తర్వాత అందులో కరివేపాకు, వెల్లుల్లి పాయల పేస్టు, ఎండు మిర్చి వేసి వెల్లుల్లి పేస్టు బ్రౌన్‌ రంగులోకి వచ్చేదాకా వేగించాలి. 
  4. ఉడకబెట్టి ఉంచిన పచ్చిమామిడి రసాన్ని, దాల్‌ని అందులో పోయాలి. వీటితో పాటు బెల్లం, మిరియాలు, రసంపొడులు, పుదీనా ఆకులను వేసి ఉడికించాలి.
  5. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో తింటే మజాగా ఉంటుంది.

కల్యాణ రసం

కావలసినవి: టొమాటోలు-2 (ముక్కలుగా చేసి), పచ్చిమిర్చి- 3, చింతపండు-సగం నిమ్మచెక్క పరిమాణం, వెల్లుల్లి రెబ్బలు-4, కరివేపాకు-గుప్పెడు, పసుపు-పావు టీస్పూన్‌, ఉప్పు- సరిపడా, కుక్కర్‌లో- ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి, సాంబారుపొడి-రెండు టీస్పూన్లు, కారం-పావు  టీస్పూను, తరిగిన కొత్తిమీర. కందిపప్పు-చిన్న గ్లాసుడు తీసుకుని బాగా కడిగి కుక్కర్‌లో విడిగా ఉడికించి మెత్తగా చేసి రెడీగా పెట్టుకోవాలి.


తయారీ:

కుక్కర్‌లో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వీటిలో ఒక గ్లాసు నీరు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ స్టవ్‌ మీద ఉడికించాలి. 

కుక్కర్‌ నుంచి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత పప్పుగుత్తితో కుక్కర్‌లోని మిశ్రమాన్ని మరింత మెత్తగా చేయాలి. ఆ తర్వాత కుక్కర్‌ని మళ్లీ స్టవ్‌ మీద పెట్టి అందులో రెండు టీస్పూన్ల సాంబారుపొడి, పావు టీస్పూన్‌ కారం వేసి కలపాలి. అందులో తరిగిన కొత్తిమీరను కాడలతో సహా వేయాలి.

మళ్లీ మరో గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఉప్పు తక్కువవుతందనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. మధ్యమధ్యలో కలుపుతూ రసాన్ని బాగా మరిగించాలి. ఈ రసం ఒక పొంగుకు వచ్చిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మరిగించాలి. తరువాత ఉడికించి మెత్తగా చేసిన పప్పును రసంలో  కలపాలి.

రసం ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి దాన్ని పదిహేను నిమిషాలపాటు మరిగించాలి. రసం మరుగుతుండగానే ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ఒక టీస్పూను నూనె, ఒక టీస్పూను ఆవాలు వేసి అవి చిటపటలాడేటప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని, రెండు మూడు ఎండు మిర్చి ముక్కలను తాళింపులో వేయాలి. అవి కాస్త వేగినట్టయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేయాలి. 

చిటపటలాడుతున్న తాలింపును ఉడుకుతున్న రసంలో వేసి మరో రెండు మూడు నిమిషాలు మరిగించాలి. అంతే నోరూరించే కల్యాణ రసం రెడీ. ఈ రసం వేసవిలో చాలా మంచిది.


కొబ్బరిపాల రసం

కావలసినవి: ఇంగువ-చిటికెడు, కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు,  చిక్కటి కొబ్బరిపాలు-ఒక కప్పు, ఆవాలు- అర టీస్పూన్‌,  చింతపండు-ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు-ఒక టీస్పూన్‌, పసుపు-పావు టీస్పూన్‌, కొబ్బరినూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి -ఒకటి (అందులోని గింజలు తీసి చిన్న ముక్కలుగా), కరివేపాకులు-ఏడు, వేడినీళ్లు- అర కప్పు, చల్లటి నీళ్లు-ఒకటిన్నర కప్పు,  రసంపొడి- రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ:

  1. అరకప్పు వేడి నీళ్లల్లో చింతపండును అరగంటపాటు నానబెట్టి దాన్నించి చిక్కటి రసం తీయాలి.
  2. బాండీ తీసుకుని అందులో చింతపండు రసం పోసి అందులో ఒకటిన్నర కప్పుల  నీళ్లు కలపాలి.
  3. అందులో పావు టీస్పూను పసుపుతో పాటు రెండు టేబుల్‌స్పూన్ల రసం పొడి వేసి గరిటతో బాగా కలపాలి.
  4. కడాయిలోని రసం మరిగే దాకా  సన్నని మంటపై దాన్ని అలాగే ఉంచాలి. 
  5. రసం మరగడం మొదలైన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు అదనంగా మంటపై ఉంచాలి. 
  6. తర్వాత మంట ఆపేసి అందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరిపాలు పోసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత దాన్ని ఒకసారి  కలిపి మూతపెట్టి పక్కన పెట్టాలి.
  7. తర్వాత చిన్న కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనె (లేదా నెయ్యి కూడా వాడొచ్చు) వేసి వేడెక్కాక కాస్త మంట తగ్గించి రసంలో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుంటే అందులో రెడీగా పెట్టుకున్న ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకులు అందులో వేయాలి. తాలింపు బాగా వేగాక దాన్ని కొబ్బరిపాల రసంలో వేయాలి. దానిపై కొత్తిమీరాకును చల్లాలి. వేడి అన్నంలో ఈ కొబ్బరిపాల రసం ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-02-29T06:44:25+05:30 IST